Tuesday, September 24, 2024

 Vedantha panchadasi:
అనువృత్తేఽ పీశసృష్టే ద్వైతే తస్య మృషాత్మతామ్ ౹
బుద్ధ్వా బ్రహ్మద్వయం బోద్ధుం శక్యం వస్త్వైక్యవాదినః ౹౹40౹౹

40.ఈశ్వరసృష్టమగు ద్వైతము నశింపకున్నను అది మిథ్యయని తెలిసికొని అద్వైతవాది అద్వయమగు బ్రహ్మబోధను పొందగలడు.

ప్రలయే తన్నివృత్తౌ తు గురుశాస్త్రా ద్యభావతః ౹
విరోధి ద్వైతాభావేపి న శక్యం బోద్ధు మద్వయమ్ ౹౹41౹౹

41.ప్రళయమునందు ద్వైతప్రపంచము నశించును. గురువు శాస్త్రము మొదలైనవేవీ ఉండవు.ఇట్లు ద్వైతముపశమించినను,నిద్రలో వలె,ఎవరికిని అద్వయ బ్రహ్మబోధ కలుగుట లేదు.

అబాధకం సాధకం చ ద్వైత మీశ్వరనిర్మితమ్ ౹
అపనేతుమశక్యం చేత్యాస్తాం తద్ద్విష్యతే కుతః ౹౹42౹౹

42.ఈశ్వరనిర్మితమైన ద్వైతము అద్వయ బ్రహ్మజ్ఞానమునకు భాధకము కాదు.మీదు మిక్కిలి సహకారము కూడ.దానిని నిర్మూలించుట కూడా అసాధ్యమే.కనుక దానిని ఉండనిమ్ము.దాని పట్ల ద్వేషమెందుకు?

జీవద్వైతం తు శాస్త్రీయమశాస్త్రీయమితి ద్విధా ౹
ఉపాదదీత శాస్త్రీయమాత్త్వస్యావబోధనాత్ ౹౹43౹౹

43.జీవసృష్టమైన ద్వైతము శాస్త్రీయము అశాస్త్రీయము అని రెండు విధములు.తత్త్వము అవగతమగునంత వరకు శాస్త్రీయమగు జీవద్వైతము మనస్సున ఉంచుకొనవలెను.

శాస్త్రములు సూచించిన విధముగా  
మోక్ష స్థితిలో నెలకొన్నవారు తమ చైతన్యము ఆత్మవైపు ప్రసరించునుగనుక,ఈ ప్రపంచదృశ్యమను సముద్రమును నిశ్చింతముగా దాటుదురు.

కానీ దుఃఖమును,గందరగోళమును మాత్రమే కలిగించు తార్కిక వాదమను వలలో చిక్కుకొన్నవారు తమ పరమ శ్రేయమును పోగొట్టుకొందురు.

శాస్త్రములు చూపిన మార్గ విషయమున గూడ వ్యక్తియొక్క ప్రత్యక్షానుభవముమాత్రమే అతనిని సురక్షితమగు పరమగమ్యపు దారివెంట నడుపును.

శుద్ధచైతన్యమే రజోగుణవశమున
"నేను"
అను మలినభావనను పెట్టుకొని తన సహజమగు ప్రకాశరూపమును విడువకయే అహంకార,ప్రాణ,దేహ,ఇంద్రియాది వికృతరూపమును అనుభవగోచరముగావించుకొనును

ఈ వికృతరూపము నిజముగా అసత్యమయినను,(నేను అను) అహంకారము ఇది యథార్థముగా ఉన్నట్లు నమ్మి భ్రాంతిజెందును.

లోభికి పిడికెడు బూడిద తప్ప మిగులునదేమున్నది?
కానీ ప్రపంచమును గడ్డిపోచకంటె తక్కువ విలువ గల దానినిగా భావించు వ్యక్తి ఎన్నటికిని దుఃఖమును పొందడు.

తన స్వీయధర్మముతో తృప్తిచెందక తాను విన్న ఉపదేశముపట్ల ఆసక్తుడయి సత్యమార్గమున నడుచుటకు గట్టిగా ప్రయత్నించువానిని మాత్రమే మానవునిగా పరిగణింతురు.

శాస్త్రముల ఆదేశములను అనుసరించుచు వ్యక్తి సహనముతో సిద్ధికొరకు నిరీక్షింపవలెను,అది తన సమయమున లభించును.

మోక్షము కొరకు ఈ పుణ్య శాస్త్రమమునధ్యయనము చేయుచు అధోగతిని అరికట్టుము.
"ఇది కేవలము ప్రతిబింబమే"అని తెలిసికొనుచు నిరంతరము సత్యతత్త్వమును విచారింపుము.

దురదృష్టము అత్యుత్తమమగు అదృష్టము.అందరు తిరస్కరించుటే విజయము.       

No comments:

Post a Comment