☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
47. తస్మాత్ దక్షిణేనాన్నమద్యతే
కుడిచేతితోనే భుజించాలి(యజుర్వేదం)
ఏ పనికైనా కుడిచేతి(దక్షిణహస్తం)ని ఉపయోగించడం మన అలవాటు. ఆలోచించి చూస్తే ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది యుగయుగాలుగా మన వేదసంస్కృతి శాసించింది. ఇది మనకు అభ్యాసంగా మారింది. అసుర శక్తుల నుండి యజ్ఞాన్ని కాపాడేందుకు దక్షిణహస్త వినియోగాన్ని చేసినట్లుగా వేదం అభివర్ణిస్తోంది.
అంటే ఎడమచేతికి అసురీ శక్తులను ఆకర్షించే అవకాశముందన్న మాట.
ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా ఎడమచేతితో ఇవ్వరాదు. రెండు చేతులతో కలిపి ఇచ్చే సందర్భాలలో వేరు. అలాగే ఎవరి చేతి నుండైనా ఎడమ చేతితో
మాత్రమే వస్తువును స్వీకరించరాదు. ఇది అగౌరవానికీ, నిర్లక్ష్యానికీ చిహ్నం.
(మర్యాదలు మనకి అలవాట్లుగా మార్చిన ఇన్నాళ్ళ సంస్కృతిని విస్మరిస్తే మళ్లీ భారతీయులమై సనాతనమార్గాన్ని తప్పినవారమయ్యే ప్రమాదముంది. కనుక తరువాతి తరాలకు ఈ చిన్నచిన్న విషయాల్లో సైతం అప్రమత్తంగా ఉండే విధంగా మెలకువలు నేర్పడం పెద్దల బాధ్యత.)
మనకు దేవతాశక్తుల దీవెనలు లభించాలనే ఉద్దేశంతో పెద్దలు ఈ విధమైన సంప్రదాయాలను ఏర్పరచారు. ఇవి ఎంతో సూక్ష్మ పరిశీలనతో ఏర్పరచినవి.
ఇటీవల మనదేశానికి దిగుమతి అయిన 'రేకీ' వంటి విద్యల్లో కూడా కుడిచేయి దేవతా శక్తులకు సంకేతమనే సూచిస్తున్నారు. అలాగే మన పూజాదికాల ఆచారాల్లో దక్షిణాచార, వామాచార అనే పద్ధతులున్నాయి. దక్షిణాచారం సాత్వికము, హితకరమూ,
వ్యక్తికీ, లోకానికీ శుభంకరము అని పెద్దలు చెబుతారు. ఈ ఆచారంలో కుడిచేతిని మాత్రమే ఉపయోగించుతారు.
దేవతాపూజలు చేసేటప్పుడు కూడా పువ్వులు వేయడం, అర్ఘ్యపాద్యాదులు
ధూపదీపనీరాజనాదులు సమర్పించడం కుడిచేతితోనే చేయాలి. పూజాద్రవ్యాలు మనకు కుడివైపునే ఉంచుకోవాలి. నివేదన చేసే ఆహారాదులు సైతం దక్షిణభాగాన్నేఉండాలి.దక్షిణహస్తంతోనే నివేదించాలి.
ఎంతో లోతైన పరిశీలనతో ద్రష్టలైన మన పూర్వీకులు చెప్పిన ఈ విషయాలను మనం పెడచెవిని పెడుతున్నాం. ఎన్నోచోట్ల ఎడమ చేతిని మాత్రమే ఉపయోగిస్తున్నాం.
అన్నం తినడంలో ఎడమచేతిని వాడడం కూడా చూస్తుంటాం. రెండుచేతులతో తినడం
అభారతీయం (అనాగరికం). ఇది రాక్షసాచారం. అసురీశక్తుల్ని ఆవహింపజేసుకుని అధోగతి పాలు అయ్యేందుకు అవకాశం.
ఎడమ చేతితో ఆహార పదార్థాన్ని పట్టుకొని కుడిచేత్తో తినడం తగదు. మన అలవాట్లలో వైదిక మంత్ర బోధ ఎలా కలిసిపోయి వస్తోందో పై మంత్రాన్ని పరిశీలిస్తే అర్థమౌతుంది. ఇతరులకు వస్తువులు ఇచ్చేటప్పుడు కూడా ఎడమచేతితో ఇవ్వడం
అమర్యాద. పుచ్చుకోవడమూ అవలక్షణమే.
ఈ మర్యాదలు మనకి అలవాట్లుగా మార్చిన ఇన్నాళ్ళ సంస్కృతిని విస్మరిస్తే మళ్లీ అభారతీయులమై సనాతనమార్గాన్ని తప్పినవారమయ్యే ప్రమాదముంది.
కనుక తరువాతి తరాలకు ఈ చిన్నచిన్న విషయాల్లో సైతం అప్రమత్తంగా ఉండే విధంగా మెలకువలు నేర్పడం పెద్దల బాధ్యత.
No comments:
Post a Comment