*శ్రీ శివ మహా పురాణం*
*399.భాగం*
*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-పదునెనిమిదో అధ్యాయం*
*సతీ దేవి దేహమును త్యజించుట*
*ఋషులు ఇట్లు పలికిరి:*
పూర్వము దక్షుని కుమార్తె యగు సతీదేవి దక్షుని వలన సంప్రాప్తమైన దేహమును త్యజించి హిమవంతుని వలన మేనయందు జన్మించిన విధమెట్టిది? మహాత్ముడగు దక్షుడు రుద్రుని నిందించిన విధమెట్టిది? జగన్నాథుడగు శివుని నిందించుటకు గల కారణమేమి? పూర్వము దక్షుడు శివుని శాపముచే చాక్షుషమన్వంతరములో జన్మించిన విధమెట్టిది? ఓ వాయూ! ఈ విషయమును చెప్పుము.
*వాయువు ఇట్లు పలికెను:*
అల్పబుద్ధియగు దక్షుడు పాపప్రభావముచే మరియు నిర్లక్ష్యభావముచే సకలదేవతలకు నిందను కలిగించే పనిని చేసినాడు. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుడు. పూర్వము దేవతలు, రాక్షసులు, సిద్ధులు, మహర్షులు అందరు కలిసి ఒకనాడు పరమేశ్వరుని దర్శించుటకై హిమవత్పర్వతశిఖరమునకు వెళ్లిరి. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! అపుడు సతీపరమేశ్వరులు ఇద్దరు దివ్యమగు ఆసనమునందు కూర్చున్నవారై ఆ దేవతలు మొదలగు వారికి దర్శనమునిచ్చిరి. అదే సమయములో దక్షుడు కూడ దేవతలతో గూడి తన అల్లుడగు శివుని మరియు తన కూమార్తెయగు సతీదేవిని చూచుటకొరకై అచటకు వెళ్లెను. అపుడు దక్షుడు దేవిని కలుసుకొనెను. కాని ఆత్మగౌరవము గలవాడగుటచే శివుడు దేవతలు మొదలగు వారి కంటె అధికముగా దక్షుని ఒక్కసారియైననూ స్మరించలేదు. సతీశివుల పరమాత్మతత్త్వమునెరుంగక కేవలము సతి తన కుమార్తె యని మాత్రమే తలపోయు ఆ పరమమూర్ఖునకు ఆమెయందు వైరబుద్ధి నెలకొనెను. తరువాత ఆ వైరము కారణముగా మరియు దైవచోదితుడై దక్షుడు యజ్ఞదీక్షను స్వీకరించినప్పుడు ద్వేషము గలవాడగుటచే శివుని ఆహ్వానించలేదు. ఆతడు మిగిలిన అల్లుళ్లను వరుసగా ఆహ్వానించి, వారికి వేర్వేరుగా అసంఖ్యాకములగు ఉపచారములను చేసి పూజించెను. ఆ విధముగా వారందరు ఒకచోటకు చేరిన విషయమును నారదుని ముఖమునుండి విని రుద్రుని భార్యయగు సతీదేవి రుద్రునకు విన్నవించి తన తండ్రి ఇంటికి వెళ్లెను.
తరువాత, దగ్గరలో నున్నది, దివ్యమైనది, అన్ని దిక్కులయందు ద్వారములు గలది, మంచి లక్షణములు గలది, తేలికగా ఎక్కుటకు వీలైనది, చాల ఆహ్లాదకరమైనది, పుటము పెట్టిన బంగారము వలె ప్రకాశించునది, రంగురంగుల రత్నములతో అలంకరింప బడినది, పై భాగమునందు ముత్యములతో అలంకరించబడిన చాందినీ గలది, పుష్పమాలలతో చక్కగా అలంకరింపబడి యున్నది, పుటము పెట్టిన బంగారముతో మెరుగు పెట్టబడినది, వందల సంఖ్యలో రత్నములు పొదిగిన స్తంభములు గలది, వజ్రములు పొదిగిన మెట్లు గలది, పగడములతో అలంకరింపబడిన వాసములు ఆర్చీలు గలది, పుష్పములతో నిండిన తివాచీలు పరిచియున్నది, రంగు రంగుల రత్నములు పొదిగిన పెద్ద కుర్చీలు గలది, చిన్న చిన్న రంధ్రములద్వారా సర్వత్రా వ్యాపించే వజ్రముల కాంతులు గలది, ఎగుడు దిగుడులు లేకుండగా మణులచే పొదగబడిన అరుగులు గలది; మణులు పొదిగిన దండముతో సుందరమైన, పెద్ద ఎద్దు చిహ్నముగా గల, శరత్కాలమేఘము వలె తెల్లనైన పతాకముతో అలంకరింపబడిన ముందు భాగము గలది; రత్నములు పొదిగిన కవచములచే రక్షంపబడిన దేహభాగములు గల, రంగు రంగుల బెత్తములను మాత్రమే చేతులయందు ధరించియున్న, ఎదిరించ శక్యము కాని గణాధ్యక్షులచే పహరా కాయబడుచున్న పెద్ద ద్వారము గలది; మద్దెల తాలము గీతము వేణునాదము వీణానాదనము మొదలగు వాటియందు పాండిత్యముగల, విలువైన వేషములను ఆభరణములను ధరించియున్న, అనేక మంది స్త్రీ సమూహములతో కూడియున్నది అగు విమానమును. ఆ మహాదేవి తన ప్రియసఖురాండ్ర సమూహముతో గూడిఆరోహించెను. ఇద్దరు శుభలక్షణములు గల రుద్రకన్యలు వజ్రములు పొదిగిన దండములతో మనస్సులనను దోచివేసే రెండు వింజామరలను పట్టుకొనివీచుచుండిరి. అపుడు ఆ వింజామరల మధ్యలో నున్న దేవియొక్క ముఖము పోట్లాడుతున్న రెండు హంసల మధ్యలో నున్న పద్మము వలె ప్రకాశించెను. సుమాలిని అనునామె ప్రేమతో నిండిన హృదయము గలదై ఆ దేవియొక్క శిరస్సుపై చంద్రుని వలె ప్రకాశించే, చుట్టూ ముత్యాల హారములు గుచ్చబడిన గొడుగును పట్టుకొనెను. అధికముగా ప్రకాశించే ఆ గొడుగు ఆ దేవియొక్క ముఖముపై అమృతభాండముపై నున్న చంద్రమండలము వలె ప్రకాశించెను. చక్కని చిరునవ్వుతో ప్రకాశించే మోము గల శుభావతి యనునామె దేవికి ఎదురుగా కూర్చుండి యుండెను.
ఆమె పాచికలనాడుతూ సతీదేవికి వినోదమును సమకూర్చి ఉల్లాసమును కలిగించెను. సుయశస్సు అనునామె దేవియొక్క శుభకరములు, రత్నములు పొదిగనవి అగు పాదుకలను ఆ సమయములో తన స్తనముల మధ్యలో నుంచుకొని దేవిని సేవించెను. బంగారము వలె మెరిసే సుందరమైన అవయవములు గల మరియొక యువతి ప్రకాశించే అద్దమును పట్టుకొని యుండెను. ఒకామె తాటియాకు విసిరే కర్రను, మరియొక యువతి తాంబూలపు పెట్టెను పట్టుకొని యుండిరి. మరియొక సుందరి విలాసము కొరకు పట్టుకొనే అందమైన చిలకను దేవియొక్క చేతిలో నుంచెను. ఒకామె మిక్కిలి సుందరమైన పరిమళముతో కూడియున్న పుష్పములను, ఇంకొక కలువ కన్నులు యువతి ఆభరణముల పెట్టెను పట్టుకొని నలబడిరి. ఒక యువతి ముఖమునకు రాసుకొనే పరిమళద్రవ్యమును, మంచి పుష్పముల గుత్తిని, చక్కని కాటుకను పట్టుకొనెను. మిగిలిన యువతులు కూడ తమకు తగిన ఆయా సముచితమగు కార్యములను చేయుచూ, తమ తమ శక్తిననుసరించి ఆ మహాదేవి చుట్టూ నిలబడి ఆమెను అన్నివిధములుగా సేవించుచుండిరి. వారి మధ్యలో నున్న ఆ పరమేశ్వరి, శరత్కాలమునందు నక్షత్రములమధ్యలో నున్న చంద్రవంక వలె, అతిశయించి ప్రకాశించెను. తరువాత, ముందుగా శంఖనాదమును చేయబడెను . ఆ తరువాత ప్రయాణము ఆరంభమగునని సూచించే పెద్ద పటహధ్వని చేయబడెను. తరువాత చప్పట్ల తాళముతో కూడి విస్తారమును పొందే విధముగా మధురమగు వాద్యములు వాయించబడెను. వందల తప్పెట్లు వాయించకుండగనే మ్రోగుచుండెను. ఆ సమయములో మహేశ్వరునితో సమానమగు తేజస్సు గల ఎనిమిది వందల వేలమంది గణాధ్యక్షులు ఆయుధములను ధరించి ముందు నడిచిరి. వారి మధ్యలో గజమునధిష్ఠించిన బృహస్పతి వలె శోభాయుక్తుడగు గణాధ్యక్షుడు ఎద్దును ఎక్కి వెళ్లెను. చంద్రుడు మరియు నందీశ్వరుడు ఆయనను సేవించుచుండిరి. ఆకాశమునందు దేవదుందుభులు మ్రోగెను. మేఘములు దివ్యమగు సుఖమును కలిగించుచుండెను.
మునులందరు నాట్యమును చేసిరి. సిద్ధులు మరియు యోగులు ఆనందించిరి. అపుడు మేఘములు మార్గములో అంతటా దేవగణములతో కూడి చాందినీ పై పుష్పముల వానను కురిపించెను. మహేశ్వరి క్షణకాలమా యన్నట్లు శీఘ్రముగా తండ్రియొక్క ఇంటిని చేరుకొనెను. దక్షుడు తనకు వినాశము సమీపించిన కారణముగా ఆమెను చూచి కోపించి ఆమెను సత్కరించకుండగనే ఆమె కంటె చిన్నవారికి కూడ పూజను చేసెను. అపుడ మంగళకరమగు ముఖము గది, జగన్మాత అగు ఆ దేవి సబామధ్యమునందున్న తన తండ్రిని ఉద్దేశించి కంగారు లేకుండగా యోగ్యమైన మరియు దీనమైన వచనమును పలికెను.
*దేవి ఇట్లు పలికెను:*
ఓ తండ్రీ! బ్రహ్మ మొదలుకొని పిశాచము వరకు గల సర్వప్రాణులు ఎవని ఆజ్ఞకు అధీనమై యున్నవో, ఆ దేవుని నీవిప్పుడు యథావిధిగా పూజించుకుంటివి. ఆ విషయమునట్లుంచుము. నీవు పెద్ద కుమార్తెనగు నన్ను సత్కరించకుండగా అవమానించి ఈ విధముగా ఇతరులను పూజించుట అనే ఇటువంటి నిందార్హమైన పనిని చేసితివి. దీనికి కాణమేమి? ఆమె ఇట్లు పలుకగా, దక్షుడు కోపముతో మండి పడినవాడై, ఆమెతో నిట్లనెను: నా చిన్న కూతుళ్లు నీకంటే గొప్పవారు, పవిత్రులు మరియు పూజింప దగినవారు. వారి భర్తలను కూడా నేను ఆనందముతో పూజించుచున్నాను. నీ భర్త ముక్కంటియే అయినను, వారు గుణములలో ఆతని కంటెశ్రేష్ఠమైనవారు. గర్వముతో నిండిన బుద్ధి గలవాడు, తమోగుణప్రధానుడు, లయకారకుడు అగు శివుని నీవు ఆశ్రయించితివి. కావుననే, నేను నిన్ను అవమానించినాను. నాకు శివుడు శత్రువు. ఆతడు ఇట్లు పలుకగా, దేవి కోపించి యజ్ఞసదస్సులో నున్నవారు అందరు వినుచుండగా, దక్షునితో నిట్లనెను. ఓ దక్షా! లేశమైననూ దోషము లేనివాడు, లోకములకు సాక్షాత్తుగా అధీశ్వరుడు అగు నా భర్తను నీవు హఠాత్తుగా వాక్కులతో దూషించుచుంటివి. విద్యను అపహరించినవాడు, గురువునకు ద్రోహము ను చేయువాడు, వేదములను ఈశ్వరుని దూషించువాడు అనే ఈ వ్యక్తులు అందరు మహాపాపులు అగుటచే శిక్షకు తగినవారని వేదము చెప్పుచున్నది. కావున, మిక్కిలి తీవ్రమగుఈ పాపమునకు తగిన దారుణమగు తీవ్రశిక్ష నీకు దైవవశముచే తొందరలో నిశ్చయముగా పడగలదు. దేవదేవుడగు ముక్కంటిని నీవు పూజించలేదు. కావున, నీ కులము దుష్టమై నశించినదని నిశ్చయముగా తెలియుము. సతీదేవి కోపముతో తండ్రిని ఉద్దేశించి ఇట్లు పలికి, భయమును విడనాడి, దక్షుని వలన సంప్రాప్తమైన దేహమును విడిచిపెట్టి, హిమవత్పర్వతమును చేరుకొనెను. శోభాయుక్తుడు, పుణ్యఫలముయొక్క వికాసమును పొందినవాడు అగు ఆ పర్వతరాజు చిరకాలము ఆమె కొరకు మాత్రమే అతికఠినమగు తపస్సును చేసియుండెను.
కావుననే, ఆ ఈశ్వరి ఆ పర్వతరాజును అనుగ్రహించి తన ఇచ్ఛచే యోగమాయాప్రభావముచే తనకు తండ్రిగా చేసుకొనెను. ఏ సమయములో సతి దక్షుని నిందించి భయముచే వ్యాకులపడి నిష్క్రమించినదో, అదే సమయములో మంత్రములు అంతర్ధానమై, ఆ తరువాత యజ్ఞము వినష్టమాయెను (53). దేవి నిష్క్రమించుటను గురించి విని త్రిపురాసురులను సంహరించిన శివుడు దక్షునిపై మరియు ఋషులపై కోపించి వారిని శపించెను. ఓ దక్షా! పాపమునెరుంగని సతిని నా కారణముగా అవమానించితివి. నీ ఇతరకుమార్తెలను వారి భర్తలతో సహా అందరినీ పూజించితివి. కావున, వైవస్వతమన్వంతరములో నీ ఈ అల్లుళ్లు అందరు ఏకకాలములో స్త్రీ పురుషసంగమముతో సంబంధము లేకుండగా బ్రహ్మయొక్క యజ్ఞముల యందు జన్మించగలరు. నీవు చాక్షుషమనువుయొక్క వంశములో ప్రాచీనబర్హిషునకు మనుమడవై, ప్రచేతసులకు పుత్రుడవై, మనుష్యుడవై పుట్టి రాజువు కాగలవు. ఓ దుర్బుద్ధీ! నేను నీకు ఆ జన్మలో కూడ ధర్మార్ధకామములనే పురుషార్థములతో కూడిన కర్మలయందు పదే పదే విఘ్నములను కలిగించెదను. సాటిలేని తేజస్సు గల రుద్రునిచే ఈ విధముగా శాపముచే శిక్షింపబడిన దక్షుడు దుఃఖితుడై , స్వయంభువుడగు బ్రహ్మనుండి లభించిన దేహమును విడిచిపెట్టి నేలపై పడెను. తరువాత దక్షుడు చాక్షుషమన్వంతరములో ప్రాచీనబర్హిషునకు మనుమడై, ప్రచేతసులకు పుత్రుడై పుట్టెను. వైవస్వతమన్వంతరములో భృగువు మొదలగు వారు కూడ బ్రహ్మ యొక్క యజ్ఞమునందు వరుణునకు సంబంధించిన దేహములను దాల్చి జన్మించిరి. అపుడు వైవస్వతమన్వంతరము కొనసాగుచుండగా దుష్టబుద్దియగు ఆ దక్షుడు ధర్మము కొరకై చేయుచున్న యజ్ఞములో మహేశ్వరుడు విఘ్నమును కలిగించెను.
*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో సతి దేహమును విడిచి పెట్టుటను వర్ణించే పద్దెనిమిదవ అధ్యాయము ముగిసినది.*
No comments:
Post a Comment