*మార్గదర్శకులు మహర్షులు - 2*
🔱
రచన: మహామహోపాధ్యాయ శివానందమూర్తి
వాళ్ళు తిరిగివస్తూంటే, ఈసారి దేవేంద్రుడు వెనకనుంచీ అదృశ్య రూపంలో వచ్చి ఆ అశ్వాన్ని రెండవమారు అపహరించాడు. అత్రిమహర్షి తన తపో బలంతో ఇంద్రుడి అదృశ్యశక్తినంతా హరించి, ఈ పృథుకుమారుడికి అతడు కనబడేటట్లు చేసాడు. ఆయన బాణం వేశాడు. ఇంద్రుడిని జయించి, శిక్షించి చంపకుండా వదిలిపెట్టి యాగాశ్వాన్ని తిరిగి పృథుచక్రవర్తికి చేర్చి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా జరిపించాడు అత్రి. అత్రి మహర్షి దయతోటే యజ్ఞం ఇంతబాగా జరిగింది.
పృథుచక్రవర్తి యాగానికివచ్చిన బ్రాహ్మణులకు, ఇతరులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి స్తోత్రాలు చేసి నమస్కరించాడు. అత్రి దగ్గరికి వచ్చి, నీవు ఇంద్రుడివి చంద్రుడివి బ్రహ్మదేవుడంతటి వాడివి అని వర్ణించాడు పృథువు. అక్కడే ఉన్న గౌతమమహర్షికి ఈ పొగడ్తలు వినేటప్పటికి కోపంవచ్చింది. "మేము ఇంతమందిమి ఉండగా, ఆయననే పొగుడుతున్నావు. బ్రహ్మదేవుడని అంటున్నావు. మేము మాత్రం కామా! ఎందుకు అలా వర్ణిస్తున్నావు?" అన్నాడు.
అత్రిమహర్షి, తనను పృథువు చేసిన స్తోత్రానికి ప్రసన్నుడయి, తనకు నమస్కరించిన పృథుచక్రవర్తినే తిరిగి, నువ్వు ఇంద్రుడంతటివాడివి చంద్రుడంతటి వాడివి అని స్తోత్రం చేసాడు.
గౌతముడికి మళ్ళీ కోపం వచ్చింది. ఆయన అత్రిమహర్షితో, “ఒక చక్రవర్తిని నీవు ఇంద్రుడు, చంద్రుడు అని అంటున్నావు. నీకు ఇది ధర్మంకాదు” అని అంటే; అప్పుడు వాళ్ళిద్దరికీ (అత్రికి, గౌతముడికి) వాగ్వివాదం జరిగింది. "నేను ఆయనను స్తోత్రం చేస్తే ఏమీ తప్పులేదు. ఆయన ఇంతగొప్ప యాగంచేసాడు. ఆయన సేవలకు నేను ప్రసన్నుడనయ్యాను. అందుకే నేను స్తోత్రం చేస్తున్నాను. ఇందులో ఏది ధర్మం అవుతుందో మీరే నిర్ణయించండి” అని సదస్సుకు చెప్పాడు అత్రి మహాముని.
"మేము ఈ విషయంలో ఏ నిర్ణయమూ చేయలేము" అన్నారు సభాసదులందరూ. అయితే ఈ ధర్మనిర్ణయం తేల్చటానికి బ్రహ్మమానస పుత్రుడయినటువంటి సనత్ కుమారుడనే ఋషి ఉన్నాడు, ఆయన ధర్మసూక్ష్మం బాగా తెలిసినవాడు అని ఆయన దగ్గరికి వెళ్ళారు నిర్ణయం కోసం!
ఆయన దగ్గరికి వెళ్ళిన తరువాత అత్రిమహర్షి ఆయనతో, “రాజు నాకు నమస్కరించి స్తోత్రంచేశాడు. దానికి బదులుగా నేను తిరిగి రాజును శ్లాఘించాను. ఈయన అది తప్పు అంటున్నాడు. ఈ విషయంలో ఏమిటి తప్పు? మీ నిర్ణయమేమిటి తెలపండి” అని అడిగాడు.
అప్పుడు సనత్ కుమారుడు, "అత్రివాక్యములే సత్యము. అలా స్తోత్రము చేయడంలో తప్పేమీలేదు" అని నిర్ణయం చేసాడట! గౌతముడు ఆ నిర్ణయాన్ని శిరసావహించాడు. రాజును ఇంద్రుడు చంద్రుడు అని స్తోత్రం చేస్తే ఎందుకు తప్పులేదు అంటే, అందులో ఉన్న ధర్మసూక్ష్మం ఏమిటంటే, 'న విష్ణుః పృథ్వీపతి:' - విష్ణువు యొక్క అంశ లేకపోతే పృథ్వీపతికాలేడు అన్నది. ఆ విష్ణువు అంశను ఎంత స్తోత్రం చేసినా ఫరవాలేదు. అతడిలో ఉండే ఇతర లక్షణములు, మానవమాత్రుడిగా ఉండే ఇతర లక్షణములు, తప్పొప్పులు ఉంటాయే - వాటిని పరిహరించి విష్ణువు అంశ అతడిలో ఉండబట్టే చక్రవర్తి అయినాడు కాబట్టి, అతడి కులగోత్రాలతో నిమిత్తంలేదు. విష్ణువు అంశ ఉండబట్టే చక్రవర్తి అవుతాడు కాబట్టి ఆ అంశను ఎంత శ్లాఘించినా తప్పులేదు అని తాత్పర్యం.
📖
దేవతలకు, రాక్షసులకు ఒకమారు యుద్ధం జరుగుతున్న కాలంలో, రాహువు చేతిలో సూర్యచంద్రులిద్దరూ కూడా తీవ్రంగా దెబ్బతిని వాళ్ళ తేజస్సులు పూర్తిగా పోగొట్టుకున్నారు. వాళ్ళు అత్రిమహర్షి దగ్గరికి వచ్చి ఆయన శరణుకోరుకున్నారు. అప్పుడు ఆ సూర్యచంద్రులకు ఆయన తేజోవంతమయిన శరీరాలను ఇస్తూ భవిష్యత్తులో ఎప్పుడూ వాళ్ళ శరీరాలు రాక్షసబాధ నుంచి రక్షించబడతాయి, రాక్షసులు వాళ్ళకు ఏ హానీ చెయ్యలేరు అని వరమిచ్చాడు. ఆ రాక్షసులందరూ ఆయన దగ్గరికి వస్తే, వాళ్ళందరినీ ఒక తీక్షణమయిన దృష్టితోనే చంపేసాడట. ఈ కార్యాన్ని ఆయన నోరెత్తకుండా, చెయ్యెత్త కుండా, దర్భను మంత్రించకుండా కేవలం తీక్షణమైన తన దృష్టితోటే చేసాడట!
📖
ఒకసారి అత్రిమహర్షి ఆశ్రమానికి సీతారామలక్ష్మణులు వచ్చారు. వాళ్ళకు ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. అనసూయ దగ్గర పతివ్రతాధర్మాలు నేర్చుకోవమ్మా అని సీతకు చెప్పాడు. అనసూయాదేవి సీతకు పాతివ్రత్య ధర్మరహస్యములన్నీ చెప్పింది.
అనేకమంది ఋషులు, బ్రాహ్మణులు ఒకప్పుడు అత్రిమహర్షిని దర్శించి, "నీవు విశ్వవిదుడవు, ఋషిశ్రేష్ఠుడివి. లోకానికి హితకరమై నటువంటి ధర్మసూక్ష్మములను మాకు చెప్పవలసింది" అని అడిగారు. ఆ విషయాలన్నీ ('అత్రిసంహిత' అనే గ్రంథంలో) చెప్పాడని ఉంది.
“విష్ణువును లోకమంతా వ్యాపించినటు వంటి రక్షకుడిగా భావనచేసి ఆరాధించట మే ముక్తిదాయకం. అదే శ్రేయస్కరము. సమస్త ప్రజలు విష్ణువును ఆరాధించి తీరాలి" అని చెప్పాడు ఆయన.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అమూర్తార్చనము, సమూర్తార్చనము అని ఆయనను పూజించే విధానాలుంటాయని చెప్పాడు. అగ్నిలో వేసే ఆహుతి అమూర్తార్చనం అని, ప్రతిమాద్యర్చనము సమూర్తార్చనమని - ఆ రెండింటిని గురించిన వైఖానసమతాన్ని మొట్టమొదట ఆయనే ప్రబోధంచేసాడట.
సాయంప్రాతఃకాలములందు ఇంట్లోకాని, దేవాలయంలో కాని ప్రతీ బ్రాహ్మణుడూ - భక్తిభావంతో పరమేశ్వరుని ప్రతిమను పెట్టుకుని, ఆ సాన్నిధ్యం కల్పించుకుని, దాని ఎదురుగుండా అగ్నిహోత్రాది హోమములు చేయడం అత్యుత్తమ మార్గమని చెప్పాడు. ఇదే 'అత్రిసంహిత' అనే పేరుతో ప్రసిద్ధిచెందింది. విగ్రహారాధన మేముంది, నేను నిత్యము అగ్నిహోత్రము చేస్తాను అని నిత్యాగ్నిహోత్రి కూడా అనుకోనక్కరలేదు. విగ్రహారాధన చేసి, విగ్రహాన్ని మూర్తిమంతంగా పూజచేసి, దాని సన్నిధిలో అగ్నిహోత్రాన్ని చేసుకోమని అత్రిమహర్షి వాక్యం చెపుతోంది. చాలా విలువైన అంశం ఇది. ఆ రెండూ సమన్వయం చేసి ఆయన అతిముఖ్యంగా చెప్పాడు.
(పశ్చిమగోదావరిజిల్లాలో ‘అత్తిలి' అని ఒక గ్రామం ఉంది. అది అత్రిమహర్షి క్షేత్రం. ఆ ఊరికి ఆ పేరు అత్రిమహర్షి పేరుమీదుగానే వచ్చింది. అక్కడ ఒక ఆలయం ఉంది).
ఆయన ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. "భృగుమహర్షి, కాశ్యపుడు, మరీచి, నేను - మా నలుగురియొక్క మతమూ ఈ సమూర్త్యర్చనమే" అని చెప్పారట ఆయన అత్రిమహర్షి చెప్పటమే మహావాక్యం. అదీగాక భృగుమహర్షి, కాశ్యపుడు, మరీచి, తమయొక్క మతము ఇదే అని చెప్పటం ఒక గొప్ప విషయం.
'అత్రిసంహిత'ను - కర్మ, ప్రతిష్ఠ, పూజన, స్నపనోత్సవ, ప్రాయశ్చిత్త ములనే విభాగములకింద 5 భాగములుగా వ్రాశారాయన. మొదటి భాగంలో దేవాలయ ఆగమ శాస్త్రం అంతా ఉంది. ఇందులో దేవాలయ స్థలపరిశీలన, స్థలాన్ని ఎలా పరీక్ష చెయ్యాలి, ఎలాగ ఎన్నికచేయాలి - ఇవన్నీ ఉన్నాయి. అందులోనే దేవాలయాయతన రూపము నిరూపణ చేయటము, భగవంతుడి ప్రతిమలు ఎలా ఉంటాయో వాటి విషయాలు అవన్నీ చెప్పారు. రెండవ భాగంలో పరివార దేవతలయొక్క ప్రతిష్టా కలాపం అంతా చెప్పారు. మూడో భాగంలో పూజావిధానం, నాల్గవభాగంలో మహాభిషేకము, అయిదవ భాగంలో ఉత్సవవిశేషాలు చెప్పారు.
'నిత్యోత్సవ నిబంధం' అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. అందులో దేవాలయ ప్రతిష్ఠ, దేవాలయంలో సంవత్సరం పొడవునా ఏమిచెయ్యాలి, రోజూ నిత్యదీపోత్సవం ఎవరు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది అంతా ఉంది.
మహర్షులది ఎంతో విశాలదృక్పథం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విశాల దృక్పథం అనేది మహర్షులదే తప్ప మానవమాత్రులలో ఉండదు. మానవ మాత్రులు, అది కావాలని అరచేవాళ్ళే తప్ప అది ఉన్నవాళ్ళు కారు. లోపల వాస్తవంగా అది లేకపోబట్టే అలా అరుస్తారు. ఉన్నవాడు అరవడు. అలా జీవిస్తాడు. అది యథార్థంగా ఉన్నవాళ్ళు మహర్షులు!.
(రేపు ఇంకొక మహర్షి గురించి చదువుదాం)
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment