Thursday, October 9, 2025

 *సేతు రహస్యం - 17*
🌊

రచన : గంగ శ్రీనివాస్

*సేతు నిర్మాణం - దేవరహస్యం*

రామేశ్వరంలో ఎంత దూరం నడిచినా ఒకటే లోతు ఉంటుంది సముద్రం. అక్కడ మామూలుగా సముద్రతీరంలో కనబడే కెరటాలు కూడా కనబడవు. అక్కడి సముద్రం చూసిన తర్వాత ధనుష్కోటికి వెళ్ళి సముద్రాన్ని చూసినట్లయితే ఎవరికైనా భయం కలగటం తథ్యం. ఎందుకంటే అక్కడ భయంకరమైన కెరటాలు తీరాన్ని బలంగా తాకుతూ  ఉంటాయి. లోతైన సముద్రంలో వారధి కడితే ఆ వారధిని అనుకొని సముద్రం లోతు హఠాత్తుగా చాలా అడుగుల లోతులో ఉంటుందనేది నిర్వివాదాంశం. అందుకే శ్రీధర్ కి ధనుష్కోటి వారధిలో ఒక భాగమనిపిస్తోంది.

అదే వాదనను కొంచెం ముందుకి తీసుకు వెళ్తే వారధి గనుక కాలక్రమేణా నీట మునిగితే అది రామేశ్వరంలోని సముద్రం ఉన్నట్టుగా ఎక్కువ దూరం కొంచమే లోతుగా ఉండే అవకాశమూ ఉంది. అందుకే రామేశ్వరం కూడా వారధిలోని భాగమే అనే అభిప్రాయంలో ఉన్నాడు శ్రీధర్.

అతని అంచనా ప్రకారం, సముద్రంలో సేతువు నిర్మాణంలో ఎలా పొరలు పొరలుగా చెట్లు, రాళ్ళు కనిపిస్తాయో, అలానే రామేశ్వరంలో జరిపే తవ్వకాలు కూడా అటువంటి పొరల లాంటి నిర్మాణాన్ని ఆవిష్కరిస్తాయనే ఆశతో ఉన్నాడు. అలా కొంతవరకు జరిగింది కూడా.

కాని అలా జరిగిన తర్వాతనైనా శాస్త్ర ప్రపంచం ఆ ఆధారాలను ఉపయోగించి రామసేతువు మానవ నిర్మితమనే అంశాన్ని ఆమోదిస్తుందా లేక ఏదైనా ప్రతివాదాన్ని ముందుకు తెస్తుందా అనేది వేచి చూడవలసిందే గాని శ్రీధర్ మస్తిష్కానికి తోచటంలేదు.

కాని అతని మనసులో భట్టుమూర్తి చెప్పిన విషయం మెదలుతూనే ఉంది. ఒక దేవ రహస్యం తనకు భవిష్యత్తులో హనుమంతుని వలన తెలుస్తుందని భట్టుమూర్తి గారు చెప్పారు. అదేమిటో తనకు తెలియటం వలన రామసేతువు మానవ నిర్మితమేగాని యాధృచ్చికంగా ఏర్పడిన సహజ నిర్మాణం కాదని నిస్సందేహంగా తీర్మానించడానికి వీలుపడుతుందని అతని ఆశ.

ఇంతలో డిన్నర్ టైమ్ అయిందని రాజేష్ చెప్పడంతో ప్రయోగశాల నుంచి అంతా భోజనాల గది వైపు వెళ్ళారు. అంతా కలసి మరుసటిరోజు సముద్రగర్భంలో తాము చేయబోయే తవ్వకాల గురించి మాట్లాడుకున్నారు. భోజనాలు ముగిసాక రాజేష్ కేట్ లు శ్రీధర్ కేబిన్ కి వెళ్ళారు.

"కేట్ ఎలా ఉంది నీ ప్రచారం" అన్నాడు శ్రీధర్.

"బాగుంది" అంది కేట్ కొంచెం మొహమాటంగా.

“ సింప్లీ సుపర్బ్, కేట్ మనమూహించిన దానికంటే ఎక్కువగానే యువతలో క్రేజ్ కలిగించింది. మనం ప్రారంభించిన సైట్ ని ఇంత తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్ది జనం ఇంటర్నెట్ లో చూస్తునారు. ఆమెకు వచ్చే మెయిల్స్ చూడటానికి ఇప్పుడు ఒక గ్రూప్ ఏర్పాటు చేసాము. అందులో భట్టుమూర్తి గారి ఆధ్వర్యంలో పదిమంది వరకు పండితులు ఉన్నారు. వాళ్ళు జనం అడిగే సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా యువతకు రామాయణంలో ఎక్కువ సందేహాలు వస్తున్నాయి. అందుకు ప్రతిరోజు సీరియల్ లాగా రామాయణాన్ని ఇంగ్లీష్ లోను ఇతర భాషలలోను వివరంగా ఇంటర్నెట్ లో తెలియజేయడా నికి ఏర్పాట్లు చేసింది." గుక్క తిప్పుకో కుండా చెప్పాడు రాజేష్.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
శ్రీధర్ ముందు తనను రాజేష్ అంత పొగుడుతుంటే కేట్ బుగ్గలు సిగ్గుతో కెంపులయ్యాయి. శ్రీధర్ ఆమెను అభినందిస్తూ చూశాడు. 

"కేట్ నీ సృజనాత్మకతకు అవధులు లేవు. రామాయణానికి యువతలో నువ్వు చేస్తున్న ప్రచారానికి నాకెంతో గర్వంగా ఉంది. అంతెందుకు రామాయణంతో పాటు నీ పేరు కూడా ప్రపంచమంతా మారుమ్రోగిపోతుంది". అన్నాడు ఆప్యాయంగా.

ఆనంద భాష్పాలతో కేట్ కళ్ళు సజలాలయ్యా యి. 

"మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. అమృతం తియ్యగా ఉంటే అది అమృతం గొప్పేగాని, రుచి చూసి ఇంకొకరికి చెప్పే వారిది కాదుగా, అలాగే నేను తెలుసుకొన్న రామాయణం రుచికి పరవశించి, నేను చేస్తున్న ప్రచారం కూడా రామాయణం గొప్పనే తెలియజేస్తుంది గాని, నా గొప్పతనం ఏమి కాదు" అంది.

"సరేలే నువ్వు ఒప్పుకోకపోయినా ఇప్పుడు నష్టంలేదు. నీకు వచ్చే పేరు ఎలాగయినా వచ్చి తీరుతుంది. సరదాగా ఆ మెయిల్స్ చూద్దామా" అన్నాడు రాజేష్.

కేట్ సృష్టించిన ప్రచారానికి తొలి మెట్టుగా రూపొందించబడిన వెబ్ సైట్ ని ఇంటర్నెట్ లో ఓపెన్ చేశాడు రాజేష్, ఆసక్తిగా చూస్తున్నాడు శ్రీధర్, ఆ వెబ్ సైట్ ను రూపొందించిన సాంకేతికతకు రాజేష్ కారణమయినా, అందులోని ప్రతి అంశము కేట్ స్కెచ్ వేసి ఇచ్చిందని, అందువలన అణువణువు ఆ సైట్ కేట్ యొక్క వ్యక్తిత్వానికి ఆమెకు రామాయణం పట్ల కలిగిన అపూర్వ స్పందన కు, తార్కాణం అని శ్రీధరికి తెలుసు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అతను అంతవరకు ఆ సైట్ ను చూడలేదు. అంతకుముందు రాజేష్ కేట్ చనువుగా మసలటం అతనికి ఎంతో వేదన కలిగించింది. అందుచేతనే ఆ సైట్ ని చూడటానికి ప్రత్యేకంగా ఆసక్తి కనబరచ లేదు. కాని ఇప్పుడు కేట్ తో తనకున్న బంధం జన్మజన్మల అనుబంధం అనే నమ్మకం సంపూర్ణంగా కలగడం వలన అతనికి ఆ వెబ్ సైట్ చూడాలనిపించింది.

వివిధ రంగులతో ఆకర్షణీయమైన డిజైన్ తో ఉంది ఆ వెబ్ సైట్. శ్రీరాముడు ధనుర్బాణాలు ధరించి ఒక అడుగు ముందుకి వేసి నుంచున్న సుందరమైన చిత్రంతో మొదలైంది ఆ వెబ్ సైట్ హోమ్ పేజి.

ప్రతిరోజు సీరియల్ గా రామకథను అందరికి అర్ధమయ్యేలా వాల్మీకం ఆధారంగా చేసిన ఇంగ్లీష్ అనువాదం ధారావాహికంగా ఒక వెబ్ పేజిలో ఉంది. మరొక పేజిలో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలోని చారిత్రాత్మకంగాను, ఆధ్యాత్మికంగాను రామాయణంతో సంబంధం ఉన్న దేవాలయాల విశేషాల తోను, స్థల పురాణాలతోను నిండి ఉన్న సచిత్ర వివరాలు పొందుపరిచారు. మరో చోట పాఠకులుకు సంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ భట్టుమూర్తిగారు ప్రతిరోజు నిర్వహిస్తున్న శీర్షిక ఉంది. ఇంకో చోట రామాయణం స్ఫూర్తిగా తీసుకొని తమ దైనందిన సమస్యలకు పరిష్కారం కోరిన వారికి అద్భుతమైన సలహాలను అందించే హెల్ప్ లైన్ కూడా ఉంది. దీన్ని కేట్ స్వయంగా నిర్వహిస్తుంది. దీనికి "శ్రేయో రామం" అని పేరు పెట్టింది.

ప్రఖ్యాతి చెందిన అనేక రామాయణాలను కూడా పూర్తి వివరాలతో పొందుపరిచారు. కంబ రామాయణం, మొల్ల రామాయణం, రంగనాథ రామాయణం, తులసీదాసు రామమానస చరిత్ర ఇంకా ఎన్నో, ఎన్నెన్నో సేకరించి అందరికి అందుబాటులో ఉంచారు. తులసీదాసు, కబీరు వంటి మహాత్ముల చరిత్రలను కూడా పరిచయం చేస్తున్న పేజీలు ఉన్నాయి.. అన్నిటికంటే ముఖ్యంగా తమకి కలిగిన దివ్యానుభవాల ను పంచుకోవలసిందిగా పాఠకుల కోసం ఏర్పరచిన 'లీలారామం' కు ఎక్కువగా స్పందన కలిగింది. ఇవిగాక ప్రతివారం ఒక వినూత్న పంథాలో కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అందులో వ్యాస రచన పోటీలు, క్విజ్లు, కవితా పోటీలు ఉన్నాయి. దీనికి "లోకాభిరామం" అని పేరు పెట్టారు.

ఇంకా రసవత్తరమైన చర్చలకు తెరతీస్తూ తాను మోడరేటర్ గా వ్యవహరిస్తూ కేట్ తన వెబ్ సైట్ ను నిత్య నూతనంగా ఉంచటంలో సఫలీకృతమైంది.

'సముద్రంలో మునిగి ఉన్న రామసేతువు ని, కంటికి అందంగా కనిపిస్తున్న తాజ్ మహల్ కంటే గొప్పదిగా ఎలా పోల్చగలం' అనే అంశంపై ప్రస్తుతం చర్చజరుగుతుంది. ప్రతివారం పాఠకులు వెలిబుచ్చిన తమ అభిప్రాయాలలో ఉత్తమమైన వాటికి ఆసక్తికరమైన బహుమతులు కూడా ప్రకటించింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
కేట్ తనకు వచ్చిన మెయిల్స్ చూసుకొంది. అందులో ఒరిస్సా నుంచి సందీప్ బెహరా అనే ఇంజనీరింగ్ యువకుడు పంపిన ఒక మెయిల్ ఉంది. కంటికి కనిపించని రామ సేతువుని ప్రపంచపు వింతగా భావిస్తున్న తాజ్ మహల్ తో ఎలా పోల్చగలము అంటూ కేట్ ని నిలదీస్తూ రాసాడు ఆ యువకుడు.

దానికి కేట్ ఎటువంటి సమాధానమిస్తుందో అని ఆసక్తిగా చూసాడు శ్రీధర్. రాజేష్ కి ఆ యువకుని పైన వల్లమాలిన కోపం వచ్చింది.

"అందరూ శభాష్ అని పొగుడుతుంటే వీడెవడండీ బాబూ ఇంతలా ఆమెని విమర్శిస్తున్నాడు. గాళ్ ఫ్రెండ్ కి తాజ్ మహల్ నమూనా ఏ వందకో కొని ఇచ్చి ఉంటాడు. 'రామసేతువు' ని అలా కొని ఇవ్వమంటుందేమో, ఏం చేయాలి అని భయపడుతున్నట్లున్నాడు పాపం అంటూ ఆ యువకుడిని పరిహాసం చేసాడు.

"ఓ పని చేద్దాం.. మనమే మినియేచర్ రామసేతువు బొమ్మలు తయారు చేసి ప్రేమ చిహ్నాలుగా అమ్మేద్దాం" నవ్వుతూ అన్నాడు శ్రీధర్.

ఏదో ఆలోచిస్తూ గంభీరంగా ఉన్న కేట్, శ్రీధర్ మాటలకు స్పందిస్తూ "ఎంత బాగా చెప్పారు మీరిద్దరూ, 'రామసేతువుకి మినియేచర్, ఒక అద్భుతమైన ఆలోచన అమేజింగ్. సరదాగా మాట్లాడుతూనే ఎంత చక్కటి ఊహను ఆవిష్కరించారు" శ్రీధర్ ను ప్రేమగా చూస్తూ అంది.

"అంటే తాజ్ మహల్ నమూనాల లాగా, రామసేతు మినియేచర్లు తయారుచేయా లనే ఆలోచన సీరియస్ గానే వచ్చిందా" నవ్వుతూ అడిగాడు రాజేష్.

"ఏం ఎందుకు చేయకూడదు? నాకు నమ్మకం ఉంది. మనం చక్కటి సేతువు మీనియేచర్ ని డిజైన్ చేస్తే రామసేతువు నమూనాలు ప్రపంచంలో అత్యధిక గిరాకీని పొందుతాయి, సందేహమే లేదు. మంచి పేరున్న శిల్పిని ఎంచుకొని ఈ పని అతనికి అప్పచెబుతాను. ఆ సంగతి నాకు వదిలేయండి" అంది కేట్. 

ఆమె కంఠంలో తొణికిసలాడిన వజ్ర సంకల్పానికి మిత్రులిద్దరూ విస్మయం చెందారు. భారతీయులై పుట్టిన తమకంటే విదేశాలలో జన్మించిన కేట్ కి రామాయణం పైన అంత అభిమానం, నమ్మకం ఏర్పడటం, తాను నమ్మిన విషయాన్ని అందరికీ నచ్చేలా చెప్పటం కోసం ఎంత శ్రమకైనా వెరవకపోవటం, నమ్మశక్యం కానంత అద్భుతంగా ఉంది. అంతకు మించి ఆనందంగానూ ఉంది.

 “అది సరే బెహరాకి ఏమి సమాధానం చెబుతావు?" అన్నాడు శ్రీధర్.
🌊
*సశేషం*
 ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment