Thursday, October 9, 2025

*****భగవద్గీత* ➖➖➖✍️``` (సరళమైన తెలుగులో)`

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-168.
96d3;810e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣6️⃣8️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                      *భగవద్గీత*
                    ➖➖➖✍️```
       (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*27. వ శ్లోకము:*

*”ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ ।*
*ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ॥ 27 ॥*

```
“ప్రశాంతమైన మనసు కలవాడు, మనసులో ఎటువంటి దురాలోచనలు, కల్మషములు లేని వాడు, రజోగుణముతో కలిగే వికారములు లేని వాడు, ఆత్మసాక్షాత్కారము పొందినవాడు అయినటువంటి యోగి, ఉత్తమమైన సుఖమును పొందుతున్నాడు.

ధ్యానయోగం వలన కలిగే లాభం మరొకసారి చెబుతున్నాడు పరమాత్మ. మనం లాభం లేనిది ఏపనీ చేయము. అందుకని ఈ ధ్యానయోగం చేస్తే నాకేంటి? అనే వాళ్లకు సమాధానం ఈ శ్లోకం. ఏదో ఒక పని చేస్తే కాస్త సుఖం కలుగుతుంది. అది అనుభవించగానే ఆ సుఖం దుఃఖంగా మారుతుంది. ఒక్కోసారి ఆ సుఖం మొహం మొత్తుతుంది. ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. అది ఏమిటో తెలియదు. అది దొరకదు. అన్నీ ఉన్నా ఏదో అశాంతి, ఆవేదన, ఇదీ నేటి యువతలో ఉండే డిప్రెషన్ కు కారణం. చేతినిండా డబ్బు ఉండి కూడా చుట్టూ ఎన్నో సుఖాలు ఉండి కూడా ఇంకా ఏదో కావాలి అని కనిపించని సుఖం కోసం తాపత్రయ పడుతుంటారు. మాదక ద్రవ్యాలను సేవిస్తుంటారు. తమ వద్ద ఏవేవో మహిమలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్న బాబాలను స్వామీజిలను ఆశ్రయిస్తుంటారు.

కాని, తాము ఏ సుఖం కోసం, ఏ ప్రశాంతత కోసం పాకులాడుతున్నామో, ఆ సుఖం, ఆ ప్రశాంతత, తమలోనే తమ ఆత్మలోనే ఉందని వారికి తెలియదు. దానినే అజ్ఞానము అని అంటారు. 
అంటే బయట ప్రపంచంలో దొరికే వస్తువుల నుండి, బంధుమిత్రులనుండి, ధనము,ఆస్తి, పదవుల నుండి పొందే సుఖం శాశ్వతం కాదు. ఆ సుఖం ఈ రోజు ఉండి రేపు పోతుంది. అసలైన సుఖం మనలోనే ఉంది అని తెలుసుకోలేక పోవడం మన అజ్ఞానం. ఈ అజ్ఞానంలో పడి మనం చేయవలసిన పనులు మనం చేయక పోగా, అవసరం లేని విషయాలలో తలదూర్చి కష్టాలు కొనితెచ్చుకుంటున్నాము. అందుకే ఉత్తమమైన సుఖం కలగడానికి మార్గం చెబుతున్నాడు పరమాత్మ..

1.మొదటిది... 
ప్రశాంత మనసు... అంటే మనసును ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే సాత్విక గుణం పెంపొందించుకోవాలి. అప్పుడే మనసు ఏ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన మనసును ఆత్మలో లగ్నం చేయాలి. అదే యోగము. 

2.రెండవది... 
శాంత రజసం... అంటే రజోగుణమును శాంత పరచాలి. మనలో ఉన్న రజోగుణమును బలవంతంగా శాంత పరచడం వీలుకాదు. మనలో సత్వగుణాన్ని ఎక్కువ చేసుకుంటే, రజోగుణము దానంతట అదే శాంత పడుతుంది. ఎలాగంటే పాలు, నీరు చెరిసగం ఉన్న పాత్రలో, ఇంకా ఎక్కువ పాలు పోస్తే పాల శాతం ఎక్కువయి నీటి శాతం తగ్గిపోతుంది. పాల చిక్కదనం ఎక్కువవుతుంది. అలాగే మనలో సత్వగుణం ఎక్కువగా నింపుకుంటే, రజోగుణము, తమోగుణము వాటంతట అవే తగ్గిపోతాయి. దానికి తోడు రజోగుణ ప్రధానములైన కోరికలను, కోపమును, అదుపులో పెట్టుకోవాలి. 

3.మూడవది... 
అకల్మషమ్... అంటే మనసు కల్మషం లేకుండా ఉండాలి. మనసులో ఎవరి మీద కోపము, ద్వేషము లేకుండా చూసుకోవాలి. అప్పుడే యోగి పరమ శాంతిని పొందుతాడు. అతనికి ఎక్కడా దొరకని సుఖము, శాంతి లభిస్తాయి. అటువంటి సుఖము ‘సుఖం ఉత్తమమ్’ అని అన్నారు.

ఇది ప్రతి వాళ్లకూ సాధ్యమే. ఇంత వివరంగా చెప్పినా మానవులు దాని జోలికిపోరు. ముందుగా ‘అకల్మషమ్’ అనేపదాన్ని మనం ఆచరించాలి. మనసులో ఉన్న కల్మషములను తొలగించుకోవాలి. ఈ జన్మలోవేకాదు ఇంతకు ముందు జన్మలలో ఉన్న కల్మషాలు కూడా మన మనసులో నాటుకొని పోయి, పేరుకుపోయి ఉంటాయి. వాటినన్నిటినీ తీసివేయాలి. అద్దం మకిలిగా ఉంటే అద్దంలో మన ముఖం కనపడదు. అందుకని అద్దాన్ని శుభ్రంగా తుడవాలి. అలాగే జన్మజన్మల నుండి మనలో పేరుకుపోయిన మలినములను, కల్మషములను మనము ఆర్జించిన జ్ఞానముతో, విచక్షణతో, ప్రాపంచిక విషయముల మీద వైరాగ్యముతో, సమూలంగా నాశనం చేయాలి. ఎందుకంటే, మనస్సు కల్మషంగా ఉంటే మనమెవరో మనం తెలుసుకోలేము.

పరమాత్మ తన మొట్టమొదటి మాటలోనే ప్రశాంత మనసం అంటూ సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు ఆలోచించవద్దు. అందరినీ సమంగా చూడాలి. నిశ్చలంగా ఉండాలి. ఎటువంటి మాలిన్యమును మనసుకు అంటనీయవద్దు’ అని బోధించాడు. 

ఇవన్నీ మనం తేలిగ్గా ఆచరించవచ్చు. కాకపోతే ప్రయత్నించాలి. మనం అందరం శివస్వరూపులం, శివ అంటే ఆనందం. శవ అంటే ఆ ఆనందం లేకపోవడం, మనం ఎల్లప్పుడూ శివ స్వరూపులుగా ఉండాలి. అప్పుడు ఆనందం కొరకు శాంతి కొరకు ఎక్కడా వెతక నక్కరలేదు. ఎందుకంటే అది మనలోనే ఉంది కాబట్టి.

పరమ శాంతి పొందిన తరువాత కలిగే పరిణామమే ‘బ్రహ్మభూతమ్’ అంటే తానే బ్రహ్మస్వరూపము అనే భావన పొందుతాడు. సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడు అవుతాడు.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment