Thursday, October 9, 2025

 *శ్రీ శివ మహా పురాణం*
*398.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-పదిహేడో అధ్యాయం* 

*సృష్టి వర్ణనము* 

*వాయువు ఇట్లు పలికెను:* 

ఈ విధముగా ఈశ్వరునినుండి సర్వశ్రేష్ఠము, శాశ్వతము అగు శక్తిని పొంది, ప్రజాపతి స్త్రీ పురుషసమాగమము వలన కలిగే సృష్టిని చేయగోరెను. అద్భుతశక్తి గల ఆయన తానే స్వయముగా సగము పురుషుడు, సగము స్త్రీ అయెను. ఏ అర్థభాగముచే ఆయన స్త్రీ ఆయెనో, ఆ భాగమునుండి శతరూప ఉద్భవించెను. ఆయన అర్ధభాగముచే పురుషుడై విరాట్‌ ను సృష్టించెను. సృష్ట్యాది యందలి ఆ పురుషుడే స్వాయంభువమనువు అని పిలువబడినాడు. ఆ శతరూపాదేవి మిక్కిలి కఠినమగు తపస్సును చేసి, ఉజ్జ్వలమగు కీర్తి గల మనువునే భర్తగా పొందెను. ఆయనకు శతరూపయందు పుత్రులు గలవారిలో శ్రేష్ఠులగు ఇద్దరు కొడుకులు కలిగిరి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనునవి వారి పేర్లు. వారికి మహాసాధ్యులు అగు ఇద్దరు కన్యలు కూడ కలిగిరి. ఒకామె పేరు ఆకూతి. రెండవ ఆమె పేరు ప్రసూతి. ఈ ప్రజలు వారిద్దరి నుండియే పుట్టిరి. స్వాయంభువమను మహారాజు ప్రసూతిని దక్షునకిచ్చెను. ఆ ప్రజాపతి ఆకూతిని రుచికి ఇచ్చి వివాహము చేసెను. బ్రహ్మమానసపుత్రుడగు రుచికి ఆకూతి యందు యజ్ఞము, దక్షిణ అనే శుభకరమగు ఇద్దరు సంతానము కలిగిరి. వారిద్దరి వలననే ఈ జగచ్చక్రము తిరుగుచున్నది. దక్ష ప్రజాపతి స్వాయంభువుని కుమార్తెయగు ప్రసూతియందు లోకములకు తల్లులగు ఇరవై నల్గురు కన్యలను కనెను.

శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే పదముగ్గురు  దక్షపుత్రికలను ధర్మప్రభుడు భార్యలనుగా స్వీకరించెను. వారి తరువాత వారి చెల్లెళ్లు పదకొండు మంది సుందరయువతులు మిగిలియుండిరి. ఖ్యాతి, సతి, అర్థసంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహా, స్వధా అనునవి వారి పేర్లు. ఓ మహర్షులారా! భృగువు, శివుడు మరియు మరీచి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, అత్రి, వసిష్ఠుడు అనే ఏడ్గురు ఋషులు, అగ్ని, పితృదేవతలు అనువారలు ఆ ఖ్యాతి మొదలగు కన్యలను క్రమముగా వివాహమాడిరి. కామునితో మొదలిడి, యశస్సు వరకు గల పదముగ్గురు పుత్రులను ధర్ముడు శ్రద్ధ మొదలగు వారియందు కనెను. వీరు ఒకరికంటె అధికమగు సుఖమును మరియొకరు ఇచ్చెదరు. అధర్మునకు హింసయందు నికృతి మొదలగు అధర్మస్వభావము గల సంతానము కలిగిరి. వీరు ఒకరిని మించి మరియొకరు దుఃఖమును కలిగించెదరు. ఏ విధమైననియమములు లేని వీరికి అందరికి భార్యలు గాని, పిల్లలు గాని లేరు. ఈ విధముగా ధర్మమును నియంత్రించే ఈ తామససృష్టి జరిగినది. దక్షుని పుత్రి, రుద్రుని భార్య యగు సతి  భర్త నిందింపబడిన సందర్భములో బంధువులతో కూడియున్న దక్షుని మరియు ఆయన భార్యను నిందించి, తన దేహమును విడిచిపెట్టి, పర్వతరాజగు హిమవంతునకు మేనయందు పుత్రికయై అవతరించెను. రుద్రుడు ఆ సతీదేవియొక్క అవస్థను చూచుట, తనతో సమానమగు కాంతి గల భయంకరాకారులను  లెక్క లేనంతమందిని సృష్టించుట మొదలైన వృత్తాంతము పూర్వమే చెప్పబడినది. భృగువునకు ఖ్యాతి యందు నారాయణునకు ప్రియురాలగు లక్ష్మీదేవి, మరియు ధాత విధాత అనే ఇద్దరు దేవతలు జన్మించిరి. మన్వంతరమును నిలబెట్టిన వీరిద్దరికి వందల వేల సంఖ్యలో కొడుకులు మరియు మనుమలు కలిగిరి. స్వాయంభవమన్వంతరములో నివసించిన వారందరికి భార్గవులు (భృగువంశమునందు పుట్టినవారు) అని పేరు. మరీచికి సంభూతియందు పౌర్ణమాసుడు జన్మించెను.

ఆయనకు నల్గురు కుమార్తెలు కూడ గలరు. ఆ వంశమువారు చాల గొప్పవారు. వారి వంశములోననే అనేకపుత్రులు గల కశ్యపుడు జన్మించెను. అంగిరసుని భార్యయగు స్మృతికి అగ్నీధ్రుడు, శరభుడు అనే ఇద్దరు కొడుకులు మరియు నల్గురు కుమార్తెలు కలిగిరి. వారి కొడుకులు, మనుమలు వేల సంఖ్యలో గలరు. వారు కాలగర్భములో కలిసి పోయిరి. పులస్త్యుని భార్యయగు ప్రీతికి దంతోగ్ని అనే కొడుకు కలిగెను. ఆయన పూర్వజన్మలో స్వాయంభువమన్వంతరములో అగస్త్యుడని చెప్పబడినది. ఆయనకు పౌలస్త్యులు అని ప్రఖ్యాతిని గాంచిన అనేకులు సంతానము గలరు. పులహప్రజాపతికి భార్యయగు క్షమయందు కర్దముడు, ఆసురి, సహిష్ణుడు అనే ముగ్గురు కొడుకులు కలిగిరి. వారందరు యజ్ఞాగ్నితో సమానమగు కాంతి గలవారు. వారి వంశము ప్రతిష్ఠను పొందినది. క్రతువుయొక్క భార్యయగు సన్నతి యజ్ఞమువలె పవిత్రులైన కొడుకులను కనెను. వారందరు నైష్ఠికబ్రహ్మచారులగుటచే, వారికి భార్యలు గాని పిల్లలు గాని లేరు. వాలఖిల్యులని చెప్పబడే ఆ మహాత్ముల సంఖ్య అరవై వేలు. వారు సూర్యుని ప్రదక్షిణము చేసి అనూరునకు (సూర్యుని సారథి) ముండు నడచెదరు. అత్రియొక్క భార్యయగు అనసూయ అయిదుగురు ఆత్రేయులనే పుత్రులను, శ్రుతి అనే కన్యను కనెను. శ్రుతియొక్క పుత్రుడు శంఖపదుడు. సత్యనేత్రుడు, హవ్యుడు, ఆపోమూర్తి, శనైశ్చరుడు, సోముడు అను అయిదుగురు ఆత్రేయులని కీర్తింపబడచున్నారు. మహాత్ములగు ఆ ఆత్రేయులకు స్వాయంభువమన్వంతరములో వందల వేల సంఖ్యలో కొడుకులు, మనుమలు కలిగిరి. వారు కాలగర్భములో కలిసిపోయిరి. వసిష్ఠునకు ఊర్జయందు ఏడ్గురు కొడుకులు కలిగిరి. పుండరీక అనే సుందరి వారికి పెద్ద అక్క గారు.

రజస్సు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, సవనుడు, అనయుడు, సుతపసుడు, శుక్రుడు అనునవి ఆ ఏడ్గురు ఋషుల పేర్లు. మహాత్ములగు ఆ వసిష్ఠపుత్రులయొక్క గోత్రనామములు స్వాయంభువమన్వంతరములో వేల కోట్ల సంఖ్యలో ఉండెను. వారందరు కాలగర్భములో కలిసిరి. ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగా వంశసంతతితో కూడియున్న ఋషిసర్గమును విస్తరముగా వర్ణించుట శక్యము కాదు. కావుననే, సంగ్రహముగా వర్ణించితిని. బ్రహ్మమానసపుత్రుడు మరియు రుద్రస్వరూపుడు అగు అగ్నికి ఆయనయొక్క ప్రియురాలగు స్వాహాదేవియందు సాటిలేని తేజస్సు గల ముగ్గురు కుమారులు కలిగిరి. పావకుడు, పవమానుడు, శుచి అనునవి ఆ ముగ్గురి పేర్లు. మంథనమునందు పుట్టే అగ్నికి పవమానుడని పేరు. మెరుపులో పుట్టే అగ్నికి పావకుడని పేరు. సూర్య ప్రకాశమునందు గల తేజస్సునకు శుచి అని పేరు. వీరి ముగ్గురికి క్రమముగా హవ్యవాహుడు, కవ్యవాహుడు, సహరక్షడు అనే ముగ్గురు కొడుకులు కలిగిరి. వారు క్రమముగా దేవతలు, పితృదేవతలు, అసురులు అను వర్గములకు చెందినవారు. వారికి నలభై తొమ్మిదిమంది కొడుకులు, మనుమలు గలరు. వీరు క్రమముగా కామ్య (కోరిక సిద్ధించుటకై చేయబడునవి), నైమిత్తిక (ఒకానొక నిమిత్తము లేక సందర్భమును పురస్కరించుకొని చేయబడునవి), నిత్య (తప్పని సరిగా చేయదగినవి) కర్మలు అనే మూడు రకముల కర్మలయందు ప్రతిష్ఠితులై యుందురు. వీరందరు తపశ్శాలులు మరియు వ్రతనిష్ఠ గలవారు అని తెలియదగును. రుద్రునియందు నిష్ఠ గల వీరు అందరు రుద్రస్వరూపులే. కావున, ఎవడైననూ అగ్నియొక్క నోటియందు ఏయే ఆహుతులను సమర్పించునో, ఆ సర్వము నిస్సందేహముగా రుద్రుని ఉద్దేశించి మాత్రమే సమర్పించినట్లగును. ఈ విధముగా అగ్నుల నిశ్చయము ఉన్నది ఉన్నట్లుగా క్రమములో చెప్పబడినది.

ఓ బ్రాహ్మణులారా! ఈ పైన పితృదేవతలను గురించి ఎక్కువ విస్తారము కాకుండగా చెప్పెదను. పితృదేవతలకు స్థానము ఆరు ఋతువులు. ఈ ఋతువులు అనే స్థానమునందు వారికి అభిమానము (నాది అనే భావన) గలదు. కావున, ఋతువులే పితృదేవతలు అగుదురని వేదమంత్రములలో వినబడుచున్నది. చరాచరప్రాణులన్నియు ఋతువులయందు మాత్రమే జన్మించుచున్నవి. కావున, ఈ పితృదేవతలు ఆర్తవులు (ఋతువుల అభిమాని దేవతలు) అని వేదము చెప్పుచున్నది. ఈ విధముగా ఋతువులు అనే కాలాంశములకు అభిమాని దేవతలగు పితరులలో అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనే రెండు రకములు గలరని మహర్షులు చెప్పెదరు. మేఘములతో కలిసి ఉండే ఈ పితృదేవతలు ఆత్మజ్ఞానము అనే ఐశ్వర్యము గల మహాత్ములు. గృహస్థులగు ఆ రెండు రకముల పితరులలో రెండవ వారు యజ్ఞయాగములను చేసినవారు కాగా, మొదటి వారు అట్లు కాదు. పితృదేవతలకు స్వధయందు లోకప్రఖ్యాతిని గాంచిన ఇద్దరు కుమార్తెలు కలిగిరి. మేన, ధరణి అనునవి వారి పేర్లు. వారిద్దరు ఈ జగత్తునంతనూ నిలబెట్టినారు. మేన అగ్నిష్వాత్తుల పుత్రిక కాగా, ధరణి బర్హిషదుల పుత్రిక. హిమవంతుని భార్యయగు మేన మైనాకుడు, క్రౌంచుడు అను పుత్రులను, గౌరి, గంగ అనే పుత్రికలను కనెను. శివుని శరీరమును ఆలింగనము చేయుటచే గంగ పావని యైనది. మేరుపుయొక్క భార్యయగు ధరణి దివ్యమగు ఓషధులతో నిండియున్నవాడు, రంగు రంగుల అందమైన శిఖరములు గలవాడు అగు మందరుని పుత్రునిగా కనెను. శోభాయుక్తుడు, మేరుపుత్రుడు అగు ఆ మందరుడే తపస్సుయొక్క బలముచే కంఠమునందు విషముగల జగన్నాథుడగు శివునకు సాక్షాత్తుగా నివాసస్థానమైనాడు. ఆ ధరణి మరల వేల, నియతి మరియు ఆయతి అనే ముగ్గురు లోకప్రఖ్యాతిని గాంచిన కన్యలను కనెను. ఆయతి, నియతి అను వారిద్దరు భృగువుయొక్క పుత్రులకు ఇద్దరికి భార్యలు అయినారు. వారి వంశమును గురించి పూర్వము నేను స్వాయంభువ మన్వంతర ప్రసంగములో చెప్పియుంటిని.

వేల సాగరునితో కలిసి ఒక సుందరియగు కన్యను కనెను. సవర్ణ అనే పేరుగల ఆ సముద్రపుత్రి ప్రాచీనబర్హిషుని భార్య అయెను. ప్రాచీనబర్హిషునకు ఆ సముద్రపుత్రియందు పది మంది కొడుకులు కలిగిరి. వారికి ప్రాచేతసులు అని పేరు. వారు ధనుర్వేదములో దిట్టలు. స్వాయంభువమన్వంతరములోని దక్షుడు శివుని శాపము వలన పూర్వము చాక్షుషషమన్వంతరములో వారికి పుత్రుడు అయెను. ఓ బ్రాహ్మణులారా! ఇంతవరకు మీకు ఈ ధర్ముడు మొదలగు మహాత్ములయొక్క వృత్తాంతమును మిక్కిలి సంక్షేపము కాకుండగా మరియు అతివిస్తారము కాకుండగా వరుసగా చెప్పితిని. దేవగణములతో కూడియున్నవి, వైదికకర్మానుష్ఠానముతో కూడినవి, సంతానవంతములు, గొప్ప భోగభాగ్యములతో తులదూగునవి అగు దివ్యవంశములను నేను వర్ణించి చెప్పితిని. ప్రజాపతినుండి పుట్టిన ఈ సంతానసమూహమును వందల కోట్ల సంవత్సరముల కాలములోనైననూ ఖచ్చితముగా లెక్కించుట సంభవము కాదు. భూలోకములో మిక్కిలి పవిత్రమైన రాజుల వంశము కూడ సూర్యవంశము, చంద్రవంశము అనే రెండు శాఖలను కలిగియున్నది. ఇక్ష్వాకువు, అంబరీషుడు, నహుషుని పుత్రుడగు యయాతి మొదలగు పవిత్రకీర్తి గల ఏ రాజులు లోకములో ప్రఖ్యాతిని గాంచియున్నారో, మరియు అనేకశక్తిసామర్థ్యములు గల ఏ ఇతరరాజర్షులు గలరో, వారు కూడ ఆ వంశములకు చెందినవారే. మరణరహితులగు ఆ పురాతనచక్రవర్తులను గురించి పూర్వములో చెప్పియుంటిని. మరల వారిని గురించి చెప్పుటలో ఫలమేమి గలదు?  ఇంతే గాక, ఈశ్వరుని కథను చెప్పే సందర్భములో అనేకములగు ఇతరవిషయములను గురించి అధికప్రసంగమును చేయుట సత్పురుషులకు సమ్మతము కాబోదని తలంచి నేను ఆ వివరములను ఉత్సాహముతో చెప్పుట లేదు. ఈశ్వరుని మహిమను కళ్లకు కట్టినట్లు వర్ణించే సందర్భమును పురస్కరించు కొని మాత్రమే నేను సృష్టి మొదలగు వాటిని గురించి చెప్పితిని. ఆవివరములు కూడ ఇక చాలును.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో సృష్టిని వర్ణించే పదునేడవ అధ్యాయము ముగిసినది.*

No comments:

Post a Comment