245 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 33
ఏకాగ్రతా నిరోధో వా మూడై రభ్యస్యతే భృశమ్|
ధీర కృత్యం న పశ్శాంతి ససుప్తవత్త్వపదే స్థితాః||
మూడులు మాత్రమే మనసుని నియమించి ఏకాగ్రతను అభ్యసిస్తూ ఉంటారు. జ్ఞాని తన సహజ స్వరూప నిష్టుడై ,సుషుప్తిలో ఉన్న వానివలె దేనిని సాధించాలి అనుకోడు.
తమ మన శరీరాలపై దృష్టి బాగా ఉండి అహంకారం అధికంగా పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మూడః అన్న పదం వాడబడింది. ఈ స్పృహ ఉన్నంత కాలము ఇంద్రియాలు అదుపులో ఉంచుకుంటూ మనసును ఏకాగ్రతతో శాంతింప చేయటానికి ప్రయత్నించక తప్పదు. జీవన్ముక్తుడైన జ్ఞాని ఆత్మస్థితుడు అయి ఉండటముతో అతనిది అనిపించే మనసు అహంకారం అతనిలో ఉండవు. అహంకార వర్జితుడైన అతను దేనిని సాధించాలి అనుకోడు.అట్టివానినే మహర్షి" సుప్తవత్ ",సుషుప్తిలో ఉన్న వాని వలె అని వర్ణించారు. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి అతని శరీర స్పృహ కాని నానాత్వమయమైన బాహ్య ప్రపంచపు స్మరణ కాని ఉండవు. దేనిని చూడకపోవటంతో అన్యధాగ్రహణము అనబడే భ్రమ కూడా ఉండదు. అద్వయమైన ఆత్మనే తన్నుగా వీక్షించే జ్ఞాని కూడా దేనిని శరీరంగా, ఇంద్రియాలుగా, వాటి అనుభవ క్షేత్రమైన జగత్తుగా భ్రమ పడడు. కేవలం గా తాను మాత్రమే శాంతి పూర్ణుడై ఉంటాడు.
జీవన్ముక్తుడైన యోగి తనదైన ప్రత్యేక ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు. అతని దృక్పథంతో మనకు సహజంగా కనిపించే ఇంద్రియా అనుభవ క్షేత్రాలు ఏవి ఉండవు .అంతట ఆత్మతత్వం మాత్రమే ఉంటుంది .ఆత్మలో ఆత్మగా జీవించే అట్టి యోగి కోరటానికి ఏముంటుంది? ధ్యానింపదగినది ఏది? దేనితో దానిస్తాడు? దేని నుండి అతడు దూరంగా తొలగిపోవాలి? చేరవలసిన గమ్యాన్ని చేరిన అతనికి మార్గం అవసరం ఏమిటి?
పరమ పురుషార్థము అనదగిన మానవ జీవిత గమ్యాన్ని సత్యాన్ని ఇక్కడ మహర్షి నేరుగా స్పష్టముగా చూపిస్తున్నారు .ఈ గమ్యాన్ని చేరడంలో గల దశలను యోగ వాసిష్టం ఎంతో ప్రేమతో ఒక చోట వివరిస్తుంది.
విచారణతో దృఢపడిన వివేకముతో మోహము నశిస్తుంది. ఫలితంగా తర్వాత ద్వేష భావాలు మూలమైన అహంకారంతో సహా నశిస్తాయి. ఆ తర్వాత క్రమంగా ధ్యానము మీద ప్రత్యేక దృష్టి తగ్గి శాంతము బాసిస్తుంది. ఆ ప్రకాశములో ఆత్మతత్వము అసలైన వివేకం అనంతంగా నిత్యంగా అద్వయంగా ఉంటుంది.🙏🙏🙏
No comments:
Post a Comment