Monday, October 13, 2025

 247 వ భాగం
🕉️ అష్టా వక్ర గీత🕉️ అధ్యాయము 18 
శ్లోకము 36

నాప్నోతి కర్మణా మోక్షం విమూఢోబ్యాస రూపిణా|
ధన్యో విజ్ఞాన మాత్రేన ముక్త స్తిష్ఠత్య విక్రయః||

మూఢుడు ధ్యాన సాధనాలతో మనసును నియమించడానికి ప్రయత్నము చేసిన ఆత్మానుభూతిని పొందలేడు. సుకృతం కలిగిన సాధకులు శ్రవణమననాలతో ముక్తిని పొంది ఆత్మానుభూతితో స్థిరంగా స్థితుడై ఉండగలుగుతాడు.

క్రిందటి శ్లోకములోని అష్టావక్రని ఉపదేశము శిష్యుడిని సంశయాలకు చిత్రుడుని చేస్తుంది. అతడి విశ్వాసాన్ని ఆలోచన శక్తిని సవాలు చేస్తుంది .వేదాధ్యయనము చేసేటప్పుడు ముందుగా కర్మకాండ విభాగంలో విభిన్న కార్యకలాపాలపై ఆచార విధానాలపై విలువను వ్యామోహాన్ని పెంచుకొని వాటిని వదలడం కష్టముగా భావిస్తారు. ఉపనిషత్ విభాగాన్ని మొదలుపెట్టేటప్పుడు గురువు తప్పనిసరిగా వారిని హెచ్చరిస్తారు. ఆ విధానాలలోనూ నియమ నిష్టలను వాటిపై విలువలను కూడా శిష్యులు విడిచిపెట్టవలసి ఉంటుంది. ఆచార వ్యవహార ఆచరణకు అలవాటు పడిన మనసును కదిలించి వాటిని విడిచిపెట్టి అంతకంటే సునిషితము సూక్ష్మము అయిన ఉపనిషత్ విజ్ఞానాన్ని అర్థము చేసుకోవడానికి అనువుగా శిష్యుని సంసిద్ధుని చేస్తారు ఆచార్యులు .ఆ తర్వాత అంతకంటే సూక్ష్మతరమైన ధ్యానంలో అధ్యయనాన్ని కూడా విస్మరింప చేస్తారు .ఈ విధంగా మనసు యొక్క పరిధిని ఏకాగ్రతను పెంచుతూ అనంత సత్యాన్ని బోధించి నిరూపించి ఆ అనుభవానికి శిష్యుడిని సంసిద్ధునిగా చేస్తారు గురుదేవులు.

ధ్యాననిష్టుడైన శిష్యుని ఆ ధ్యానం నుండి కూడా ముక్తుని చేసి ఆత్మానుభవానికి అనువుగా మలచటానికి మహర్షి ఇక్కడ ఇలా ఉపదేశించారు. ధ్యానం చేస్తున్నానన్న భావమే అహంకారానికి జీవం పోసి ధ్యానికి ధ్యాన లక్ష్యానికి మధ్య అర్థరహితము అనవసరము అయిన విభేదాన్ని సృష్టిస్తుంది. అందుకే మహర్షి చివరగా ఈ హెచ్చరికను చేస్తున్నారు.

కలాని ఖడ్గ సమమైన నేర్పుతో ఉపయోగించగలనని ఇదివరకే నిరూపించారు అష్టావక్రమునీంద్రుడు .వాడి అయిన తన లేఖినితో శిష్యుని మనసును గాయము చేసే హేళన చేసి అతని మూర్ఖత్వాన్ని శాశ్వతంగా నిర్మూలించగల సమర్థులు ఆయన. ఈ గీత మూడవ అధ్యాయం అంతటా ఈ విధానమే వాడబడటాన్ని మనం ఇదివరకు స్పష్టంగా చూసాము.

ఇక్కడ మళ్లీ అదే విధానాన్ని ఉపయోగిస్తూ గురుదేవులు ఇలా అంటున్నారు .మనసును ధ్యానముతో నియమించటానికి శ్రమించే మూడునికి ఆత్మ అనుభవం ఎన్నటికీ సిద్ధించదు.సుకృత బలముతో ధన్యుడై చిత్తశుద్ధితో సత్యాన్ని అన్వేషించి సాధకుడు శ్రవణ మననాలతో ఆత్మ తత్వాన్ని అర్థము చేసుకొని సర్వసాధనలను వీడి ఆత్మ అనుభవములో ఆనందంగా ఉండగలుగుతాడు. ధ్యానము మార్గమైతే అపరోక్షానుభూతి గమ్యం. యాంత్రికంగా సాధనలు చేస్తూ తెలివి తక్కువగా మనసుతో ఏదో ఒక భావాన్ని పట్టుకొని ఆగిపోవడం, ధ్యానికి సత్యానికి భేదం ఉందని ఒప్పుకోవటమే అవుతుంది .నామమాత్ర విశిష్టమైన ఈ అహంకారంకు కూడా పూర్తిగా నశించాలి .నేను ధ్యానిని అనే భావము అంతరించాలి. అప్పుడు మాత్రమే విషయి, విషయ రూపమైన ద్వంద ప్రపంచం అదృశ్యమై అద్వితీయమైన ఆత్మ తత్వం స్వయంగా ప్రకాశిస్తుంది.🙏🙏🙏

No comments:

Post a Comment