*మహామంత్రి మాదన్న - 3*
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽
రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు
గోలుకొండ సామ్రాజ్యపు సరిహద్దు ప్రాంతం. ఆఘమేఘాల మీద వెలసిన రాచనగరు అక్కడ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. పట్టు డేరాలు, పట్టె మంచాలు, మెత్తటి ఆసనాలు, బంగారు అంచుల తెరలు ఆ నగరిని ముస్తాబు చేస్తున్నాయి. చెవులూరించే సంగీతం, కైపు కలిగించే మధువు, మదాన్ని మాలిమి చేసే వయ్యారి భామల హుయలు ఆ వచ్చే అతిథి కోసం ఆత్రంగా భయంగా ఎదురు చూస్తున్నాయి.
ఇంతకీ ఆ వచ్చేది హిందూదేశాన్ని గడగడలాడిస్తున్న మొగలు చక్రవర్తి షాజహాను కాదు. కనీసం మరో పొరుగు రాజన్నా కాదు. ఆ వచ్చేది మొగలు చక్రవర్తి దూత ముల్లా అబ్దుల్ లతీఫ్ గుజరాతి. చక్రవర్తి నుంచి అతను అబ్దుల్లా కుతుబ్షాకి సందేశం తెస్తున్నాడు. అతని పరివారంలో చాలామంది ఉన్నారు. వారిలో ప్రముఖ వజ్రాల వ్యాపారి, నిపుణుడు నిహాల్ చంద్ కూడా వున్నాడు. అబ్దుల్ లతీఫ్ తను రాక ముందే, గోలుకొండ పాలకులలో ప్రకంపనాలు లేపాడు. సార్వభౌమ అధికారం గల సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా భయంతో బిగుసుకుపోయాడు. అందుకే అబ్దుల్ లతీఫ్ ని ప్రసన్నం చేసుకోవడానికి గోలుకొండ ప్రముఖ అధికారులు మీర్ మౌజుద్దీన్, ముషారిఫ్, షేక్ అహ్మద్ తాహిర్ సిద్ధంగా వున్నారు.
అబ్దుల్ లతీఫ్ గోలుకొండలో కాలు పెట్టక ముందే, సైనిక మంత్రి ముల్లా తాకీని తన ప్రత్యేకదూతగా దౌలతాబాదులో విడిది చేసి వున్న చక్రవర్తి షాజహాన్ వద్దకు పంపాడు అబ్దుల్లా కుతుబ్ షా. ముల్లా తాకీ ద్వారా లక్షా ఇరవై వేలు ఖరీదు చేసే ఏనుగులను వజ్రాలను చక్రవర్తికి కానుకగా పంపాడు.
అబ్దుల్ లతీఫ్ పరివారం కనుచూపు మేర లోకి రాగానే ఎదురుకోలు సంబరాలు మొదలయ్యాయి. సంగీత వాయిద్యాల హెూరు ఊపు అందుకుంది. ఆ సంగీతానికి అనుగుణంగా నృత్యగానాలు అమిరాయి. అబ్దుల్ లతీఫ్ గుర్రం దిగుతుంటేనే అత్తరు పన్నీరులతో తడిపిన గులాబీ రేకులు ఆయనను ముంచెత్తాయి. ముషారిఫ్ జీనుని అందుకుంటే, మరో యోధుడు అబ్దుల్ లతీఫ్ దిగటానికి చెయ్యి అందించాడు. యువతులు వెన్నెల రెమ్మల్లా నవ్వుతూ అతనికి చల్లని షరబత్ అందించారు. వాళ్లని చూస్తూనే అబ్దుల్ లతీఫ్ ఒంట్లో తాపం పెరిగింది. అతను తాగిన చల్లని పానీయం ఆ తాపాన్ని తక్కువ చెయ్యలేకపోయింది.
ఆ సాయంత్రం గోలుకొండ తాబేదారులు ఏర్పాటు చేసిన షడ్రసోపేతమయిన విందు కుడిచి, మధువు ఇచ్చిన మత్తుకి తూలిపోతూ, కింద పడకుండా తన గుడారంలోకి నడిచాడు అబ్దుల్ లతీఫ్. ఇలా హైద్రాబాదు చేరేదాకా తోవ పొడుగునా విందులు మందులు మనుగుడుపులలో మునిగి తేలుతూనే ఉన్నాడు.
హైద్రాబాదు రాగానే విశాలమైన, అందమైన నబీబాగ్ లో గోలుకొండ పీష్వా షేక్ మహమ్మద్ ప్రభుత్వం తరపున అబ్దుల్ లతీఫ్ కి గొప్ప విందు ఇచ్చాడు. అక్కడే గోలుకొండ సామ్రాజ్యపు మెడలో బానిసత్వపు పలుపులు వేసిన 'ఇన్ కియాద్ నామా' రూపుదిద్దుకుంది. గోలుకొండ సామ్రాజ్యపు స్వాతంత్రపు పేటిక సదా మూసుకుపోయింది. అది మళ్లీ ఎన్నటికీ తెరుచుకోకుండా, గోలుకొండ దర్బారులో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా చేత రాజముద్ర అనే చివరి మొల ఆ పేటిక మీద కొట్టించాలనే ఒప్పందం నబీబాగ్ లో కుదిరింది. దీర్ఘచతురస్రాకార రూపులో వైడూర్యపు రంగులో గర్వంగా ఎగురుతున్న గోలుకొండ సర్వసత్తాక పతాక నబీబాగ్ లో అవనతం అయింది.
📖
ఖుదా దాద్ మహల్. అది రాచ ప్రసాదం. తన కూతురు హయత్ బక్షీ బేగం వివాహం చేశాక, కల్యాణ జ్ఞాపకార్ధం ఆ భవనం కట్టాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. అది ఎనిమిది అంతస్తుల వాస్తు పండుగ. దాని ద్వారబంధాలు, తలుపులు గంధం చెక్కల తోను, నల్లచేవ మాను చెక్కలతోను తీర్చిదిద్దారు. వాటి బిగింపుకు బంగారు మేకులను వాడారు. అద్భుత దారు శిల్పాలు వాటి మీద కొలువు తీరాయి. గోడల నిండా విలువైన రాళ్లు అందంగా, కళాత్మకంగా తాపడం చేశారు. బంగారు దారాలతో నేసిన తెరలు తలుపులకి కిటికీలకి వేలాడుతున్నాయి. ఖుదా దాద్ మహల్ పై కప్పును అత్యంత విలువైన రాళ్లతో పొదిగి తారల ఆకాశంలా తీర్చిదిద్దారు. ఆ కప్పుకి ఆధారంగా నిలిచిన స్తంభాలు ధగధగ మెరిసిపోతు న్నాయి. ప్రతి అంతస్తులోనూ విశాలమైన గదులు, నడవాలు, మండువాలు కుడ్య చిత్రాలతో ఇతర హంగులతో దేనికదే మనసు దోచుకుంటున్నాయి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ భవనంలోని అయిదవ అంతస్తు హైదరీ మహల్లో వాతావరణం గంభీరంగా వుంది. రత్నకంబళాల పై మెత్తని గద్దెలున్నాయి. వాటి మీద పీష్వా షేక్ మహమ్మద్, మీర్ జుమ్లా మన్సూర్ అలీఖాన్ కూచుని వున్నారు. వారికి కొద్దిదూరంలో మరో గద్దె మీద రాజమాత హయత్ బక్షీ బేగం కూర్చుని వుంది. మధ్యలో మరో గద్దె ఖాళీగా వుంది. అప్పటిదాకా అందరూ ఏదో ముఖ్యమైన మంతనాలాడినట్లు వారి మొహాలు చెబుతున్నాయి.
సుల్తాన్ అబ్దుల్లా ఆ విశాలమైన గదిలోకి వచ్చాడు. రాజమాత తప్ప మిగతా ఇద్దరూ నుంచుని వినయంగా సలాం చేశారు. అబ్దుల్లా తల్లికి వందనం చేసి తను కూచుని వారిని కూచోమన్నాడు.
'సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షాతో నేను ఏకాంతంగా మాట్లాడాలి. మీరు కొద్దిసేపు మహమ్మదీ మహల్లో వేచి ఉండండి' అంది హయత్ బక్షీ బేగం ఫర్మానా ధ్వనిస్తున్న గొంతుతో.
వాళ్లు సలాం చేసి వెళ్లిపోయారు.
అబ్దుల్లా తల్లి మొహంలోకి చూస్తూ వుండిపోయాడు.
ఉపోద్ఘాతం లేకుండానే రాజమాత మొదలుపెట్టింది. 'అబ్దుల్లా, ఈ వంశ స్థాపకుడు బరే మాలిక్ సుల్తాన్ కులీ నుంచి నేటి వరకు గోలుకొండను ఏలిన వారు అందరూ సర్వంసహ చక్రవర్తులే. ఆజ్ఞలు ఇచ్చినవారే కానీ ఎన్నడూ ఆజ్ఞా బద్ధులు కాలేదు. ఎదుటివారి తలలు వంచినవారే కానీ, ఎవరి ముందు తల దించడం వారెరుగరు' రాజమాత మాట్లాడటం ఆపింది. వేటకాడి బాణం తగిలిన పులిలా ఆమె తన ఆసనంలో అసహనంగా కదిలింది.
అబ్దుల్లా తల వంచుకున్నాడు.
సింహాసనం ఎక్కినప్పుడు నువ్వు బాలుడివి. అందుకని అన్నిటికి నేనే నడుం బిగించాను. నీ మీద ఎలాంటి బాధ్యత పెట్టకపోవడం నేను చేసిన పొరపాటు అనిపిస్తోంది. నీకు వయసు వచ్చింది, ఇహ రాజ్య వ్యవహారాలు నీకు నువ్వే స్వంతగా చక్కబెట్టుకోవాలి అని అన్యాపదేశంగా చెప్పటానికి, నీకు పద్దెనిమిదవ ఏడు రాగానే ఆ పండుగను హయత్ నగర్ లో పన్నెండు రోజుల పాటు అట్టహాసంగా చేశాను. ఆ సందర్భంలో నీకు లభించిన అపురూపమైన హోదా, అరుదైన గౌరవం చూసినప్పుడు నీ స్థాయి ఎంత ఉన్నత మైనదో నువ్వు గ్రహిస్తావనుకున్నాను. దానికి తగ్గట్టు నిన్ను నువ్వు మలుచు కుంటావనుకున్నాను'.
అబ్దుల్లా ఏదో మాట్లాడుదామనుకున్నాడు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు అనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు.
'అబ్దుల్లా, నువ్వు ఏ రైతు కొడుకువో, మరే సామాన్యుడి కుమారుడివో కావు. అలాంటి వాడు బాధ్యతల నుంచి పారిపోతే, వాడు, వాడి కుటుంబం మాత్రమే ఆ దుష్ఫలితా లను అనుభవిస్తారు' హయత్ బక్షీ బేగం మాట్లాడటం ఆపి కొడుకు మొహంలోకి చూసింది. తలవంచుకుని కూచోవడం వల్ల సుల్తాన్ మొహంలోని భావాలను ఆమె చదవలేకపోయింది. అందుకే, 'అబ్దుల్లా తల ఎత్తు. నా మొహంలోకి సూటిగా చూడు' అంది.
అబ్దుల్లా తల ఎత్తాడు.
'మళ్లీ చెబుతున్నాను విను. నువ్వు నూటిలో ఒకడివో కోటిలో ఒకడివో మాత్రమే. మహావీరులైన ఖారా కుయునల తెగకి చెందినవాడవు. నీ పూర్వీకులు సర్వంసహ చక్రవర్తులుగా ఎదురు లేకుండా ఎలారు. వారి రక్తమే నీలోనూ వుంది. నీలాంటివాడు బాధ్యతలను విస్మరిస్తే, ఈ రాచపరివారమే కాదు, ఈ మహా సామ్రాజ్యం యావత్తు దానికి భారీ వెల చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా చెప్పవలసిన అవసరం నాకు ఎందుకు కలిగిందో తెలుసా'.
'తెలుసు. నాకూ బాధగానే వుంది. షాజహాను చక్రవర్తి ఫర్మానా పంపాడు'.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'ఆ ఫర్మానా ఒక రాజు తన సాటి రాజుకి పంపుతున్నట్టు లేదు. ఒక భూస్వామి తన పాలేరుకి పంపుతున్నట్లు ఉంది. ఒక ముసల్మాను తోటి ముసల్మానుకి పంపుతున్నట్టు లేదు. షియా పాయను ద్వేషించే సున్నీ పంపినట్టు ఉంది. చేసిన మేలు మరచిన ఒక కృతఘ్నుడు పంపినట్లు ఉంది' ఆవేశంతో కోపంతో హయత్ బక్షీ బేగం ముక్కుపుటాలు అదిరాయి.
తల్లి ఆవేశం చూసిన అబ్దుల్లాకి నోట మాట రాలేదు.
'తండ్రి జహంగీరు మీద తిరుగుబాటు చేసిన షాజహాను ప్రాణాల మీద ఆశ వదులుకుని దక్కనులో దాగినప్పుడు, గోలుకొండ ఆయనకి అండగా నిలిచింది. గోలుకొండ, మచిలీపట్టణాల మీదుగా బెంగాలు చేరడానికి అనుమతించింది. ప్రయాణంలో ఆయనకి ధనధాన్యాలు సమకూర్చవలసిందిగా నీ తండ్రి మహమ్మద్ కుతుబ్ షా ఆజ్ఞాపించాడు. షాజహానుకి కనీసం ఆ విశ్వాసమన్నా లేదు. దురాక్రమణ చెయ్యడమే మొగలుల నీతి. ఆ దురాక్రమణ మంటలలో దౌలతాబాదు మండిపోయింది. ఆ వేడి గోలుకొండ కోట గోడలను కరిగిస్తోంది' హయత్ బక్షీ బేగం మొహం నిండా విషాదం పేరుకుపోయింది. దాన్ని తట్టుకోవ డానికా అన్నట్టు పాన్దాన్ లోంచి ఒక పాన్ తీసుకుని నోట్లో వేసుకుంది.
'చక్రవర్తి షరతులకి తల వంచక తప్పదు' అన్నాడు అబ్దుల్లా, ఆ సమస్యకు అదే పరిష్కారమైనట్టు.
'మరొక ఆలోచన, సమాధానం నీ దగ్గర వుండవని నాకు తెలుసు' అంది హయత్ బక్షీ బేగం నిష్టూరంగా.
'మా సాహెబా, రెండవ పానిపట్ యుధ్ధం తరువాత మొగలులు చేసిన నూరు యుద్ధాలలోనూ వారే గెలిచారు. అలాంటి వారికి ఎదురు తిరగడం నిప్పుతో చెలగాటం అడటం తప్ప మరేమీ కాదు. అందుకే ఇన్కాయాద్ నామా మీద సంతకం చెయ్యడానికి సిద్దపడ్డాను' అన్నాడు అబ్దుల్లా బాధగా.
'నువ్వు అందుకు సంసిద్ధత ప్రకటించావని తెలిసే నిన్ను పిలువనంపాను. కుతుబ్షాహీ వంశస్థాపకుడు కులీ కేవలం అయిదు వేల సైన్యంతో సితాబాఖాన్ నాయకత్వం వహించిన మూడు లక్షల సైన్యాన్ని మట్టి కరిపించాడు. చేత కరవాలాన్ని పట్టి యుద్ధాశ్వాన్ని ఉరకలు వేయిస్తూ అరవై ఆరు దుర్గాలని వంటిచేత్తో లొంగదీసు కున్నాడు. ఎట్టి పరిస్థితులలోనూ అతడు లొంగిపోవడానికి ఇష్టపడలేదు. అసలు లొంగిపోవడం కంటే ఆత్మార్పణం చేసుకోవడం వల్లే అమరులవుతారు'.
'మా సాహెబా, ఇన్కయాద్ నామా మీద సంతకం చేసి తీరాలి. ఓడిపోయే యుద్ధం చేసి అమరులవడం కంటె, పరిస్థితులతో రాజీపడి...’
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'అంత రాజీపడే అవసరం ఉందని భావిస్తున్నావా. గోలుకొండకి నాలుగు లక్షల పైన సుశిక్షితమైన సైన్యం వుంది. జాగీరుదార్ల సైన్యంతో పాటు శతృ దుర్భేధ్యమైన కొండపల్లి, కొండవీడు, ఓరుగల్లు లాంటి దుర్గాలు వున్నాయి. అన్నిటికి మించి శతృవు బెదిరింపులకి లొంగని బీరువోని ఆత్మగౌరవం మనకి వారసత్వంగా వుంది. నేను చెప్పేది వింటున్నావా'
'వింటున్నాను' అన్నాడు అబ్దుల్లా.
‘నా తండ్రి కులీకుతుబ్ షా కి అక్బరు చక్రవర్తి తన రాయబారి మసూద్ బేగ్ ద్వారా శ్రీముఖం పంపాడు. తనకి సామంతుడుగా ఉండమని ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని నా తండ్రి నిర్ద్వందంగా తిరస్కరించాడు. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ అందంగా అలంకరించిన ముప్ఫయి ఏనుగులను కానుకగా పంపాడు. జహంగీరు చక్రవర్తి కూడా నీ తండ్రి మహమ్మద్ కుతుబ్ షాకి అలాంటి వర్తమానమే పంపాడు. గోలుకొండ సామ్రాజ్యాన్ని మొగలుల సామంత రాజ్యంగా దిగజార్చలేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు మీ నాన్న. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఇరవై లక్షల పేష్ కష్ కట్టడానికి మాత్రమే అంగీకరించారు' హయత్ బక్షీ బేగం మొహం స్వచ్ఛమైన స్వేచ్ఛా భావాలకి అద్దంగా మారి స్వాతంత్ర సౌందర్యాన్ని విరజిమ్మింది.
అబ్దుల్లా తల్లి వైపే చూస్తూ కూచున్నాడు.
'ఈ వంశ స్థాపకుడు కులీ, తెలంగాణలోని బందిపోటులను నిర్దాక్షిణ్యంగా అణచి వేశాడు. నువ్వు ఈ మొగలు బందిపోటు లకి దేశ సంపదను బంగారు పళ్లెంలో పెట్టి అందించే సంప్రదాయానికి తెర తీస్తున్నావు'.
'అమ్మా, మీకు ఎందుకింత పట్టుదల' అన్నాడు అబ్దుల్లా అసహనాన్ని పంటి బిగువున దాచుకుంటూ.
'ఎందుకా. నేను ఒక సర్వం సహ చక్రవర్తి కూతురిని. మరొక సర్వం సహ చక్రవర్తి భార్యని' హయత్ బక్షీ బేగం మాట్లాడటం ఆపింది. కొడుకు మొహంలోకే చూస్తూ 'ఇప్పటిదాకా ఒక సర్వం సహ చక్రవర్తి తల్లిని' అంటూ లేచి వెళ్లిపోయింది.
👳🏽
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment