Thursday, October 9, 2025

 *సేతు రహస్యం - 18*
🌊

రచన : గంగ శ్రీనివాస్


“అది సరే బెహరాకి ఏమి సమాధానం చెబుతావు?" అన్నాడు శ్రీధర్.

“ప్రపంచ వింతలలో ప్రాచీన ప్రపంచానికి చెందినవి, ఆధునిక ప్రపంచానికి చెందినవి అనేకం ఉన్నాయి. ఆధునిక ప్రపంచంలో తాజ్ మహల్ అద్భుతమైన నిర్మాణమనే విషయం నిర్వివాదం. నేను ఆ విషయం పై ఎటువంటి అభ్యంతరాన్ని ఎప్పుడూ వ్యక్త పరచలేదు. అయితే తాజ్ మహల్ కి ప్రేమ చిహ్నంగా ఉన్న ప్రాచుర్యం అసలు సిసలు ప్రేమచిహ్నం అయిన రామసేతువుకే చెందాలని నేను భావిస్తున్నాను”.

"ఇప్పుడు మనతోబాటు లక్షలాది మంది అలాగే భావిస్తున్నారు. ఇది మతానికి అతీతంగా మానవత్వంలో దైవత్వం కనిపించే అపురూప దృశ్యం. తన ప్రియ సతిని దుష్ట రావణుని చెర నుంచి విడిపించడానికి సామాన్య మానవుడిగా ఉన్న రాముడు వానర యోధులతో చేయించిన అత్యద్భుత సాహసం సేతు బంధనం. ప్రేమకు పరాకాష్ట ఇంతకు మించి ఈ లోకంలో లేదు". ఆమె కళ్ళు ఒక అధ్భుత దృశ్యాన్ని చూస్తున్నట్లు సంతోషంతో నిండి ఉన్నాయి.

"ఇక బెహరా మెయిల్ విషయానికి వస్తే అతను ప్రపంచ వింతగా తాజ్ మహల్ ని పేర్కొన్నాడు. మన కంటికి కనబడని రామసేతువుని ఒక ప్రపంచవింతగా ఎలా భావించగలము అని సవాల్ చేస్తున్నాడు. అయితే ప్రాచీన ప్రపంచ వింతల లోనిదైన హేంగింగ్ గార్డెన్ నేడు కంటికి కనిపించదు కదా. అలానే రామసేతువు కూడ. ఇదే నేను బెహరాకి ఇచ్చే సమాధానం" అంది కేట్.

శ్రీధర్ రాజేష్ లు ఇద్దరూ ఉత్సాహంగా కరతాళధ్వనులు చేసారు. 'శభాష్ ' అంటూ కేట్ ని అభినందించారు. "కేట్ మన పరిశోధన వివరాలను కూడ తెలియ చేస్తూ ఉంటే బాగుంటుందేమో, రామ సేతువు నిజమా కాదా అనే విషయం తెలియజేసే పరిశోధన కాబట్టి అందరికి దీని వివరాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండొచ్చు. అదీగాక వారందరి ఆకాంక్షలు, ఆశీర్వాదాల బలం వలన మన సత్యశోధన జయప్రదమవుతుందనిపిస్తుంది" అన్నాడు శ్రీధర్.

“తప్పకుండా చేద్దాం. రాజేష్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇక రెండు మూడు రోజులలో ఆ వెబ్ పేజి కూడా అప్ లోడ్ చేస్తాడు” అంది కేట్.

తర్వాత ఏవో మాట్లాడుకుంటూ కొంచెంసేపు గడిపి ఎవరి కేబిన్లకు వారు చేరుకొని నిద్రకు ఉపక్రమించారు.
📖


*శివుని మూడో నేత్రం*

మరుసటిరోజు ఉదయం వాళ్ళు నిద్ర లేచే సమయానికి ఆర్ వి సదరన్ సర్వేయర్ వారు పరిశోధన చేయదలచుకున్న స్థలానికి చేరుకొని అక్కడ లంగరు వేసింది. శాటిలైట్ చిత్రాలలో గోధుమ రంగు మచ్చ కనబడిన ప్రాంతం అదే. అక్కడ సముద్ర జలం నీలం రంగుతో స్వచ్ఛంగా కనిపిస్తూ మెరిసిపోతుంది. సేతువు ఉన్న చోటుకి మోటర్ బోట్లో వెళ్ళాలి. అక్కడ సముద్రం లోతు తక్కువగా ఉండటం వలన వాళ్ళ రిసెర్చ్ వెసల్ కాస్త దూరంగా లోతుగా ఉన్న ప్రాంతంలో లంగరు వేసి ఉంచారు.

మారుతి గ్రూపు సభ్యులు ఆ రోజు చేయ వలసిన పరిశోధనకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేట్ కూడా సాగరగర్భం లో వాళ్ళు చేయబోతున్న తవ్వకాలలో పాలు పంచుకోవాలనుకుంది. రాజేష్ బోట్ లోనే ఉండి ఆండ్రూస్ తో పాటుగా పర్యవేక్షణ చేస్తున్నాడు. శ్రీధర్, కేట్లతో పాటు శరత్ చంద్ర, మైఖేల్ కూడ సాగర గర్భంలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. శ్రీధర్, మైఖేల్లు ఇద్దరు మెరైన్ బయాలజిస్టులు. మైఖేల్ కి సాగరంలో దిగి తవ్వకాలు చేయటంలో పూర్వానుభవం ఉంది. ఆల్టై డ్ సదరన్ సర్వేయర్లోనే ఉండిపోయాడు. శాటిలైట్ లింక్ ద్వారా వేరే గ్రూప్ నుండి వస్తున్న సమాచారాన్ని పరిశీలిస్తున్నారు మిగిలిన సభ్యులు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
శాటిలైట్ చిత్రాలలో కనబడిన గోధమ రంగు మచ్చ గురించి ఆలోచిస్తున్నాడు శ్రీధర్. ఆది చూడటానికి చిన్నదిగా అగుపించినా కనీసం ఒక వెయ్యి చదరపు అడుగుల వైశాల్యమన్నా ఉండుంటుంది. ఖనిజాలకు సంబంధించిన అనేక శాటిలైట్ చిత్రాలను అధ్యయనం చేసాడు శ్రీధర్. ఎప్పుడు కూడ ఆ రంగులో గల ప్రాంతం అతనికి తారసపడలేదు. అదీగాక ఆ మచ్చ అంత స్పష్టంగా కనబడటం కూడా విచిత్రంగా ఉంది. ఎట్టి పరిస్థితులలోను ఆ చిత్రాన్ని మిస్ అయ్యే అవకాశం లేదు. అదేమైనా సముద్రంలో ప్రమాదవశాత్తు మునిగిపోయిన నౌక యొక్క అవశేషం అయి ఉంటుంది. కాని అటువంటిది అయితే ఆ ప్రాంతంలో ఇనుము ఎక్కువగా ఉండాలి. అప్పుడు శాటిలైట్ చిత్రంలో నల్లటి మచ్చ కనబడుతుంది. అది ఏమిటి అని ఎంత అలోచించినా అంతు తెలియటంలేదు. దాన్ని చూడటానికి ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు శ్రీధర్.

కేట్ కి సముద్రంలోతుల్లో పరిశోధన చేయటం అదే మొదటిసారి. అందునా శ్రీధర్ తో పాటు తాను పరిశోధనలో పాల్గొనబోతుందనే ఊహ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. హిందూ మహా సముద్రంలో మెరైన్ బయాలజికి సంబంధించిన పరిశోధనలు తక్కువ. గల్ఫ్ ఆఫ్ మన్నార్ చాలా పురాతనమైన ప్రాంతంగా పేరెన్నికబడ్డది. అందువలన అపురూపమైన జీవసంపదకు ఆ ప్రాంతం ఆలవాలమై ఉన్నది. ఇంతవరకు ఎవరికి కంటపడని మత్స్యజాతులు, ఇతర జలచరాలను తాను చూడబోతుందన్న సంతోషం కూడ తోడై ఆమెకి డైవింగ్ కోసం ఎప్పుడెప్పుడా అన్నట్లుంది.

శరత్ చంద్రకి కూడా అది తొలి అనుభవం. డా॥ సోమదేవ తయారు చేయించిన ఎమ్ ఒ యు ప్రకారం ఢిల్లీ యూనివర్శిటీ ఎంపికి చేసిన మెరైన్ బయాలజిస్టు అతను. ఉత్కళ యూనివర్శిటీ నుంచి అతన్ని ఎంపికచేసారు.

మైఖేల్, శరత్చంద్ర ఒక జట్టుగాను శ్రీధర్, కేట్లు మరొక జట్టుగాను ఏర్పడ్డారు. సముద్రం లోనికి దిగబోయే టీమ్స్ కి కావలసిన ఏర్పాట్లు అన్నీ సవ్యంగా జరిగాయి. వారు ధరించిన అండర్ వాటర్ డ్రస్ లు వారివెంట తీసుకువెళ్ళే పరికరాలు యావత్తు సిద్ధపరచబడ్డాయి. బోట్ లోని సహాయక సిబ్బంది కంట్రోల్ పానెల్స్ అన్ని సరిచూసుకున్నారు. మెరైనర్ కి కేటాయించిన సమయం సరిగ్గా పదిహేను నిముషాలు. ఆ సమయంలోపల వారు చేయవలసిన పని ముగించి నీటి ఉపరి తలంలోనికి వచ్చేయాలి. ప్రణాళిక అంతా సిద్ధంగా ఉంది. 

మైఖేల్, శరత్చంద్రలు ఇద్దరు మొదటి బ్యాచ్ లో దిగబోతున్నారు. వాళ్ళు తమ సంసిద్ధతను సైగల ద్వారా తెలియజేసాక టీమ్ ఇన్ చార్జ్ ఆండ్రూస్ బొటనవేలు పైకెత్తి ఒకే అని సైగ చేసాడు. వెంటనే మైఖేల్, శరత్చంద్ర సాగరజలాలలోనికి వింటి నుంచి వెలువడిన బాణాల్లా దిగిపోయారు. తర్వాత రెండు నిముషాలకి కేట్, శ్రీధర్ లు  హిందూ మహాసముద్రం జలాలలోనికి జంటగా ప్రవేశించారు.   

చాలాకాలం తర్వాత కలిసిన ఆప్త మిత్రుణ్ణి ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేస్తున్న ప్రియసఖుని దేహస్పర్శలా నులి వెచ్చగా ఎంతో హాయిగా ఉంది ఆ సాగర జలాల స్పర్శ. పసిఫిక్ మహా సాగరంలోని భయానక అనుభవానికి, రామసేతువు ఉనికితో పవిత్రమైన ఈ సేతు సముద్రం లోని అభయానుభవానికి చీకటికి వెలుగుకి ఉన్నంత వ్యత్యాసం ఉంది అనిపించింది శ్రీధర్ కి. తెలియకుండానే తాను అంతవరకు విన్న రామ కథలోని సేతు నిర్మాణ ఘట్టం, దానికి తెర తీసిన సుందర కాండ ఒక్కసారిగా మనసులో మెదలి, కదిలి, అతనిని కదిలించాయి. రోమరోమాన పులకరింతలు కోటి పుష్పాలై విరిసాయి. కేట్ కి కూడా ఇది అని చెప్పలేని పరవశం, నిండైన హాయి కలిగాయి. తన కుడి చేయి శ్రీధర్ ఎడమ చేతిలో ఉంచి సేతు సముద్రంలోనికి దిగుతుంటే రంగురంగుల పగడపుచిప్పలు, ప్రకాశవంతమైన రంగలతో కనులకు విందు చేస్తున్న రమణీయ మత్స్యజాతులు అనేకం కనిపించి ఆమె మనసును రంజింపచేసాయి.

సేతు సముద్రంలో తవ్వకాలు మొదలు పెట్టినప్పటి నుంచి మైఖేల్ కి ఇది మూడవ సారి అలా దిగటం. అంతకుముందు శ్రీధర్ చూసిన విడియో క్లిప్సింగ్ లో పగడపు శకలాలను తవ్వి తీసిన వ్యక్తి అతనే. ఈ రోజు పరిశోధనకు ఎంచుకున్న విషయం శాటిలైట్ చిత్రంలో కనిపించిన గోధుమ వర్ణపు మచ్చ. అది ఉండే లోతు షుమారు గా నాలుగు వందల నుండి ఐదు వందల అడుగులు ఉండవచ్చని అంచనా వేశారు. అంతలోతుకి దిగిన తర్వాత సేతు సముద్రపు అడుగు భాగానికి చేరుకున్నారు మైఖేల్, శరత్చంద్రలు. సముద్రపు అడుగు భాగము చిత్తడిగా ఉంది. అక్కడి కాలువ గుండా ఈదుతూ సేతు నిర్మాణం వైపుగా సాగారు. ఎదురుగా దుర్భేద్యమైన కూడ్యంలా నల్లటి నిర్మాణం కనిపించింది. ఎక్కువ భాగాన్ని పరిశీలించడానికి వీలుగా వాళ్ళు సేతు నిర్మాణానికి కాస్త దూరంగా సేతు సముద్రంలోనికి దిగారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సేతు సముద్రంలో షిప్పింగ్ కెనాల్ కోసం డ్రెడ్జింగ్ చేసే ప్రయత్నాలు నీటి ఉపరితలా నికి ఏభై నుంచి డెబ్భై అడుగుల లోతుని మించి పోలేదు. అంత లోతువరకు పగడపు దీవుల శంకులే పొరలు పొరలుగా నిక్షిప్తమై ఉన్నాయి. ఆ శంకు నిర్మాణంలో అధికశాతము కాల్షియం కార్బోనేటు అనే శాస్త్రీయ నామము గల సున్నపురాయి మాత్రమే. అందుకే డ్రెడ్జింగ్ ఆపరేషన్లలో ఎక్కువగా సున్నపురాయి అవశేషాలే బయటపడ్డాయి. సుదీర్ఘమైన సేతు నిర్మాణం ఉపరితలంపై పేరుకొని ఉన్న పగడపుశంకుల పొరలను డ్రెడ్జింగ్ చేయటం అంటే గుండుసూదితో హిమలయాల్ని తవ్వటం వంటిది. అట్లా తవ్వి తీసి ఇక్కడ సున్నపురాయి తప్ప మరేమి లేదు అని చెప్పటం, అంతకంటే హాస్యాస్పదమైనది. హిమాలయాల పైన పేరుకున్న మంచు పొరల కింద ధృఢమైన కొండ శిలలు ఉండవా! పగడపు జీవులు ధృడమైన ఆధారాల పైన తామర తంపర గా పెరిగి పెద్ద పెద్ద కాలనీల మాదిరిగా ఏర్పడతాయిని మెరైన్ బయాలజిస్టులకు తెలుసు. మరి వాటి కింద ఉన్న ఆ ధృడమైన ఆధారం రామసేతువు కాకూడదా? కూడదు, అనే మూఢనమ్మక మే హేతువాదం ముసుగు వేసుకుని మన ముందుకు వస్తుంది. అక్కడ ఏమున్నది శోధించి తెలుసుకొందామనే సత్యాన్వేషణే నేటి మన మారుతి గ్రూప్ సత్యాన్వేషకుల ప్రయత్నం.
📖

మైఖేల్, శరత్చంద్రులకు ఆ ధృడమైన నిర్మాణమే సుదీర్ఘంగా ఉన్నతమైన నల్లటి కుడ్యం లాగా కనిపించింది. అతని మణికట్టుకి ఉన్న కంపాస్ ఉపయోగించి ఏ దిక్కుకి వెళ్ళాలో తెలుసుకున్నాడు మైఖేల్. శరచ్చంద్రకు తాను ముందుండి దారి చూపుతూ ముందుకు సాగిపోయాడు. వారికి కొంచెం వెనుకగా కేట్ శ్రీధర్ లు కూడ వెళ్ళసాగారు.

మైఖేల్, శరత్చంద్రులు కుడ్యం లాంటి నిర్మాణానికి దగ్గరగా చేరుకున్నారు. అప్పుడు వారికి తెలిసింది అది నిట్టనిలువ గా గోడ లాగ లేదు అని. కాని ఇంచు మించు నిట్టనిలువుగానే ఉన్న కొండ లాగ ఉంది. అక్కడ ఆగి కొన్ని శాంపిల్స్ ని గ్రహించారు. అంత లోతువరకు వచ్చి విడియో రికార్డింగ్ అంతకు ముందు చేయలేదు మైఖేల్. అతని ఛాతీ దగ్గర అమర్చిన వీడియో కెమెరా తన వంతు పని తను చేస్తున్నది. అక్కడ నుంచి ఆ గోధుమ రంగు మచ్చ దిక్కుని కంపాస్ సహాయంతో గుర్తిస్తూ ముందుకుసాగారు.

శ్రీధర్, కేట్ లు తమ అంచనా ప్రకారం బండరాళ్ళ పొరలకు పైన చెట్లు ఉండే పొరలను అన్వేషించసాగారు. కాని వారికి అటువంటి పొరలు ఏవీ కానరాలేదు. అయితే అంతకుముందు విడియో క్లిప్పింగ్ లో వారు చూసిన నల్లటి మట్టిలాంటి పదార్ధం బండరాళ్ళ మధ్య విస్తారంగా ఉంది. ఆ శాంపిల్స్ సంగ్రహించి అక్కడి లోతును గుర్తుంచుకొనేలా కావలసిన ఫోటోలు తీసుకున్నారు.

తర్వాత వారు కూడా గోధుమ రంగు మచ్చ ఉనికిని అన్వేషిస్తూ ముందుకుసాగారు. శాటిలైట్ చిత్రాలలో మార్క్ చేసిన చోటికి వారు చేరుకున్నాక సేతు సముద్రం ఉపరితలంలో వేచి ఉన్న బోట్ నుంచి కూడా వారి పోజిషన్ ను సరైనదిగా నిర్ణయిస్తూ సిగ్నల్స్ రాసాగాయి. మైఖేల్ తన దగ్గర ఉన్న సోనోగ్రాఫ్ పరికరాన్ని ప్రయోగించాడు. అక్కడకు దగ్గరలోనే ఏదో ఖనిజరాశి ఉన్నట్లు అది సూచించింది. కాని అది ఉన్న చోటు ఆ బండలకు వెనక ఎక్కడో ఉంది. అది ఎక్కడ ఉంది, అది ఏ ఖనిజము అన్నది స్పష్టంగా తెలియలేదు. అక్కడ దొరికన మట్టిలాంటి పదార్ధంలో ఆ ఖనిజం యొక్క అవశేషం ఉంటుంది. దాని సహాయంతో ఆ ఖనిజం యొక్క వివరాలు తెలుస్తాయని భావించారు. అక్కడి శాంపిల్స్ గ్రహించి, సమయం మించి పోతుండటంతో అందరూ తిరిగి పైకి ఉపరితలం వైపు ప్రయాణం సాగించారు.
🌊

*సశేషం*
 ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment