Monday, October 13, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-172.
136d3;1210e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣7️⃣2️⃣```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
               *భగవద్గీత*
              ➖➖➖✍️```
     (సరళమైన తెలుగులో)```


*6. ఆత్మ సంయమ యోగము.*
(ఆరవ అధ్యాయము)
_________________________
*32. వ శ్లోకము:*

*”ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।*
*సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః” ॥ 32 ॥*

“ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణుల సుఖములను, దుఃఖములను తనకు కలిగినట్టే భావిస్తూ, వాటిని సమానంగా ఎవరైతే చూస్తాడో, వాడే యోగులలో శ్రేష్టుడు అని చెప్పబడతాడు.
```
ఇప్పటి దాకా జ్ఞానం గురించి చెప్పాడు పరమాత్మ. ఈ శ్లోకంలో విజ్ఞానము అంటే తాను తెలుసుకున్న జ్ఞానమును ఎలా ఆచరణలో పెట్టాలి అన్న విషయం చెబుతున్నాడు. ఒక విధంగా దీనిని ఆచరణ వేదాంతము అంటే ప్రాక్టికల్ వేదాంతం అని అనవచ్చు. పైకి మాత్రము అందరిలో పరమాత్మ ఉన్నాడు అంటూ ఇంట్లో ఉన్న తల్లి తండ్రులను, భార్యను, పనివాళ్లను, మానసికంగా శారీరకంగా బాధించేవాడు హింసించేవాడు శుష్క వేదాంతి. విన్న దానిని, తెలుసుకున్న దానిని, ఆచరణలో పెట్టిన నాడే ఆ జ్ఞానము విజ్ఞానము అవుతుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఆత్మస్వరూపుడు గా ఉన్నాడు అని తెలుసుకున్న వాడు ఇతరుల పట్ల దయ, జాలి, కరుణ, ప్రేమ, కలిగి ఉండాలి కానీ ద్వేషము, కోపము, క్రూరత్వము కలిగి ఉండకూడదు. అపకారికి కూడా ఉపకారము చేసే నేర్పుకలిగి ఉండాలి. దీనినే ఆత్మాపమ్మేన అంటే ఇతరులు తనను హింసిస్తే తనకు ఎంత బాధ కలుగుతుందో ఆ బాధే తన వల్ల ఇతరులకు కలుగుతుంది అని తెలుసుకోవడం. ఈ స్థితికి అందరూ చేరుకోవాలి. అటువంటివాడు యోగులలో పరమయోగి అని పిలువబడతాడు.

ప్రస్తుత ప్రపంచంలో ప్రతి వాడూ ఎదుటి వాడిని మోసగించేవాడే. ఎదుటి వాడి సొమ్ము లాక్కోవడానికి ప్రయత్నించేవాడే ఇతరుల ఆస్తులను కొల్లకొట్టే వాడే. కానీ వాడే తీర్థయాత్రలు చేస్తాడు. గుడులకు వెళతాడు. మెడ నిండా రుద్రాక్ష మాలలు ధరిస్తారు. నేను దైవభక్తుడిని అని చాటుకుంటాడు. దేవుడికి బంగారు కిరీటాలు చేయిస్తాడు. స్వార్ధం కరుడుగట్టిన అటువంటి వాడు పైకి భక్తుడుగా కేవలం నటిస్తుంటాడు. ప్రజల ధనాన్ని నిరంతరం అపహరిస్తూ దేవుడికి వజ్రాల కిరీటాలు, బంగారు తొడుగులు చేయించేవారు ఈ కోవలోకి వస్తారు. వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. అటువంటి వారిని దైవద్రోహె అంటారు కానీ దైవభక్తుడు అనరు.

ఎవడినైనా మంచి వాడు అని అంటే అది వాడి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రాణులను సమంగా చూడడం ఆచరణలో పెట్టిన వాడు, అందరిలోనూ ఆత్మ స్వరూపుడైన పరమాత్మను చూడగలిగిన వాడు, పరమయోగి. వాడే నిజమైన భక్తుడు. అంతే కానీ మాటలలో వేదాంతము, చేతలలో దుర్మార్గము, ఉంటే వాడు వేదాంతి కాడు.

పాశ్చాత్యదేశాలలో, ఆసియా దేశాలలో ఉన్న మతములు సర్వమానవ సౌభ్రాత్తత్వమును చాటుతున్నాయి. అందరూ వాటిని ప్రవచిస్తుంటారు. చేతలలో మాత్రం శూన్యం. ఒక పక్క శాంతి మంత్రాలు వల్లిస్తూ, మరొక పక్క ఆయుధాలు ఉత్పత్తి చేస్తారు. ఆ ఆయుధాలు అమ్ముకోడానికి యుద్ధాలు సృష్టిస్తారు. యుద్ధాలు యధావిధిగా జరుపుతారు. ఆయాదేశాలు ప్రవచించే సర్వమానవ సౌభ్రాత్తత్వము చేతలలో కూడా ఉంటే, ఇంత సైనిక శక్తి అవసరం లేదు. సరిహద్దుల కాపలా కాయడానికి, సైనిక శక్తిని పెంచుకోవడానికి, ఒక దేశాన్ని మించి మరొక దేశం, వేల కోట్ల ధనం ఖర్చుపెట్ట నవసరం లేదు. ఆ ధనం పేదరిక నిర్మూలనకు ఉపయోగించ వచ్చు.

కాబట్టి వేదాంతము మాటలలోనే కాకుండా చేతలలో కూడా చూపించాలి. అదే విజ్ఞానము. అటువంటి యోగి సయోగీ పరమో మతః అంటే యోగులలో శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే ఇంత విన్నా అర్జునుడికి నేను వేరు, నా తాతలు తండ్రులు గురువు వేరు అనే భేదబుద్ధి ఇంకా పోలేదు. నేను వాళ్లను చంపాల్సివస్తుంది అని యుద్ధం మానుకుంటున్నాడు. అలాగే మనందరికి కూడా తన యొక్క నిశ్చితమైన అభిప్రాయమును, ఇది నా మతము అంటే ఇది నాఅభిప్రాయము అని పరమాత్మ స్పష్టంగా చెబుతున్నాడు.

కాబట్టి పరమాత్మయొక్క మతము ఏదంటే సకల ప్రాణులను సమంగా చూడటం, అందరి కష్టసుఖములను తనవిగా భావించడం; ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు, శరీరానికి దుఃఖం, కష్టం, బాధ కలుగుతాయో, ఆ పనులను ఇతరుల పట్ల చేయకుండా ఉండటం, మనం కూడా ఆ మతాన్ని అవలంబించాలి. అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడే మనకు శాంతి, ఇతరులకు శాంతి, ప్రపంచానికి శాంతి కలుగుతుంది.✍️
(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

No comments:

Post a Comment