Thursday, September 26, 2024

 *నారాయణ భూతం*
                       

*ఆది శంకరాచార్యులవారి భక్తి ప్రార్ధనలకి మెచ్చి శ్రీమహాలక్ష్మి కనక వర్షం కురిపించిన గాధ మనకి తెలుసు.*

*అదేవిధంగా ‘ముకుందుడ’నే భక్తునికి నారాయణుడు సిరిసంపదలు అనుగ్రహించిన కధ  ఒకటి వున్నది.*

*కాంచీపురం లో కాశ్యపుడనే పేద బ్రాహ్మణుడు వుండేవాడు. పేదరికంతో అష్టకష్టాలు పడుతున్న బడుగు కుటుంబం.* 

*ఒకనాడు ఆ కశ్యపుని పెద్ద కుమారుడైన ముకుందుడు కావేరి అవతలి తీరానికి వెళ్ళి ధనం సంపాదించుకుని రావాలని బయల్దేరాడు.*

*అక్కడ వున్న ఒక ఆలయంలోని యోగికి భక్తితో నమస్కరించి తన దీనగాధ చెప్పాడు.*   

*ఆ యోగి ముకుందుని చూసి జాలిపడి 'ఓమ్ నమో నారాయణ' అనే మంత్రాన్ని ఉపదేశించాడు.*

*ఈ మంత్రాన్ని నమ్మకంగా జపిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఆన్నాడు.* 

*ఇది విన్న ముకుందుడు పరవశించాడు. ఆలయంలోని ‘సెంపొన్ రంగనాధుని’ ముందు ఆశీనుడై భక్తి శ్రధ్ధలతో మంత్రం జపించ నారంభించాడు.*

*వరుసగా 3 రోజులపాటు 32  వేల సార్లు  నారాయణ మంత్ర జపం చేశాడు.*

*ఆనాటి సాయంకాలం అక్కడ నుండి బయలుదేరాడు.*

*ఒక అడవిప్రాంతానికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. మార్గం సరిగా తెలియలేదు. దుష్ట మృగాలభయంతో ప్రక్కనే వున్న మఱ్ఱి చెట్టు ఎక్కి  ఒక పెద్ద కొమ్మ మీద పడుక్కున్నాడు. పడుకోగానే కళ్ళు మూతలు పడ్డాయి. రాత్రి మూడవ జామున ఏవో మాటలు వినబడి ముకుందునికి మెలకువ వచ్చింది.  కళ్ళు తెరచి చూడగా చెట్టు క్రింద కొంతమంది దొంగలు చేతుల్లో ఆయుధాలు, కాగడాలతో నిలబడి వున్నారు. వారి వద్ద విలువైన ఆభరణాలు ఎన్నోవున్నవి. చెట్టు మీద నుండి వారి చర్యలను గమనించ సాగాడు ముకుందుడు.*

*చెట్టు క్రింద వున్న దొంగలు… 'నారాయణ భూతమే దూరం జరుగు దూరం జరుగు'  ఆని అయిదు సార్లు పఠించారు.* 

*వెంటనే ఆ  చెట్టు రెండుగా చీలింది.  లోపల ఒక  పెద్ద సొరంగం. దొంగలు లోపలికి వెళ్ళి దొంగిలించిన సొమ్ము నగలను లోపల పెట్టి బయటికి వచ్చి మరల 'నారాయణ భూతమే మూసి వేయి' అని మూడుసార్లు అన్నారు. ఆ చెట్టు మామూలు స్ధితికి వచ్చింది.* 

*దొంగలు అక్కడ నుండి వెళ్ళి పోయారు. ఇవన్నీ చూసిన ముకుందునికి భయము, ఆశ్చర్యం కలిగింది. దీనిని మించిన విశేషం  మరియొకటి జరిగింది. ముకుందునికి నారాయణుడు దర్శనం అనుగ్రహించాడు.*

*"ముకుందా.. క్రిందకి దిగి నారాయణభూతాన్ని జరగమని చెప్పి , నీకు కావలసిన సంపదలు తీసుకొన’మని ఆదేశించాడు.* 

*భగవంతుని ఆజ్ఞ మేరకు ముకుందుడు సొరంగంలోకి వెళ్ళి తమ కష్టాలు తీరడానికి వలసినంత ధనాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. తరువాత మరల ఆలయానికి వెళ్ళి భగవంతునికి కృతజ్ఞతలు తెలిపాడు. సంపదలతో కాంచీపురానికి వెళ్ళాడు. తన దగ్గరున్న ధనంతో దాన ధర్మాలు చేస్తూ తన కుటుంబంతో సుఖంగా జీవించి  తను చేసిన పుణ్యకార్యాల ఫలంగా వైకుంఠం చేరాడు ముకుందుడు.* 

*ముకుందునికి దైవం అనుగ్రహించిన ఆలయం పేరు ‘సెంపొన్ సెయ్ ఆలయం’ (తిరునాంగూరు).  తిరుమంగై ఆళ్వార్ చే స్తుతించబడిన ఆలయం.*
*ముకుందునికి సంపదలు అనుగ్రహించిన నారాయణుడు ఇక్కడ 'సెంపొన్ రంగన్' అనే పేరుతో  కొలువై వున్నాడు.*

*శీర్కాళి నుండి నాగపట్నం వెళ్ళే మార్గంలో ‘అన్నైకోవిల్’ అనే ఊరు వున్నది. అక్కడ నుండి దక్షిణంగా మూడు కి.మీ దూరం వెడితే  ‘సెంపొన్ సెయ్’ ఆలయానికి చేరుతారు.*.    

No comments:

Post a Comment