Vedantha panchadasi:
తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః ౹
నానుధ్యాయా ద్బహూఞ్ఛబ్దాన్వాచో విగ్లాపంనం హి తత్ ౹౹47౹౹
47.ప్రత్యగాత్మయే బ్రహ్మమని సాక్షాత్కరించుకొనిన ధీరుడు తన ప్రజ్ఞను బ్రహ్మమునందు ఏకము చేసి ఉంచుకొనవలెను.మనస్సును అనేక శబ్దములచే నింపరాదు.ఏలన అది మనస్సును పీడించును.
(బృహ 4.4.21:వివేకచూడామణి 321-325.)
దేహాంద్రియాది సముదాయములయిన "నేను","వీడు","వీని పుత్రుడు", "నాక్షేత్రము","నాధనము",
"నేను సుఖము గలవాడను",
నేను దుఃఖము గలవాడను అనెడి భిన్నభావనలచే(శబ్దములచే)
మనస్సును నింపరాదు.ఏలన అవి మనస్సును పీడించును.
శంఖము పూరింపబడినప్పుడు బాహ్య శబ్దములు తెలిసికొనుటకు వీలుకాదు.శంఖము యొక్క శబ్దమే తెలియును.ఆప్రకారముగా ఆత్మ స్వరూపమును తెలిసికొనుటచే దానికంటె అన్యమగు విశేషమేదియును లేకపోవుట వలన సర్వము బ్రహ్మ స్వరూపమగుచున్నది.
వీణ వాయించుచుండగా బాహ్యశబ్దములను తెలిసికొనుటకు వీలుకాదు.వీణావాద్యధ్వని మాత్రమే తెలియుచున్నది.
ఆ ప్రకారముగానే స్థితి కాలమందు పరబ్రహ్మము సామాన్య వస్తువులకు వేరుకాక పోవుట వలన సర్వము పరబ్రహ్మ మాత్రముగానే తెలిసికొనుటకు వీలగుచున్నది.
ఏ ప్రకారముగా నదీ వాపీ తటాకాదులయందున్న సమస్త జలములకును సముద్రమే ఏక స్వరూపముగా నిలయమగుచున్నదో,ఈ రీతిగానే మృదు కఠినాది సమస్త స్పర్శలకు త్వక్కును,మధురామ్లాది సమస్తరసములకు జిహ్వయును, సమస్త గంధములకు
నాసికయును,
సమస్త రూపములకు నేత్రమును, అన్ని శబ్దములకు శ్రోత్రమును, సంకల్పములన్నింటికి మనస్సును, విద్యలన్నింటికి హృదయమును, కర్మలన్నింటికి హస్తములును, ఆనందములన్నింటికి యోనియును,విసర్గములన్నింటికి పాయువును, మార్గము లన్నింటికి పాదములును,వేదములన్నింటికి వాక్కును,వేఱుకాక పోవుటవలన ఆ విషయములు తామేయగుచున్నవి.
ఈ రీతిగా సర్వేంద్రియములును తమ విషయములన్నిటితోను క్రమముగా ప్రళయమును పొంది మనో మాత్రమగు చున్నవి.మనస్సు విజ్ఞానమాత్రమగు చున్నది.
ఆ విజ్ఞాన స్వరూపము నీటియందున్న ఉప్పుగడ్డ రీతిగ నిరుపాధిక మగుట వలన,ప్రజ్ఞాన ఘనస్వరూపమగు పరమాత్మయందు విలీనమగుచున్నవి.
దేహేంద్రియ విషయాకారములుగా పరిణమించిన భూతముల నుండి అజ్ఞానముచే నామరూపములు పుట్టి మరల ఆత్మయందే లీనమగుచున్నవి.
శాస్త్రోచార్యోపదేశమైన బ్రహ్మవిద్యచేత,అజ్ఞానముచే వచ్చిన ఆ జీవభావము నశించుచున్నది.
ఇట్లు అజ్ఞానము నశించిన పిమ్మట జీవాత్మ,బ్రహ్మజ్ఞానముచేత స్వచ్ఛమైనదియు ప్రజ్ఞాన ఘనస్వరూపమునగు పరమాత్మయయే యగుచున్నాడు.
No comments:
Post a Comment