‘కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, శయనేషు రంభ, క్షమాయేషు ధరిత్రీ, రూపేషు లక్ష్మీ, సత్కర్మ యుక్త, కులధర్మ పత్ని’
అపురూపసౌందర్యవతివి నువ్వు నా అర్ధాంగివై
అందచందాల బంగారు బొమ్మవై నా భార్యవై
నీతల్లితండ్రులు అల్లారుముద్దుగా నిన్ను పెంచారు
మాయింట వధువుగా వదలివెళ్లారు
నిన్ను భద్రముగా చూసుకోమన్నారు
మాయింట భద్రమై మహాలక్ష్మివయ్యావు
వరుడు మెచ్చిన వధువుగా వెలుగుతున్నావు
రూపానికందని రూపవతి రంభవై
ఉహలకందని వయ్యారి ఉర్వశివై
అందానికందని అందానివి మందాకినివై మేనకవై
తనివి తీరని తన్మయి తిలోత్తమావై
ఆలించి లాలించి అప్సరసవై
పాలించి ప్రవళించి ప్రణయదేవతవై
గుణమునందు నువ్వు గుణావతివై
కరుణయందు నువ్వు కన్నతల్లివై
చెలిమియందు నువ్వు స్నేహితురాలివై
ప్రేమయందు నువ్వు ప్రేయసివై
ఇంట్లో అందరి ఆకలి తీర్చిన అన్నపూర్ణవై
ఆప్యాయతలకు అభిమానాలకు అమ్మవై
రోజూ నాకన్నా ముందు నిద్రలేచి ఇల్లుతుడిచి తేనీరు నాకందించి
రాత్రి అన్నిపనులు పూర్తిచేసుకొని నాకన్నా తరువాత నిద్రపోయి
రోజూ నాకు లంచు బాక్సు తయారుచేసి
నీకునచ్చిన బట్టలతో నన్ను తయారుచేసి చిరునవ్వుతో ఆఫీసుకు సాగనంపి మరల సాయంత్రం నాకోసం ఎదురుచూసి
ఇదిగదా అలుపెరుగని నీదినచర్య ఇంట్లో అందరిదినచర్య
పిల్లలను నిద్రలేపి తయారుచేసి పాఠశాలకు పంపి వాళ్ళను ఇంటికి తీసుకునివచ్చి చదివించి తినిపించి నిద్రపుచ్చి
ఇన్నిపనులు అలుపెరుగకుండా చేస్తున్న భార్యలందరికిన్ వందనాలు
నాకర్తవ్యాని నాకెప్పుడూ గుర్తుచేస్తూ
నన్ను ముందుకు తోసి నావెన్నంటె ఉంటావు
నేను నిరాశగా ఉన్నప్పుడు నాలో కొత్తఆశలు నింపి నన్ను ఉత్సాహపరుస్తావు
భర్త అంటే భరించు వాడనేది అనాది నానుడి
భరించేదే భార్య అనేదే నా నానుడి
అందుకేనేమో ఇల్లుచూసి ఇల్లాలిని చుడండి అన్నారు పెద్దలు
అందుకేనేమో ఈమధ్యకారంలో నిన్ను గృహమంత్రి అనికూడా అంటారు
నన్ను గెలిపిస్తూ నువ్వెప్పుడూ ఓడిపోతూనే ఉంటావు
కానీ ఎంత గెలిచినా నీసహనం ఓర్పు నీప్రేమ ముందు నేనెప్పుడూ ఓడిపోతూనే ఉంటాను
నాకోసం ఇన్నిచేస్తున్న నీకు నేనెప్పుడూ రుణపడిపోతూనే ఉంటాను
ధన్యవాదములు ఆశించని అమ్మ త్యాగానివై
జీతములేని గృహాలక్ష్మివై క్రమశిక్షణాల కాళికా మాతవైన నీకు శతకోటి వందనాలు
ఎవరు ఏతప్పుచేసిన ఇంటిల్లిపాదినీ క్షమించగల శక్తి ఒక స్త్రీమూర్తిగా నీకు తప్ప ఎవరికుంది ఈ అవనియందు
నన్ను వరించి భరించి తరించి తరుణివై నాకు తోడుగా ఉండమ్మా కలకాలం ఇలలోన కలలోన
నీటిమూట కాదిది నీలకంఠుని మాట
అక్షరాలమూట కాదిది అంబ మాట
డా. చదరం శివాజీ
No comments:
Post a Comment