☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
10. శ్రద్ధయా సత్యమాప్యతే
శ్రద్ధ చేతనే సత్యం లభిస్తుంది(యజుర్వేదం)
'సత్యం' అనేది త్రికాలలోనూ నశించనిది. అదే పరతత్త్వం, ఆత్మతత్త్వం. దానిని
సాధించాలంటే 'శ్రద్ధ' ముఖ్యం. ఏ గొప్ప విషయాన్ని సాధించాలన్నా ఈ శ్రద్ధ
ప్రధానం.
'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' - అని భగవద్గీత (శ్రద్ధావంతునికే జ్ఞానం లభిస్తుంది).
'శ్రద్ధ' అంటే - చేసే పనియందు ఏకాగ్రత, సంపూర్ణ అవగాహన, ఆసక్తి, శక్తివంచన
లేకుండా ఆచరించుట... అని అర్థం.
శ్రద్ధా విశ్వాసాలు రెండూ భక్తిలో ప్రధానమని తులసీదాసు పేర్కొన్నాడు. వాటిని
భవానీశంకరులుగా భావించాడు. అంటే పార్వతీపరమేశ్వరులు ఎంత అవిభాజ్యులో,
అలా శ్రద్ధావిశ్వాసాలు వీడకుండా ప్రధానమై ఉండాలని భావం.
భవానీ శంకరౌ వందే
శ్రద్ధా విశ్వాస రూపిణీ|
యాభ్యాం వినా న పశ్యంతి
సిద్ధాః స్వాతంస్థమీశ్వరమ్||
"శ్రద్ధావిశ్వాస రూపిణులైన భవానీశంకరులకు నమస్సు. వారు లేనిదే సిద్ధులు
హృదయంలోనున్న దైవాన్ని దర్శించలేరు.”
న కర్మణా న తపసా న జపైర్న సమాధిభిః।
న జ్ఞానేన న చాన్యేన వశ్యోహం శ్రద్ధాయా వినా॥
అని 'శివపురాణం'లో శివుడు పార్వతికి చెప్పిన మాటలు. “నేను ఏ కర్మల చేత
గానీ, తపముల చేతగానీ, జపముల చేతగానీ, సమాధుల చేతగానీ, జ్ఞానం చేతగానీ వశ్యుడను కాను. నేను కేవలం శ్రద్ధకే వశ్యుడను.”
శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం
యేన కేనాపి హేతునా।
వశ్యః స్పృశ్యశ్చ దృశ్యశ్చ
పూజ్యస్సంభాష్య ఏవ చ||
“నాపై శ్రద్ధ నుంచిన వారికి వశ్యుడనవుతాను. అంతేకాక - శ్రద్ధావంతుడు నన్ను స్పృశించగలడు, చూడగలడు, పూజించగలడు, సంభాషించగలడు" అని 'సత్య స్వరూపుడైన పరమేశ్వరుని మాట.
సత్యానుభవం కావాలంటే శ్రద్ధ ప్రధానమని శాస్త్రాలన్నీ స్పష్టీకరిస్తున్నాయి.
సాధ్యా తస్మాన్మయి శ్రద్ధా
మాం వశీకర్తుమిచ్ఛతః
శ్రద్ధా హేతుస్స్వధర్మస్య
రక్షణం వర్ణినామిహ||
“కనుక నన్ను వశం చేసుకోవడానికి శ్రద్ధను అవలంబించాలి. శ్రద్ధకు స్వధర్మ
రక్షణమే కారణం.”
కాబట్టి స్వధర్మరక్షణం ప్రధానం.
ధర్మనిర్వహణ లేనిదే దైవం కూడా సాధ్యం కాదు.
ధర్మాన్ని విడిచి ఎన్ని జపతపాలు చేసినా దైవం అనుగ్రహించడు. సత్య సాక్షాత్కారం
జరగదు. 'ధర్మ నిర్వహణమే శ్రద్ధ' అని కూడా భావం.
No comments:
Post a Comment