Saturday, August 20, 2022

చక్కని కథ. విధి చేసేది ఎప్పుడూ మన మంచికే.

 చక్కని కథ. విధి చేసేది ఎప్పుడూ మన మంచికే. 

ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది.  

 తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు.   

 అప్పుడా వ్యక్తి "నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది అని" బాధపడ్డాడు. ఆ తర్వాత "తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని" మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు. 

 ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది. కానీ దేవుడిపట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు. 

 గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగు పడి గుడిసె కాలిపోసాగింది. 

 ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ "దేవుడా! ఎంతవరకు నీకిది న్యాయం, ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వెందుకు నాపై దయ ఎందుకు చూపడంలేదు స్వామీ" అంటూ నిరాశనిస్పృహలలో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు. 

 అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది. 

 పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జనద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మీరు మీ గుడిసెను కాల్చిఉండకపోతే, ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు. 

 అప్పుడు ఆ వ్యక్తి కళ్లలో నీళ్ళు తెచ్చుకుని ఆ భగవంతుని క్షమాపణలు కోరుతూ "ఓ ప్రభూ! నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. కానీ, నేనే అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నిన్ను నమ్మినవారిని తప్పకుండా కాపాడతావని నువ్వు నిరూపించుకున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభూ" అని మనసులోనే నమస్కరించుకున్నాడు. 
 
 ఈ కథలోని నీతి 

 “సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది. కానీ, మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఆయన ఎల్లప్పుడు మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మనం, నిరాశతో దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాము. విశ్వాసాన్ని కోల్పోతాము. దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశముంటుంది. కానీ, ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ దేవుడు/విధి చేసింది మంచిదేనని. లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదని. 

 కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, దుఃఖం ఎంత కృంగదీసినా, కరోనాలు కాటు వేయాలని చూసినా, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా, భగవంతుడిపై భారముంచి, పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం

సేకరణ. మానస సరోవరం 👏 

No comments:

Post a Comment