*వేదాంత వాక్యాలు అంటే ఉపనిషత్తులలో చెప్పబడ్డ వాక్యాలు - ఏమి చెబుతాయి?*
*మానవుడికి కావలసిన పరమజ్ఞానాన్ని అందిస్తాయి - ఏమిటా జ్ఞానం?*
జీవుడు ప్రపంచాన్ని గురించి అనేక భ్రమలలో ఉంటాడు.
(i) ఈ ప్రపంచం సత్యమనుకుంటాడు.
(ii) ఇందులోని వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ నిత్యమైనవి అనుకుంటాడు.
(iii) ఇవన్నీ తనకు ఎంతో ఆనందాన్నిస్తాయి అనుకుంటాడు.
(iv) అందుకే వీటికోసం అర్రులు చాస్తూ ప్రపంచంలోనికి పరుగులు తీసి, ఎన్నో కష్టనష్టాల కోర్చి వాటిని సంపాదించుకుంటాడు, అనుభవిస్తాడు.
(v) వాటివల్ల ఆనందం పొందినట్లే పొంది చివరకు దుఃఖాన్ని పొందుతాడు.
ఇక తన గురించి కూడా భ్రమలలో ఉంటాడు.
(i) తాను దేహమే అనుకుంటాడు. లేదా దేహాన్ని ధరించిన జీవుణ్ణి అనుకుంటాడు.
(ii) తాను సుఖాలు, భోగాలు అనుభవించటానికే పుట్టాననుకుంటాడు.
(iii) తాను శాశ్వతంగా ఉంటాననుకుంటాడు. రోజూ ఎందరో చనిపోతున్నా తానుమాత్రం ఉంటాననుకుంటాడు.
(iv) ఇలా భ్రమలలో ఉండటంవల్ల తానెవరో తెలుసుకోలేక పోతూ భ్రమలోనే జీవిస్తుంటాడు.
ఇలా భ్రమలలో జీవించే మానవుల యొక్క భ్రమలను పోగొట్టి, ఈ ప్రపంచంగాని, ఈ దేహాదులుగాని, ఈ సుఖభోగాలు గాని శాశ్వతం కాదని, అనిత్యమైనవని తెలియజేసి, వాటివల్ల కలిగే ఆనందం కూడా నిజమైన ఆనందంకాదని తెలియజేసి, తానుగాని, ఇతరులుగాని, ఈ ప్రపంచం గాని అన్నీ కలలోని వస్తువుల లాంటివే అని తెలియజేసి సర్వము బ్రహ్మమయం, ఉన్నదొక్కటే పరమాత్మ ఆ పరమాత్మ నీవే, అందరూ, అన్ని భూతాలు పరమాత్మ స్వరూపాలే, కనుక నీ దృష్టిని మార్చుకొని సర్వం బ్రహ్మమయంగా అనుభూతి చెందితే ఇక నీకు అఖండమైన, అనంతమైన, ఆత్మానందం బ్రహ్మానందం ఉంటుందని, అసలు నీ స్వరూపం ఆనందమేనని తెలియజేసి ఆ స్థితిలో - ఆత్మస్థితిలో - స్వస్థితిలో నిన్ను నిలిపేందుకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తాయి.
ఈ విధంగా ఈ ఉపనిషత్ వాక్యాల ఆంతర్యాన్ని - లక్ష్యార్థాన్ని - లోతులను తెలుసుకోవాలంటే సద్గురు ఉపదేశం కావాలని, కనుక ఒక సద్గురువును ఆశ్రయించి ఈ వేదాంత శాస్త్రవాక్యాలను తెలుసుకొని తరించటమే మానవజీవితం పరమలక్ష్యం అని గ్రహించాలి.
No comments:
Post a Comment