*ప్రాచీన గాథాలహరి - 26*
🪷
రచన: పిలకా గణపతిశాస్త్రి
*చూడామణి - 2*
💍
"మహర్షీ! భీమసేను డన్యాయ్యంగా నా తండ్రి మృతికి కారణభూతుడైనాడు. అంతటితో ఊరుకోక నన్ను కూడా సంహరించి వెయ్యవలెననే దురుద్దేశంతో నామీదికి విరుచుకుపడ్డాడు. కేవలం ప్రాణ భయం వల్లనే నేనీ అస్త్రం ప్రయోగించాను. ఇక వెనకముందు ఆలోచించకుండా నేను సంకల్పించినట్టిది పాండురాజకుమారు లందరినీ సంహరించి తీరవలసిందే! దీనికి క తిరుగులేదు. నాకిక దీనివల్ల వచ్చే మహా పాతకానికి ఒడిగట్టక తప్పడంలేదు! నేనేమి చెయ్యను?"
ఆ ప్రత్యుత్తరం విని వ్యాసమహర్షి కొంచెంసే పాలోచించి అశ్వత్థామ కొక చక్కని సదుపదేశం చేశాడు.
"అశ్వత్థామా! ద్రోణాచార్యుడు శిష్యుని మీది వాత్సల్యం కొద్దీ అర్జునునికీ అస్త్రం ప్రసాదించాడు. కనకనే నీ వెంతటి ద్రోహాని కొడిగట్టినా అతడు నీ కెటువంటి అపకారమూ సంకల్పించి ఉండలేదు. నీ అస్త్రానికి మారుగా తన అస్త్రం ప్రయోగించాడు. అంతేగాని తానై మొట్ట మొదటగా ఆ అస్త్రప్రయోగాని కుపక్ర మించలేదు. మేము వలదన్న వెంటనే అది ఉపసంహరించివేశాడు. ఇటువంటి ధర్మాత్ముని సంహరించవలెనని నీవు సంకల్పించడం న్యాయంకాదు. ఇంకొక విషయం ఈ మహాస్త్రం మనుష్యుల మీద ప్రయోగించేవారికి తప్పక అశుభం కలుగుతుంది.
అదిన్నీగాక, నీ అస్త్రం చిట్ట చివరికితని అస్త్రం చేత ఎలాగైనా ఉపసంహరించబడి తీరుతుంది. కాని ఆ విధంగా నీ అస్తం ఇంకొకరి అస్త్రం చేత ఉపసంహరించ బడడం మంచిదిగాదు. అలాగ ఉపసంహ రించబడినట్లయితే ఈదేశంలో పన్నెండేళ్ళ పాటు అనావృష్టిదోషం కలుగుతుంది. ఇది నేను నీకూ, ఈ దేశానికీ క్షేమం కోరి, చాలా దూరం ఆలోచించి చెబుతున్నాను. జాగ్రత్తగా విను నాయనా! ఈ అస్త్రం ఉపసంహరించివెయ్యి. ఇక వెనకముందు లాలోచించకు! నామాట విను! అదీ గాక నీకొక సామరస్య మార్గం కూడా ఇప్పుడు ఉపదేశిస్తున్నాను. అది కూడా శ్రద్ధగా విని నా సంధిమార్గాని కంగీకరించు.
నాయనా! నీవు తపస్సు చేసుకోవాలని సంకల్పించావు! అటువంటి వాడికి నీకీ రోష ద్వేషా లెందుకయ్యా! నీకూ, అర్జునునికీ అంగీకార యోగ్యమైన మార్గం ఒకటి ఆలోచించి చెబుతున్నాను. అన్నీ నీ వన్నట్లే సాగిపోవాలనడం న్యాయ్యంకాదు గదా! సామరస్య మార్గం అర్జునునికీ, నీకూ ఉభయతారకంగా ఉండడం ధర్మం! నీ చూడామణి అర్జునునికిచ్చివెయ్యి! దానితో అర్జునుడే కాక పాండవులందరూ నీ ప్రాణం అపహరించినంతగా సంతోషిస్తారు. ఆపైన నీవు సుఖంగా తపస్సు చేసుకోవచ్చు. కనుక వెంటనే నీ అస్త్రం ఉపసంహరించి నీ చూడామణి వీరి కర్పించు. ఇది చక్కని సామరస్య మార్గం! ఇలా చెయ్యి నాయనా! నా మాట విను!"
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ మాటలన్నీ అశ్వత్థామ అతిశ్రద్దగా విన్నాడు. కొంతవరకూ వ్యాసమహర్షి చెప్పిన సంధిమార్గం అతనికి సమంజసం గానే స్ఫురించింది. కాని అతనికి తన అంతరాంతరాలలో పాండవులపై బయలుదేరిన అక్క స్సింకా అలాగే రాజుకుంది.
"మహర్షీ! పాండవేయులకు రత్నాల కేమైనా కొదవా! వారు నా చూడామణి కాశపడడం ఎందుకు? ఇది ధరించిన వారికి సర్పభయము, తస్కరభయము, దేవరాక్షస భయము, క్షుద్బాద, తృష్ణ మొదలైన వేవీ ఉండవు! నా మట్టుకు నాకు వీరికీ చూడామణి సమర్పించడము సుతరామూ ఇష్టంలేదు. కాని నీమాట తీసి వేయలేక నీకీ రత్నం సమర్పిస్తున్నాను. ఇక నా అస్త్ర లక్ష్యం మాట! ఇది పాండవేయ పత్నీ గర్భాలన్నీ దహించివేసి వెంటనే ఉపశమిస్తుంది. అంతవరకూ దీని కిక తిరుగులేదు. అంతే!"
అతని ప్రత్యుత్తరం వింటూనే వ్యాసమహర్షి తటాలున ప్రత్యుత్తరం ఇచ్చాడు.
“సరే! అలాగే చేద్దువుగాని! అంతేగాని ఇక వేరే ఆశ పెట్టుకోకు నాయనా!" అని ఎంతో ఆప్యాయంగా అతన్ని బతిమాలుకొన్నాడు.
కాని ఆ మాటలో ఏదో మెలత ఉన్నట్టు అశ్వత్థామకు స్ఫురించింది.
"మునీంద్రా! నీవు పాండవ పత్ని గర్భాల ధ్వంసంతోనే న న్పూరట పొందవలసిందని ఆజ్ఞాపిస్తున్నావు గాని నా సంకల్పం అంతటితో ఆగిపోయేది కాదు. ఇది పాండవకుమారుల పత్నీగర్బాలను కూడా దహించి తీరుతుంది. నీ సంకల్పం నేను గ్రహించలే దనుకున్నావేమో! గ్రహించాను. నా సంకల్పాని కిక తిరుగులేదు!" అని బింకంగా మూతి ముడుచుకుని కూర్చున్నాడు.
📖
శ్రీకృష్ణు డశ్వత్థామకు, వ్యాసమహర్షికి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ అతి శ్రద్ధగా ఆలకించాడు. అశ్వత్థామ క్రూర ప్రవృత్తి అంతా అతనికి అవగాహన అయిపోయింది. ఒక్క చిరునవ్వు నవ్వాడు.
"అశ్వత్థామా! నీ అస్త్రాగ్నితో పాండు మహారాజు పౌత్రుల నందరినీ సంహరించి వేశావు. అంతటితో ఊరుకోక వారి పత్నుల గర్భాలన్నిటిలో చిచ్చుపెట్టవలెనని కూడా నిశ్చయించావు! నే నా గర్భాలలో ఉన్న ఒకే ఒక శిశువును సంరక్షించవలెనని నిశ్చయించాను. అతడు మహాధర్మాత్ముడై పృథివి అంతా పరిపాలించవలెనని అభిలషిస్తున్నాను! నీవు కూడా నా సంకల్పానికి తోడు పడవలసింది!" అని అశ్వత్థామను సగౌరవంగా ప్రార్థించాడు.
ఆ ప్రార్థన విని అశ్వత్థామ ఒక విషపు నవ్వు నవ్వాడు.
"వాసుదేవా! నీవేదో పక్షపాతం కొద్దీ ప్రసంగిస్తే నేను దాని కంగీకరిస్తానని అనుకొన్నావా? నీవు అభిమన్యుని పత్ని ఉత్తరగర్భం సంరక్షింపవలెనని కదా సంకల్పించావు! నే నా గర్భం కూడా భస్మం చేసి వేస్తున్నాను. దీనికిక తిరుగులేదు!"
అని ఆ అస్త్రమంత్రం తిరిగి ఇంకొకమారు పునశ్చరణ చేశాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అంతలోనే కృష్ణుడొక్క నవ్వు నవ్వాడు.
"వెర్రివాడా! నీ అస్త్రం కాల్చివేసినంత మాత్రాన ఆ శిశువలాగే మరణిస్తాడని అనుకొన్నావా? ఆ శిశువు నీ అస్త్రదగ్ధుడై మరణించిన వెంటనే నేనా శిశువును బ్రతికిస్తాను! ఆ పసివానితో పాండవవంశం తామర తంపరగా వర్ధిల్లగలదు. అదిన్నీ గాక అతడు చిరకాలం పూర్ణాయుర్దాయం తో జీవించగలడు. త్రికాలవేది అయిన బ్రాహ్మణుడొకడు ఉత్తరాగర్భంలో నించి మృతశిశువుద్భవించగలడని ముందే ఆదేశించాడు. అందుచేత అతనికి పరీక్షిత్తనే నామధేయం ఏర్పడగలదని కూడా అన్నాడు. ఇంతా చేస్తే దీనిలో నీవు చేసినదేమి ఉంది?" అని చెప్పి నిశ్చల దృష్టితో అశ్వత్థామ వైపు చూచాడు. ఆ పరమ పాపాత్ముని ముఖం చూడగానే వాసుదేవు డంతటి వానికి క్రోధజ్వాల నఖశిఖపర్యంతమూ దహించివేసింది.
"నీవు శిశుహంతకుడవు! ఇందువల్ల నీకిక అన్నపానాలు కూడా కరువైపోతాయి. 'నా' అన్న వారు లేకుండా నీవిలాగే ఇంకా మూడు వేల ఏళ్ళ వరకూ జీవచ్ఛవంలా జీవించగలవు! నేను రక్షించిన పరీక్షిత్ కుమారుడు నీ కళ్ళ ఎదుటే పెరిగి పెద్దవాడౌతాడు. కృపాచార్యుడతనికి ధనుర్వేద రహస్యాలన్నీ అనుగ్రహించ గలడు. పరీక్షిత్తెంతో కాలం ఈ భూమిని పరిపాలించగలడు. ఆ పరీక్షిత్తుకు జనమేజయుడనే కుమారు డుద్భవింప గలడు. అతడు నీవు చూస్తూండగానే ఈ పృథివి అంతా ఏకచ్ఛత్రాధిపత్యంతో పరిపాలించగలడు! తెలిసిందా! అప్పటికి నీకు నా ప్రభావం ఎటువంటిదో తెలిసి వస్తుందిలే!" అన్నాడు.
వ్యాసమహర్షి కూడా పాపకర్ముడైన అశ్వత్థామ ముఖం చూచి తన క్రోధం నిగ్రహించులేకపోయాడు.
"నీ వెత్తినది బ్రాహ్మణజన్మ! ఆ పైన నే నెన్నో విధాలుగా నీకుపదేశించాను! నా మాటలన్నీ పెడచెవిని పెట్టావు! ఇందుచేత వాసుదేవుని వాక్యా లక్షరశః సత్యము లగుగాక!" అని అశ్వత్థామను మళ్ళీ శపించాడు. ఆపైన అశ్వత్థామ ముఖం మరి చూడలేకపోయాడు.
"నీచుడా! నా ఎదట మరి నిలబడకు! పో!" అని కసిరివేశాడు.
అయినా అశ్వత్థామ అక్కస్సింకా పూర్తిగా సమసిపోలేదు.
"వ్యాసా! నీ వెంతటి బ్రహ్మణ్యుడవయినా నీకిక మానవజన్మ విముక్తి లేదు! నీవెప్పటికీ మానవులలోనే ఉండిపోదువు గాక! నేనెక్కడికీ వెళ్ళిపోవడం లేదు! మీ ఇద్దరి శాపాలూ అనుభవిస్తూ నీ సన్నిధినే ఉండిపోతున్నాను!" అని వ్యాసమహర్షికి ప్రతిశాపం ఇచ్చాడు. వెంటనే పాండవులకు తన శిరోమణి సమర్పించి తపోవనంలోనికి తరలిపోయాడు.
పాండవులు, కృష్ణుడు వ్యాసమహర్షికి సవినయంగా నమస్కరించి, సెలవు తీసుకొని తిరిగి తమ శిబిరానికి మరలిపోయారు.
ధర్మరాజు ఆ చూడామణిని భీమసేనుని కిచ్చి అది ద్రౌపదీదేవి కీయవలసిందని పంపించారు. ఆ చూడామణి కళ్లారా చూచి ద్రౌపదీదేవి ఉసూరుమని ఒక నిట్టూర్పు విడిచిపెట్టింది.
💍
*సమాప్తం*
(చెప్పుకుంటూ ఉంటే ఇలాంటి చిన్న కధలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ కధలకు కొంత విరామం ఇస్తున్నాను. కొంత సమయం తర్వాత మరిన్ని కధలు చెప్పుకుందాం)
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment