🔱 అంతర్యామి 🔱
# జీవిత మకరందం..
🍁సంతోషంగా జీవించడం ఏమంత తేలికైన
విషయం కాదు. జీవితం సవాళ్లతో నిండి
ఉంటుంది. జీవనక్రమంలో విజయం, ఆనందం తారసపడుతుంటాయి. కానీ జీవితం చాలావరకూ నిరాశతోనే గడిచిపోతుంది. ఎందుకంటే, చాలామంది విజయాన్ని ఆనందంతో సమానం అనుకుంటారు. కేవలం కీర్తిప్రతిష్ఠలు, డబ్బు ఆనందాన్ని కలిగించవు. ఆనందం మన సొంత చర్యల నుంచి, లోలోపలి నుంచి ఉద్భవిస్తుంది. విజయాన్ని కీర్తి, డబ్బు, అధికారంతో కొలవడమనేది సామాజికపరమైంది. ఆ ఉచ్చులో పడకూడదు. వినయం ప్రధానం. అంతిమంగా, లోపల ఉన్న ఆత్మ వాస్తవం. అదే ముఖ్యమైంది. బాహ్య, వాతావరణం కాదు. సత్యాన్ని, ధర్మాన్ని • అనుసరించాలి. పోరాడకుండా దేన్నీ విడిచిపెట్టకూడదు. సామర్థ్యాన్ని పూర్తి పరిమితుల మేర విస్తరించేదాకా నిష్క్రమించకూడదు. అప్పుడే జీవితం విలువైందిగా అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడే అసలైన ఆనందం అనుభవంలోకి వస్తుంది. జీవితం నాణ్యతను ఈ ఆనందక్షణాల ద్వారానే గ్రహిస్తుంటాం. ఆనందం అంతిమమైనదే. దానిని ఎవరికివారు అనుభూతి చెందాలి.
🍁'మీ ప్రథమ కర్తవ్యం ఆనందంగా ఉండటమే' అని వందేళ్ల క్రితమే స్వామి రామానందతీర్థ చెప్పారు. సాధువులు ఆనందమార్గాన్ని ఆటంకపరచే అడ్డంకులేంటో కనుగొన్నారు. వాటిని తొలగించుకుని ముందుకు వెళ్లే నిర్ణీత పద్ధతుల్ని తెలియజేశారు. విజయమార్గంలో కోరిక పుడుతుంది. కోరిక ఎదుగుదలను నిరోధిస్తుంది. శక్తిహీనుల్ని చేస్తుంది. కోరిక వలయంలో చిక్కుకున్న మనిషి బయటపడటం అంత తేలిక కాదు. భగవద్గీత కోరికలను వదిలేయమని చెప్పదు. పరిపూర్ణతను కలిగించే ఒక ఉన్నతస్థాయి కోరిక వైపునకు ఎదగమంటుంది.
🍁ఆనందం అంటే వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలు. కొందరికి ఆర్థికపరమైన భద్రత, కొందరికి అర్థవంతమైన సంబంధాలు, ఆరోగ్యం అయితే ఇంకొందరికి ఎదుగుదల. ఆనందా. నిర్వచించాలంటే- సంతృప్తి వైపు చేసే ప్రయాణంలో ముఖ్యమైన మొదటి అడుగు. క్షణికానందాలకు విలువ కచ్చితంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఆనందానికి స్వీయ ఆలోచనలు, స్పృహతో కూడిన ప్రయత్నం, సానుకూల దృక్పథం... అవసరం. ఆ దిశగా చేసే ప్రయత్నాలు మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. కాలం గడిచినకొద్దీ మానసిక శ్రేయస్సుకు తోడ్పడతాయి.
🍁ఇష్టమైన పనిలో మునిగిపోయినప్పుడు కలిగిన ఆనందం ఒక ప్రవాహం లాంటిది. సంగీత కళాకారులు, చిత్రకారులు, నటీనటులు... తమ నైపుణ్యంతో గంటల తరబడి నిమగ్నమై ఆనందంలో మునిగిపోతారు. ఆ కళను ఇష్టపడేవారిని సైతం అందులో ముంచెత్తుతారు. మన స్వభావం, దృక్పథం... తృప్తిలో ప్రభావవంతమైన భూమికను పోషిస్తాయి. నిరంతర అభ్యాసం, లక్ష్యాలను కలిగి ఉండటం వల్ల ఉత్సాహం, పురోగతి లభిస్తాయి. దాటే ప్రతి మైలురాయి పురోగతితోబాటు ఆనందాన్నీ ఇస్తుంది.
🍁జ్ఞానసాధనే లోతైన ఆనందాన్ని అందిస్తుందని తెలుసుకోవాలి.🙏
-✍️ మంత్రవాది మహేశ్వర్
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment