Monday, October 13, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత…ధారావాహిక-174. 
156d3;1410e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣4️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
                   *భగవద్గీత*
                   ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*35. వ శ్లోకము:*

*శ్రీ భగవానువాచ ।*
*అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।*
*అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ 35 ॥*


“ఓ అర్జునా! చంచలమైన ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టము. అందులో మాత్రం సందేహము లేదు. కానీ, అభ్యాసము చేత, వైరాగ్యము చేతా, మనసును నిగ్రహించే అవకాశం ఉంది.”
```
‘అసంశయం’ అనే పదంతో ఈ శ్లోకం మొదలు పెట్టారు వ్యాసుల వారు. ఎదుటి వారు చెప్పింది సరి అయినదే అని ఒప్పుకుంటూ, అసలు విషయాన్ని వివరంగా, విపులంగా చెప్పడం గురువు యొక్క నైపుణ్యం. అందుకే, అర్జునా! నీవు చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటూ అర్జునుడు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ఆమోదించాడు. ఇప్పుడు అర్జునుడికి తన మీద తనకు విశ్వాసం పెరిగింది. అమ్మయ్య! నేను చెప్పింది సరి అయినది అని కృష్ణుడు ఒప్పుకున్నాడు అనే ధీమా ఏర్పడింది. అర్జునుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పుడు అసలు విషయం బయట పెట్టాడు కృష్ణుడు.

సందేహం లేదయ్యా అర్జునా! నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం సరిఅయినదే. నువ్వు చెప్పినట్టు చంచలమైన ఈ మనసును నిగ్రహించడం చాలా కష్టం. ఇది నీ ఒక్కడి సమస్య కాదు. ఇది లోకంలో ఉన్న అందరి మానవుల సమస్య నీవేం బాధపడక్కరలేదు అని ఒప్పుకున్నాడు. అమ్మయ్య నేను ఒక్కడినే కాదన్నమాట. అందరూ ఈ జబ్బుతో బాధపడుతున్నారన్నమాట అని అర్జునుడు శాంతపడ్డాడు.

ఎవరైనా ఒక విద్యార్థి తన సందేహమును గురించి అడిగితే తెలివైన ఉపాధ్యాయుడు అతని సందేహము సరి అయినది అని చెబితే ఆ విద్యార్థి సంతోషిస్తాడు. తరువాత ఆ సందేహము తీరే ఉపాయమును మెల్లగా బోధిస్తాడు. ఇది ఉత్తముడైన గురువు లక్షణము. అలా కాకుండా విద్యార్థిని "బుర్రలేని వెధవా! ఇంతసేపు చెప్పింది అర్థం కాలేదా! నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. నోరుమూసుకొని కూర్చో" అంటే ఆ విద్యార్థి చిన్నబుచ్చుకుంటాడు. అప్పటిదాకా నేర్చుకున్నది కూడా మర్చిపోతాడు. ఇది ఉత్తమ ఉపాధ్యాయుడి లక్షణం కాదు. అందుచేత కృష్ణుడు మొట్టమొదట నీవు చెప్పింది కరెక్టు అందులో ఎటువంటి సందేహము లేదు ఇది నీ ఒక్కడి సమస్య కాదు లోకంలో అందరి సమస్య అని చెప్పాడు. 
ఆ మాటలకు అర్జునుడు సంతోషించాడు. కృష్ణుడు వెంటనే దానికి ఓ చక్కటి ఉపాయం కూడా చెప్పాడు. అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటితో మనసును జయించవచ్చు లోబరచుకోవచ్చు స్వాధీనములో ఉంచుకోవచ్చు అని అన్నాడు.

ఈ మనసు చాలా బలమైనది ధృడమైనది దానిని కట్టడి చేయడం, అదుపు చేయడం కష్టం అని అర్జునుడి సందేహము. జంతువులలో ధృడమైనది ఏనుగు కాని దానిని మావటి వాడు  చిన్న అంకుశంతో తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. తన ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. సింహము, పెద్దపులి చాలా క్రూరజంతువులు, బలమైనవి. కాని వాటిని ఆడించేవాడు చిన్న చర్నాకోలతో వాటిని కట్టడి చేస్తాడు. అలాగే బలమైన ధృఢమైన మనసు కూడా అభ్యాసము, వైరాగ్యము అనే అంకుశములతో చర్నాకోలతో స్వాధీనం అవుతుంది అని పరమాత్మ చెప్పాడు.

ఈ విషయం తెలియక కొంత మంది, తెలిసినా అర్ధం కాక మరి కొంతమంది అర్థం అయినా ఆచరణలో పెట్టడం ఇష్టం లేక చాలా మంది అర్జునుడు దగ్గర నుండి నేటి పండితుల వరకు "మనసు మన మాట వినదు" అనే నిర్ణయానికి వచ్చారు. దానికి పరమాత్మ చెప్పిన ఉపాయము అయిన అభ్యాస వైరాగ్యములను ఎవరూ ఆచరించరు. ఈ విషయాన్నే పతంజలి తన యోగశాస్త్రంలో కూడా వివరించాడు…
"అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః" అంటే అభ్యాస వైరాగ్యములతో మనసును నిరోధించవచ్చు అని, పతంజలి యోగశాస్త్రము, భగవద్గీత ఈనాటివి కావు. వేల సంవత్సరముల కిందట రాయబడ్డాయి. కాని ఈ నాటికి కూడా మానవులు అభ్యాస వైరాగ్యములను అనుసరించి మనసును స్వాధీన పరచుకోలేకపోతున్నారు.

వైరాగ్యము అంటే వి రాగము అంటే ప్రాపంచిక విషయముల యందు రాగము అంటే కోరిక, ఆసక్తి లేకుండా ఉండటం. (ఈ రోజుల్లో కోరిక, ఆసక్తి లేకుండా ఎవరుంటారు అని మీకు సందేహం రావచ్చు కాని, ఇక్కడ కోరిక ఆసక్తి అంటే మితిమీరిన కోరిక, ఆసక్తి అని ఈ నాటికి అన్వయించుకోవచ్చు). ఈ ప్రపంచములో ఉన్న వస్తువులతో, మనుషులతో కలిగే సంగమం వలన మనకు లభించే ఆనందము శాశ్వతమైనది కాదు. అది ఈ రోజు ఉండి రేపు పోతుంది. ఆత్మానందమే శాశ్వతమైన సుఖం అని తెలుసుకోవాలి. ప్రపంచములో ఉన్న అనవసర విషయములలో తలదూర్చకుండా ఉండాలి. అనవసర విషయాల గురించి ఆలోచించడం, అనవసర వస్తువులను సేకరించడం, అనవసర విషయాల గురించి మాట్లాడటం, ఎక్కువగా బాధపడటం మానెయ్యాలి.

(దీనికి ఉదాహరణగా టివీలో వచ్చే పనికిమాలిన సీరియల్స్  గురించి చెప్పుకోవచ్చు. అందులో నటీనటులు, రచయిత రాసిన డైలాగులను, దర్శకుడు చెప్పినట్టు పలుకుతూ, డబ్బు తీసుకొని, మరీ నటిస్తారు. ఆ నటన నిజం అనుకొని, కొంతమంది పనులన్నీ మానుకొని, డబ్బు ఇచ్చి చూస్తూ తెగ బాధపడిపోతారు. తరువాతి భాగంలో ఏం జరుగుతుందో అని తెగ ఆరాటపడిపోతారు. ఇదే అనవసర విషయాల గురించి అధికంగా బాధపడటం).

అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే, మనసు బయట ప్రపంచములో విహరించకుండా నిలకడగా, నిశ్చలంగా ఉంటుంది. దీనికి అభ్యాసము కావాలి. ఏమీ చేయకుండా మనసును కట్టడి చేయాలంటే సాధ్యం కాదు. నిరంతర అభ్యాసము అంటే ప్రతిరోజా అభ్యాసము చేయాలి. ఏదో నాలుగు రోజులు చేసి నా మనసు నా స్వాధీనములో ఉందని సంతృప్తి పడకూడదు. అందుకే నిరంతరము ధ్యానము చేయాలి. ధ్యాన సమయములో మనసును అటు ఇటు పోకుండా కట్టడి చేయాలి. అభ్యాసముతో సాధ్యపడనిది ఏదీ లేదు. దీనినే పతంజలి యోగశాస్త్రములో కూడా చెప్పబడింది. "సతు దీర్ఘకాలనైరన్తర్యసత్కారసేవితో దృఢభూమి" అంటే దీర్ఘకాలము అభ్యాసము చేస్తే మనో నిగ్రహము సాధ్యమే.

అసలు మొదలు పెట్టకుండా "అబ్బే ఇది మనవలన కాదండీ శుద్ధ దండగ. ఏవేవో చెబుతుంటారు. అవన్నీ మనకు సాధ్యపడతాయా ఏమన్నానా" అని దీర్ఘం తీస్తూ కొట్టిపారేయడం విజ్ఞతకాదు. ఆరంభించరు నీచమానవులు అనే వాక్యము ఇక్కడ వర్తిస్తుంది. ముందు ఆరంభించి కొంత కాలము చేసి అప్పటి కీ సాధ్యపడకపోతే అప్పుడు ఆలోచించాలి కానీ, అసలు మొదలు పెట్టకుండా ఇది మనవల్ల కాదు అనడం అవివేకము. మామూలుగానే చిన్న పరీక్ష పాసు కావాలన్నా కష్టపడి చదవాలి. సంగీతం నృత్యం నటన రావాలంటే అభ్యాసము చేయాలి. కేవలం లౌకిక విషయాలు నేర్చుకోవాలంటేనే అభ్యాసము అవసరమైనపుడు, బలమైన చంచలమైన మనసును నిగ్రహించడానికి ఎంతటి అభ్యాసం అవసరమో ఆలోచించండి. కాబట్టి బాహ్య ప్రపంచములోని విషయముల మీద అనవసరమైన ఆసక్తిని వదిలిపెట్టి, నిరంతర అభ్యాసము చేస్తే మనసు స్వాధీనం అవుతుంది అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేసాడు.

ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా ఉంది. మీరు గమనించారో లేదో, మన మనసు మనకు బాగా ఇష్టం అయిన దానిమీద ఎక్కువసేపు లగ్నం అయి ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంది. చింతిస్తుంది. అదే కావాలంటుంది. మనం ఎటువంటి ప్రయత్నం చేయకుండానే, మన మనసు మనకు ఇష్టం అయిన దాని మీదకు మాటిమాటికీ పోతుంటుంది.

ఉదాహరణకు మనకు ఇష్టం అయిన సినిమా గానీ, సీరియల్ గానీ, క్రికెట్ మాచ్ గానీ, టివిలో వస్తూ ఉంది అని అనుకుందాము. మన మనసు దాని మీద పూర్తిగా లగ్నం అవుతుంది. ఆకలి, దప్పిక, ఆఫీసు, కాలేజీ, ఇల్లు, అన్ని మరిచిపోతాము. ఇది మనసుకు సహజ లక్షణం. అదే విధంగా మన మనసును ఆత్మ దర్శనం మీద లగ్నం చేస్తే ఎలా ఉంటుంది. దానికి మనం చేయాల్సిన పని, ప్రాపంచిక విషయాల మీద కాకుండా, ఆత్మ మీద పరమాత్మ మీద ఆసక్తిని, అనురక్తిని, ఇష్టాన్ని పెంచుకోవాలి. అప్పుడు మన మనసు కూడా ఆత్మయందు నిలకడగా ఉంటుంది. దానినే వైరాగ్యము అంటారు. అంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని తగ్గించుకొని ఆత్మ తత్వము మీద ఆసక్తిని పెంచుకోవడం. దానికి నిరంతర అభ్యాసం కావాలి. (వైరాగ్యము అంటే సన్యాసులలో కలవడం కాదు అని తెలుసుకోవాలి).

ఇక్కడ అర్జునుడిని కృష్ణుడు చేసిన సంబోధన చక్కగా ఉంది. మహాబాహో అన్నాడు. మనసు బలమైనది, ధృడమైనది, దానిని కట్టడి చేయడం నా వల్ల కాదు అని చేతులెత్తేసాడు అర్జునుడు. దానికి సమాధానంగా, “ఇంతటి వీరుడివి, బాహుబలం కలవాడిని అత్యుత్తమ ధనుర్ధారివి, ఇంత చిన్న విషయం నీకో లెక్కలోనిది కాదు అభ్యాసంతో ప్రయత్నించు” అని ధైర్యం చెప్పాడు కృష్ణుడు.✍️```
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏

No comments:

Post a Comment