Thursday, October 9, 2025

 6️⃣2️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

  *మూడవ అధ్యాయము* 

    *కర్మయోగము.*  
 
ఈ శ్లోకంలో దేవాన్ అని వాడారు. దేవాన్ అంటే దేవతలు. అంటే ప్రకృతి శక్తులు. దివ్ అనే ధాతువు నుండి దేవత, దైవము అనే మాటలు వచ్చాయి. దివ్ అంటే ప్రకాశము, ప్రకాశించేది. మన జీవితాలను ఐదుగురు దేవతలు ప్రకాశింపచేస్తున్నాయి. వారే భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము. వీటిని మనం దైవీభావనతో దేవతలుగా పూజిస్తాము. భూదేవి, వాయు దేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఆకాశమే విష్ణుస్వరూపము అంటే ఆకాశము అనంతము, సర్వవ్యాపి. భూమి నుండి మనకు లభించని పదార్థము లేదు. మనం తినే ఆహారము, కట్టుకునే బట్టలు, ధరించే ఆభరణాలు అన్నీ భూమాత ఇచ్చినవే. ఇంతెందుకు మనం నిలబడాలంటే భూదేవి ఆధారము. అలాగే వాయువు. కాసేపు గాలి ఆడకపోతే చచ్చిఊరుకుంటాము. కాస్త ఎక్కువగా గాలి కొడితే చెట్లు,స్తంభాలు పడి జనజీవనం అస్తవ్యస్తము అవుతుంది. అగ్ని మన శరీరంలో ఉండే వేడి, జఠరాగ్ని. టెంపరేచరు హెచ్చినా తగ్గినా మరణం తథ్యం. అలాగే ఆహారం తయారు చేసుకోడానికి, వెలుగుకొరకు, ఇంకా ఇతర అవసరాలకు అగ్ని అవసరము. వరుణుడు. వానలు సకాలంలో కురవకపోయినా, అకాలంలో కురిసినా, ఎక్కువ కురిస్తే పంటలు నాశనం, తక్కువ కురిస్తే వంటలు ఎండి పోతాయి. అలాగే ఆకాశము. అంటే స్పేస్. మన ఊపిరితిత్తులలో ఖాళీలేకపోతే ఊపిరి లోపలకు పోదు. పొట్టలో ఖాళీలేకపోతే అన్నం లోపలకు పోదు. ఆకాశం లేకపోతే మనిషిలో కదలికే లేదు. కాబట్టి ఈ శక్తులన్నీ తమ తమ శక్తులతో, ప్రకాశంతో మన జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. అందుకే మనం ప్రకృతిని దేవతా రూపంలో ఆరాధించమని మనకు శాస్త్రములు ఉపదేశించాయి.

దేవా భావయంతువః అంటే ఆ ప్రకృతి దేవతలు మీకు నిరంతరం మేలు చేస్తాయి. అంటే ఈ ప్రకృతి శక్తులన్నీ మనలను మన జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నాయి. దానికి మనం ఏం చేయాలి. మనం కూడా వాటి మీద కృతజ్ఞతాభావంతో వాటిని ఆరాధించాలి. కాని మనం మాత్రం ప్రకృతి శక్తులను ఆరాధించకపోగా, శాయశక్తులా ప్రకృతి శక్తులకు హాని చేస్తున్నాము. జలాన్ని నాయువును కలుషితం చేస్తున్నాము. చెట్లను నరుకుతున్నాము. భూమికి చిల్లులు పొడుస్తున్నాము ఆకాశం అంతా పొగతో, ధూళితో, కలుషిత పదార్ధములతో నింపుతున్నాము. దీని ఫలితంగా వర్షాలు సకాలంలో కురవడం లేదు. భూగర్భజలాలు ఎండిపోతున్నాయి. ఉన్నా కలుషితం అవుతున్నాయి.

కాబట్టి మనం ప్రకృతిని ప్రకృతి దేవతలను ఆరాధించడం నేర్చుకోవాలి. ఎలా అంటే ప్రకృతి శక్తులు ఏ భావనతో మనకు అన్నీ సమకూరుస్తున్నాయో, అదే భావన మనమూ కలిగి ఉండాలి. అంటే ప్రకృతి శక్తులు మనల నుండి ఎటువంటి ప్రత్యుపకారము ఆశించకుండా మనకు ఉపకారము చేస్తున్నాయి. మనకు కావలసినవి అన్నీ సమకూరుస్తున్నాయి. మనం కూడా అదే భావనతో ఉండాలి. మనం చేసే కర్మలు అన్నింటినీ సమాజ హితం కొరకు, పరోపకారం కొరకు ప్రత్యుపకారము ఆశించకుండా, ఒక యజ్ఞంలాగా చేయాలి. అదే మనం ప్రకృతి శక్తులను ఆరాధించే విధానము.

ఆ ప్రకృతి శక్తులు ఏ భావనతో ఉన్నాయో అదే భావనతో మనం కూడా ఉంటే మనం ప్రకృతిని, ప్రకృతి దేవతలను పూజించినట్టే. ప్రకృతి శక్తుల భావన ఏమిటి అని ప్రశ్చించుకుంటే అవి మానవాళికి ప్రతిఫలం కోరకుండా నిరంతరం ఉపకారం చేస్తున్నాయి. వాయుదేవుడు మనకు ప్రాణవాయువు ఇస్తున్నాడు. వరుణ దేవుడు వర్షాలు కురిపించి పంటలు పండిస్తున్నాడు. దాహం తీరుస్తున్నాడు. అగ్నిదేవుడు సముద్రము నీటిని ఆవిరిగా మార్చి మనకు వర్షాలు కురిపిస్తున్నాడు. మనం తినడానికి ఆహారం పచనం చేస్తున్నాడు. మనం బతకడానికి శరీరంలో కావాల్సిన ఉష్ణోగ్రత సమకూరుస్తున్నాడు. భూదేవి మనకు ఖనిజముల రూపంలోసంపదలను ఇస్తూ ఉంది. పంటలు పండిస్తూ ఉంది. మనం నిలవడానికి స్థలంఇస్తూ ఉంది. ఆకాశం ఇటు మనకు అటు మేఘాలకు ఆవాసం కల్పిస్తూ ఉంది. మన శరీరంలో కూడా ఊపిరితిత్తులలో, పొట్టలో ఖాళీ రూపంలో మనం జీవించడానికి దోహదం చేస్తూ ఉంది. కాని ఈ శక్తులు మన నుండి ఏమీ కోరడం లేదు. కేవలం పరోపకార బుద్ధితో చేస్తున్నాయి. మనం కూడా అదే భావనతో అంటే పరోపకార బుద్ధితో సమాజానికి హితం కోరే పనులు నిస్వార్ధంగా చేస్తే, ప్రకృతి దేవతలను ఆరాధించినట్టే. కాబట్టి మనం అందరం పరోపకార బుద్ధిని అలవరచుకోవాలి. మంచి పనులను యజ్ఞం లాగా చేయాలి. ప్రకృతికి హాని చేయకుండా ఉండాలి. అప్పుడు ప్రకృతి దేవతలు మన కోరికలన్నీ కామధేనువు మాదిరి తీరుస్తాయి.

ఇటీవల మేము ప్రకృతిని జయించాము అనే మాట వినిపిస్తూ ఉంది. అది చాలా తప్పు. చిన్న తుఫాను వస్తే, శేషాచలం కొండల్లో నిప్పు అంటుకుంటే, గట్టిగా గాలి వీస్తే, చిన్నపాటి భూకంపం వస్తే, ఓజోన్ పొరకు చిన్న చిల్లుపడితే, మనం తట్టుకోలేము. అల్లల్లాడిపోతున్నాము. మానవ జీవితం ఛిన్నాభిన్నం అవుతుంది. అటువంటి మనం ప్రకృతిని జయించాము అని అనుకోవడం సిగ్గుచేటు. ప్రకృతి దేవతలను ఆరాధించడం పోయి ప్రకృతిని జయించాము అని గొప్పలు చెప్పుకోవడం అవివేకము.

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P160

No comments:

Post a Comment