Thursday, October 9, 2025

 *ప్రాచీన గాథాలహరి - 25*
🪷
రచన: పిలకా గణపతిశాస్త్రి


*చూడామణి -1*
💍

అర్ధరాత్రివేళ హాయిగా గుండెలమీద చేతులు వేసుకుని అమాయికంగా నిద్రపోతున్న తన కుమారుల నందరినీ అశ్వత్థామ ఘోరంగా సంహరించివేశాడన్న వార్త చెవిని పడగానే ద్రౌపది వలవలా వాపోయింది. ఏ పాపమూ ఎరగని ఆ పసివాళ్లలాంటి అపమృత్యువు వాత పడిన దుర్వార్త తలుచుకుని ఆమె మాటి మాటికి కుమిలి కుమిలి ఏడ్చింది.

భీమసేను డనేక సాంత్వనవచనాలతో ఆమె నోదార్చాడు. అయినా ఆ వీరమాత హృదయశోకం అలాగే కట్టలు తెంచుకుని ప్రవహించింది. 'భీమసేను డంతటివానికి కూడా తన కుమారుల ఘోర దుర్మరణం నివారించే అవకాశమైనా కలగలేదే' అని ఆమె తన దురదృష్టాని కెంతో విచారించి, బాష్పపూరిత రూక్షదృష్టితో భీమసేనుని వైపు చూచింది.

ఆ మహాపాపాత్ముడు అశ్వత్థామను సంహరించి అతని శిరోభూషణమైన చూడామణి తనకు కానుకగా తీసుకొని రావలసిందనీ, అది కళ్లారా చూచేవరకు తన ప్రాణాలిక నిలవవని ఆక్రోశించింది.

ధర్మరాజుకు కూడా అశ్వత్థామను కఠినంగా దండించవలెననే సంకల్పం కలిగిందని భీమసేను డంతకు పూర్వమే గ్రహించుకొన్నాడు. అందుచేత ద్రౌపది ఆ విధంగా ఆక్రోశించిన ఉత్తర క్షణంలోనే అశ్వత్థామ మీదికి బయలుదేరాడు. అన్నగారి సంకల్పం గ్రహించిన నకులుడు వెంటనే ఒక రథం ఆయత్తంచేసి తీసుకు వచ్చి అతని ఎదుట నిలబెట్టాడు. స్వయంగా రథసారథ్యం నిర్వహించాడు. అయితే వారిద్దరికీ కూడా అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడో తెలియదు. కురుక్షేత్ర ప్రాంతాలలో సంచరించేవారిని కొందరిని "అశ్వత్థామ జాడ ఎరుగుదురా?" అని ప్రశ్నించారు.

వారిలో కొందరతడు కృప, కృతవర్మలతో కలిసి భాగీరథీతీరం వరకు ప్రయాణం చేశాడనీ, పిమ్మట కృప, కృతవర్మ లిద్దరూ విడిపోయి వేరొక్కచోటికి వెళ్ళిపోయారనీ, అశ్వత్థామ ఒక్కడూ కృష్ణద్వైపాయన
ముని ఆశ్రమ సమీపానికి వెళ్ళిపోయాడనీ, అతడా ప్రాంతంలోనే నివసిస్తున్నాడనీ అన్నారు. భీమసేను డామాట వింటూనే అటువైపు రథం నడిపించవలసిందని నకులుని ఆజ్ఞాపించాడు.

భీముడావిధంగా కళ్ళుమూసుకొని అశ్వత్థామ మీదకి బయలుదేరాడన్న వార్త వాసుదేవుని చెవినిపడింది. అతడెంతో ఆత్రంగా ధర్మరాజుతో ఆ విషయం ప్రస్తావించాడు.

"భీమసేనుడొక్కడూ అశ్వత్థామతో యుద్ధం చెయ్యడానికి బయలుదేరినట్లు న్నాడు. దీనివల్ల ఏదైనా పెద్ద ప్రమాదమే సంభవించవచ్చును. కనుక వెంటనే మనం అందరం బయలుదేరి వెళ్ళి అతనికి తోడుపడడం అత్యావశ్యకం!" అన్నాడు.

తరవాత శ్రీకృష్ణుడొక్క క్షణం సేపాగి ఆ ప్రమాద విషయం అతనికి విస్పష్టంగా వివరించాడు.

"ధర్మరాజా! అశ్వత్థామ తనవద్ద బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉన్నదనే అహంకారం కొద్దీ కన్నూమిన్నూ కానకుండా మిడిసి పడుతున్నాడు. అది ప్రపంచం అంతా దహించజాలిన దివ్యాస్త్రం. ఆచార్యుడు శిష్యవాత్సల్యంకొద్దీ అర్జునునికి కూడా ఆ అస్త్రం ప్రసాదించాడు. అయితే అశ్వత్థామ అర్జునుని మీది మాత్సర్యంకొద్దీ ఆ అస్త్రం ఎప్పుడైనా ప్రయోగింపవచ్చుననే భయంతో మానవుల మీద ఆ అస్త్రం ప్రయోగింపకూడదని కట్టడి చేశాడు. కాని అశ్వత్థామ తండ్రి ఆ విధంగా కట్టడి చేయడానికి గల కారణం వేరువిధంగా గ్రహించుకొన్నాడు. అదీగాక తను చిరంజీవిననే అహంకారం కూడా దానికి తోడైంది. అశ్వత్థా మబ్రహ్మశిరోనామ కాస్త్రం వల్ల భీమసేనుని కేవిధమైన ఆపత్తూ రాకుండా మనం అతని నిప్పుడు సంరక్షించుకోవాలి." అని చెప్పి కృష్ణుడు సాత్యకి సహదేవు లిద్దరిని పాండవశిబిర సంరక్షణకోసం అక్కడనే నిలిపి రథం అధిరోహించి ధర్మరాజుతోను, అర్జునుని తోను కలిసి భీమసేనుడు వెళ్ళిన దారినే రథం నడిపించాడు. 

క్షణంలో ఆ రథం భాగీరథీ తీరానికి వెళ్ళిపోయింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మరికొంతసేపటికి వారందరికీ వాయువేగం తో మున్ముందుకు సాగిపోతున్న భీమసేనుని రథం కనిపించింది.

శ్రీకృష్ణుడు తన రథం మరింతవేగంగా మున్ముందుకు నడిపించుకుపోయాడు. కాని అంతలోనే భీముడు రథం దిగి ఆ ప్రాంతంలో మునివేషం ధరించి ముక్కు మూసుకుని కూర్చున్న అశ్వత్థామ దగ్గిరికి వెళ్ళిపోయాడు.

ఆలోగా ధర్మరాజు, వాసుదేవుడు, అర్జునుడు అతన్ని ఎలుగెత్తి గట్టిగా పిలిచారు. తొందరపడవద్దని హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కాని భీమసేనుడు వారి హెచ్చరికలు పెడచెవిని పెట్టాడు.
📖

తన కెదురుగా ఆశ్రమంలో మునివేషంతో ఉన్న అశ్వత్థామను చూడగానే భీముని హృదయం క్రోధావేశంతో ఘూర్ణిల్లింది:

"బ్రాహ్మణాధమా! ఎంతటి పాపకార్యాని కొడిగట్టి చిట్టచివరి కెలాంటి కపటనాటకం అభినయిస్తున్నావు! చూస్తూండగానే నీవొక మహాఋషీశ్వరుడవైపోయావే! ఇలాంటి మాయానాటకం అభినయిస్తే చావు తప్పిపోతుందని భ్రమిస్తున్నావేమో! చాలు చాలులే! ఈ నాటకం ఈ పాటికి కట్టిపెట్టు! యుద్ధానికి సిద్ధంగా నిలబడు!"
అన్నాడు క్రోధంతో.

అశ్వత్థామ అలాగే నిశ్చల దృష్టితో భీముని ఉద్దతధోరణి అంతా జాగ్రత్తగా గమనించాడు. అనతిదూరంలో అతని కెదురుగా ధర్మజవాసుదేవార్జునులు ముగ్గురూ ప్రత్యక్షమైనారు. వారందరూ
రథం దిగి తొందర తొందరగా అశ్వత్థామ వైపే నడిచివస్తున్నారు.

అశ్వత్థామకు వారంతా దివ్యాస్త్ర రహస్య వేత్తలన్న విషయం తటాలున స్ఫురణకు వచ్చింది. అర్జునుని వద్ద కూడా బ్రహ్మశిరో నామకాస్త్రం ఉన్న సంగతి అతన్ని మరింత వేధించింది. ఇక ఆ మహాపత్సమయంలో ఒక బ్రహ్మశిరోనామకాస్త్రం తప్ప మరి వేరే దిక్కేమీ లేదని అతడొక్క త్రుటిలో గ్రహించాడు. వెంటనే ప్రక్కనే ఉన్న ఒక గడ్డిపోచ తుంచి దానిపై బ్రహ్మశిరోనామ కాస్త్రం అభిమంత్రించాడు. క్రోధావేశంతో అతని ముఖం మెలికలు తిరిగి చింతనిప్పులు చెరిగింది.

"అపాండవ మగుగాక!" అని ఆ అస్త్రం భీమసేనుని మీదికి ప్రయోగించాడు.

ఆ గడ్డిపోచలోనించి భయంకరాగ్ని జ్వాలలు పైపైకి లేచాయి. ఆ అగ్నిజ్వాల లొక్కక్షణంలో ఆకాశం అంతా దహించి వేసేటట్లు ఉవ్వెత్తుగా విజృంభించాయి. ఇంకొక్క క్షణంలో భీమసేనుడా జ్వాలలో శలభమై భస్మీపటలమై పోవలసిందే!

కాని క్షణంలో వాసుదేవు డర్జునుణ్ణి హెచ్చరించాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"అర్జునా! అర్జునా! ఇది బ్రహ్మశిరోనామ కాస్త్రం. దీనిమీద ఏ అస్త్రం ప్రయోగించినా అది ఎందుకూ కొరగాదు! కనక నీవుకూడా నీ దగ్గర ఉన్న బ్రహ్మశిరోనామకాస్త్రం దీనిమీద ప్రయోగించు! అది ఒక్కటే దీనిని అడ్డగించగల మహాస్త్రం! నీ సోదరులను, నిన్ను సంరక్షించుకోవాలంటే ఇంతకన్న గత్యంతరం లేదు! త్వరపడు! త్వరపడు!"

క్షణంలో అర్జునుడు వింటి బాణం సంధించాడు. మనస్సులో ద్రోణాచార్యునికి నమస్కారం చేసి, బ్రహ్మశిరోనామకాస్త్రం అభిమంత్రించాడు. తన అస్త్రం వల్ల అశ్వత్థామ కేవిధమైన అపకారమూ కలగకూడదని సంకల్పించాడు. తనకు, తన సోదరులకు శుభపరంపరలు కలగ వలెనని ప్రార్ధించి అశ్వత్థామ అస్త్రానికి ప్రతిగా తన అస్త్రం విడిచిపెట్టాడు.

తన అస్త్రం వల్ల అశ్వత్థామ అస్త్రం ఉపశమించవలెనని, అనంతరం తన అస్త్రం కూడా ఉపశమించవలెనని అతని అభిలాష.

కాని ఆ అస్త్రం వల్ల అశ్వత్థామ అస్త్రం ఉపశమించలేదు. ఆ రెండు అస్త్రాలూ ఆకాశంలో కల్పాంతజ్వాలలవలె బీభత్సంగా ప్రజ్వలించాయి. ఆకాశం అంతటా అత్యంత భయంకరంగా పిడుగులు పడుతున్న సవ్వడి వినబడింది. దూరదూరంగా హస్తినాపురంలో ఉన్న జనం అందరూ ఆనాటితో మరి మహా ప్రళయమే ప్రారంభమైందని భయపడ్డారు!

అంతలో నారదుడు, వ్యాసమహర్షి వారి కట్టెదుట సాక్షాత్కరించారు. అంతలోనే వారిద్దరు తొందర తొందరగా నడిచి వచ్చి అశ్వత్థామార్జునుల మధ్య నిలబడ్డారు.

“అస్త్రరహస్యవేత్తలైన మహావీరులు ఎంద రెందరో ఈ ప్రపంచంలో ఉద్భవించారు. వారెన్నడైనా ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం ఇలాగ మానవుల మీద ప్రయోగించారా? ఇది న్యాయమేనా?" అని ఎలుగెత్తి హెచ్చరించారు.

అర్జునుడు వారిద్దరికీ సవినయంగా నమస్కరించాడు.

"ఈ అస్త్రాలు రెండూ ఉపశమించవలెననే సంకల్పంతోనే నేనీ అస్త్రం ప్రయోగించాను. అంతేగాని నాకు మరి ఒక దుష్ట సంకల్ప మేమీ లేదు" అని వెంటనే తన అస్త్రం ఉపసంహరించివేశాడు.

ఆ విధంగా ఆ అస్త్రం ఉపసంహరించి వెయ్యడం సామాన్యులకి అసాధ్యం! మహా ధర్మాత్ముడైన అర్జునునికొక్కడికే అది సాధ్యపడింది. అన్యులెవరైనా తొందరపడి బ్రహ్మశిరోనామకాస్త్రం ఉపసంహరిస్తే అది వెనువెంటనే వారినే అణిచివేస్తుంది. అర్జునుని శక్తి సామర్ధ్యా లవలోకించిన మహా మునులిద్దరూ అతని ననేక విధాల అభినందించారు.

అశ్వత్థామ తాను ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహరించవలెనని ప్రయత్నించాడు. ఎంతగా ప్రయత్నించినా అతని కది సాధ్యపడలేదు. దానితో అతని ముఖం వెలవెలబోయింది. వెనువెంటనే వ్యాసమహర్షి వైపు చూచి సవినయంగా విన్నవించుకొన్నాడు.
💍

*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment