అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-170.
116d3;1010e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣0️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️```
(సరళమైన తెలుగులో)```
*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*30. వ శ్లోకము:*
*”యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।*
*తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి” ॥ 30 ॥*
“ఎవరైతే సకల భూతములలో నన్ను, నా యందు సకల భూతములను చూచుచున్నాడో. అటువంటివాడికి నేను కనపడకుండా బోను. అతడు నాకు కనపడకుండా బోడు.
```
ఈ శ్లోకం పై శ్లోకం లో చెప్పబడిన అర్ధం తెలియజేస్తుంది కానీ, చిన్న మెలిక ఉంది. నాటి కృతయుగం నాటి హిరణ్యకశిపుని దగ్గర నుండి నేటి హేతువాదుల వరకు ఒకటే మాట. ‘దేవుడు ఏడీ! ఎక్కడ ఉన్నాడు! ఉంటే కనపడడేం నీకు కనపడితే చూపించు!’ అని అడుగుతుంటారు. మరి కొందరు భక్తులు, స్వామీజిలను, బాబాలను, వాళ్లే దేవుళ్లుగా భావించి మొక్కు తుంటారు.
కాని దేవుడు ఎవరికి కనిపిస్తాడు. దేవుడిని ఎవరు చూడగలరు అన్న విషయం ఇక్కడ చెప్పాడు భగవానుడు… ‘ఎవడైతే సకల చరాచర భూతములలో నన్ను చూస్తున్నాడో, నాయందే ఈ చరాచరజగత్తును దర్శిస్తున్నాడో, వాడికి నేను కనపడతాను. వాడు నాకు కనపడతాడు.’ కాబట్టి దేవుడిని చూడాలంటే ఈ స్థితికి చేరుకోవాలి.
రాష్ట్రపతిని చూడాలంటే ఢిల్లి వెళ్లాలి. రాష్ట్రపతి భవన్ కు వెళ్లాలి, ముందస్తుగా ఎన్నో అనుమతులు తీసుకోవాలి. ఇంత తతంగం ఉంది. మన ఇంట్లో కూర్చుని “రాష్ట్రపతి ఏడీ! ఎక్కడున్నాడు! ఉంటే నాకు కనపడమను!” అంటే ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంటుంది. ప్రతి దానికీ ఒక అర్హత ఉంటుంది. దేవుడిని దర్శించడానికీ ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హత సంపాదించడానికే మొదటి ప్రయత్నంగా, దేవుడిని గురించిన భావనను మన మనసులలో నింపడానికి దేవాలయాలు ఆవిర్భవించాయి. దేవాలయంలో దేవుడు ఉన్నాడు అని ప్రతిపాదించాయి.
కాని మనం ఆ దేవాలయాల దగ్గర
ఆ విగ్రహాల దగ్గర ఆ విగ్రహాలకు చేసిన అలంకారాల దగ్గర ఆగిపోతున్నాము, దేవుడు అనే వాడు ఒకడున్నాడు. వాడి కోసరం ప్రయత్నం చేయాలి అని బోధించడమే దేవాలయాల పరమార్ధం. దేవుడు అనేది చూచే వస్తువు కాదు. దేవాలయములోని విగ్రహం కాదు. అది ఒక అనుభూతి. భగవంతుని అనుభవించాలి. తాదాత్యం చెందాలి. అందుకే భాగవతంలో “నితాంత అపార భూతదయ” ను నాకు ప్రసాదించమని ఒక భక్తుడు భగవంతుని కోరాడు. అన్ని జీవులలో భగవంతుని చూడగలగాలి. పరమాత్మ లోనే అన్ని జీవరాశులను చూడగలగాలి. అంటే ఈ సృష్టి అంతా పరమాత్మ మయం అనే భావనకు రావాలి. ఈ ప్రపంచంలో వివిధ ఆకారములతో, పేర్లతో, రంగులతో, మానవులు, జంతువులు, పక్షులు తిరుగుతున్నాయి. కాని అన్నిటిలో అంతర్లీనంగా ఒక చైతన్యం ఉంది. యోగి అయిన వాడు పైపై ఆకారాలు, పేర్లు, రంగు కాకుండా లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించాలి. సముద్రంలో వివిధములైన ఆకారాలలో అలలు వస్తుంటాయి. కాని ఆ అలలలో ఉన్నది అంతా నీరే అనే భావన రావాలి. తస్య అంటే అతనికి, అలా చూచేవాడికి, భావించేవాడికి, అహం నేను న ప్రణశ్వామి కనపడకుండా పోను అంటే తప్పకుండా కనపడతాను అని అర్థం.
దేవుడిని దర్శించడానికి సాటి మానవులను మానవులుగా చూడటం, కేవలం మానవులలోనే కాకుండా, పక్షువులు, జంతువులు, పక్షులు అన్ని జీవరాసులలో అందరిలో పరమాత్మను దర్శించడం ముఖ్యం. కాని మానవత్వం మచ్చుకైనా కనిపించని ఈ లోకంలో దేవుడు ఎలా కనపడతాడు అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుడిని చూడాలంటే భేదభావం పోవాలి. సమానత్వం కావాలి. దానికి నిష్కామ కర్మ ఆచరించాలి. రాగద్వేషములు పోవాలి. ధ్యానయోగం కావాలి. ఇవే దేవుడిని చూడటానికి మార్గాలు.
చాలా మంది ఈ మార్గాలను వదిలిపెట్టి, దేవుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు. ఆ దేవుడు చాలా పవర్ఫుల్, ఈ దేవుడిని నమ్ముకుంటే లాభం లేదు. ఆ స్వామీజి చాలా మహిమలు కలవాడు, ఆయనే దేవుడు అనే సంకుచిత భావాలతో అక్కడే ఉండి పోతున్నారు. ఈ రకం దేవుళ్లు మీరు వారి దగ్గరకు వెళితేనే కనపడతారు లేకపోతే కనపడదు. కాని ఈ శ్లోకంలో చెప్పబడిన దేవుడు అంతటా ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. నీ దగ్గరే ఉన్నాడు. నీతోనే ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు. కాబట్టి మనం దేవుడు ఎక్కడో ఒక చోటనే ఉన్నాడు అనే స్థాయి నుండి దేవుడు అంతటా నిండి ఉన్నాడు అనే స్థాయికి ఎదగాలి. దానికి “ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు" అనే పద్యాన్ని సతతం మననం చేసుకోవాలి. ఆచరించాలి. ఈవిషయం తరువాతి శ్లోకంలో వివరించబడింది…
ఈ శ్లోకంలో మరొక విషయం కూడా చెప్పబడింది. సకల జీవరాసులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను చూడటమే కాదు, విశ్వచైతన్య స్వరూపుడైన పరమాత్మలో సకల జీవరాశులను చూడగలగాలి. ఇది ఎలా అంటే మనం భూమి మీద ఉన్నాము. ఈ భూమి లాంటి గ్రహాలు తొమ్మిది ఉన్నాయి. ఇవన్నీ సూర్యుడు అనే నక్షత్రం చుట్టు తిరుగుతున్నాయి. సూర్యుడు లాంటి నక్షత్రాలు లక్షల కొద్దీ ఈ పాలపుంతలో అంటే గెలాక్సీ లో ఉన్నాయి. ఇటువంటి గెలాక్సీలు ఈ అనంత విశ్వంలో లక్షలు, కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఈ అనంత విశ్వంలో ఒక నియమం ప్రకారం సంచరిస్తున్నాయి.(దీనినే ఎక్స్ పాండింగ్ యూనివర్స్ అని మన ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. దీని వివరణ ఈ పేరగ్రాఫ్ చివర చూడండి) అంటే ఈ గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ ఈ అనంత విశ్వంలో ఉన్నాయి. ఈ అనంత విశ్వమే విశ్వచైతన్యము, పరమాత్మ స్వరూపము. అందుకే సర్వవ్యాపి అయిన విష్ణువును, విశ్వాకారం (అంటే విశ్వమే ఆకారముగా కలిగినవాడు),
గగన సదృశం (అంటే ఈ గగనము, ఆకాశము (స్పేస్) మాదిరి కనిపించేవాడు),
మేఘవర్ణం (అంటే ఆకాశం మనకు నీలంగా కనపడుతుంది అందుకని నీలమేఘచ్ఛాయ కలవాడా) అని విష్ణువును స్తుతిస్తాము.
కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమైన విశ్వచైతన్యంలో మనం అంతా ఉన్నాము, మనందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఈ శ్లోకం ఇలా అర్థం చేసుకోవాలి.✍️```
(Or, in other words, the farther a galaxy is, the faster it is moving away! And that meant that the universe could not be static, as everyone previously had thought, but is in fact expanding; the distance between the different galaxies is growing all the time. The discovery that the universe is expanding was one of the great intellectual revolutions of the twentieth century.... (A Brief History of Time by Stephen Hawking).
```(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏
No comments:
Post a Comment