Saturday, August 20, 2022

నేటి జీవిత సత్యం. *నెగ్గాలంటే తగ్గాలి*

 నేటి జీవిత సత్యం. *నెగ్గాలంటే తగ్గాలి*

మనిషి తాను అనుకున్న పనిలో ఏదోవిధంగా విజయం సాధించాలనుకుంటాడు. కండబలంతోనో, పదవి ద్వారానో, పాండిత్యం ప్రదర్శించో, వాక్చాతుర్యంతోనో తన కార్యక్రమంలో సంపూర్ణ విజయం సాధించేదాకా నిద్రపోడు. తలపెట్టిన పని ధర్మ బద్ధమైనదా. ఇతరులకు హాని కలిగించేదా, నడుస్తున్న మార్గం సరైనదేనా- ఇవేవీ ఆలోచించే స్థితిలో సాధారణంగా ఉండడు. పని పూర్తి కావాలంటే దగ్గరి దారేదో చూసుకుంటాడు. చాలామందిలో ఈ లక్షణం చూస్తుంటాం.

చతుర్విద ఫల పురుషార్ధాల గురించి మన సనాతన ధర్మం వివరించింది. ధర్మంగా అర్ధం (ధనం) సంపాదించి, ధర్మంగానే కోరికలను తీర్చుకుంటూ మోక్ష ప్రాప్తి పొందమని చెప్పింది. విజయం సాధించడానికి పట్టుదల అవసరమే కాని అది మొండిపట్టుదల కాకూడదు. సాహసం అవసరమేకాని దుస్సాహసం కారాదు. ఆలోచన అవసరమే, దురాలోచనగా మారకూడదు. అవసరమైన చోట అణకువ, వినయం, విధేయత, మౌనం కూడా ఆయుధాలుగా మారాల్సి వస్తుంది. మూర్ఖుల సభలో ఒకేఒక పండితుడున్నప్పుడు, అతడు మౌనంగా ఉండటమే సమంజసం.. ఒకవేళ ఏదైనా మాట్లాడినా, మూర్ఖులు లెక్కచేయకపోగా అవ మానిస్తారు, అవహేళన చేస్తారు. వర్షరుతువులో చెరువుల దగ్గర కప్పల బెకబెకలే బాగా వినిపి స్తాయి. అటువంటి సమయంలో కోకిల తన పంచమస్వరం వినిపిం చక మౌనంగానే ఉంటుంది. ధ్వని కాలుష్యంలో తన స్వరం విని పించకపోవడమే మంచిదనుకుని మిన్నకుంటుంది. అంతమాత్రంచేత అది ఓడినట్లు కాదుగదా! 'అనువు గాని చోట అధికులమనరాదు' అన్న వేమన పలుకులు అక్షరసత్యాలు. అండపిండ బ్రహ్మాండాలను
తనలో నిక్షిప్తం చేసుకున్న విశ్వప రుషుడు శ్రీమన్నారాయణమూర్తి బలి గర్వం నాశనం చేయడానికి మరుగుజ్జు రూపం (వామనావతారం) లో వెళ్ళాడు. అంతమాత్రాన తగ్గినట్లా కాదే! భక్తుడికి ఐశ్వర్యం ప్రసాదించే ఈశ్వరుడు కపాలంతో భిక్షాందేహి అన్నాడు.. ఒంటినిండా భస్మం పూసుకొన్నాడు. ఇంద్రుడు కర్ణుడి దగ్గరికి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వెళ్ళి కవచ కుండలాలను దానంగా అడిగి తీసుకున్నాడు. కార్యసాఫల్యం కోసమే కదా! సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమను మార్గమధ్యంలో సురస అనే రాక్షసి అడ్డుకుంటుంది. కబళించేందుకు నోరు తెరుస్తుంది. సూక్ష్మ రూపుడై ఆమె నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. అంతటి బలశాలి అక్కడ అంగుష్టమాత్రుడు కావాల్సివచ్చింది. అదంతా కార్యసాఫల్యం కోసమేకదా!.

ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, నిరహంకారం విధేయత సమయస్పూర్తితోనే పనులు చక్కబెట్టుకోవాలని విదురనీతి చెబుతోంది. అన్నీ ఉన్న విస్తరి అణిగే ఉంటుంది అన్ని నిండుకుండ తొణకదు అని- ఇలాంటి సామెతలన్నీ మనం విన్నవే.. 'తెలివి లేనప్పుడు అన్నీ తెలుసు అని విర్రవీగాను, గురువుల నుంచి కొంత
జ్ఞానం పొందాక, ఏమీ తెలియని ఆజ్ఞానిని అన్న సత్యం గ్రహించాను' అన్న సందేశాత్మక నీతిబోధ భర్తృహరి శతకం అందిస్తోంది.. మధుర రసాలతో నిండి ఉన్న మామిడిచెట్టు ఆ పండ్ల బరువుకు బంగే ఉంటుంది. ఎవరి కోసం! మనకోసం. అవి అందుకుని ఆ చెట్టును పొగడ కుండా ఉండగలమా! నెగ్గాలంటే తగ్గాలి. తగ్గితేనే పగ్గాలు చేతికొస్తాయి.

సేకరణ. మానస సరోవరం 👏 

No comments:

Post a Comment