Sunday, December 11, 2022

భగవంతుడు అంటే ఎవరు

 భగవంతుడు అంటే ఎవరు

భగవంతుని నిర్వచనం శ్రీపరాశర మహర్షి
(వ్యాస భగవానుని తండ్రి ) మైత్రేయ మహర్షికి
 “శ్రీ విష్ణుపురాణం” బోధిస్తుండగా కింది విధంగా వివరిస్తాడు

భగోఽస్యాస్తితి భగవానితి విష్ణుస్సమీర్యతే భగము అని చెప్పబడు ఆరు లక్షణముల సముదాయము గలదు గనుక శ్రీ విష్ణువు భగవాన్‍.

:: విష్ణు పురాణే షష్ఠాంశే పఞ్చమోఽధ్యాయః ::
ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసశ్శ్రియః ।
జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా ॥ 74 ॥

సమగ్రైశ్వర్యము, వీర్యము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యములైన ఆరింటికిని భగమని వ్యవహారము. (ఇట్టి భగముగలవాడు విష్ణువు).

విష్ణు పురాణే షష్ఠాంశే పఞ్చమోఽధ్యాయః 

ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానామాగతిం గతిమ్ ।
వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి ॥ 78 ॥

భూతముల ఉత్పత్తి, ప్రళయములను గమనాఽఽగమనములను, విద్యాఽవిద్యలను ఎవడు ఎరుగునో ఆతడు ‘భగవాన్‍’ అని చెప్పబడదగియున్నాడు.

ఓం భగఘ్నే నమః | ॐ भगघ्ने नमः | OM Bhagaghne namaḥ

తదైశ్వర్యాదిషాడ్గుణ్యభగవాన్ పరమేశ్వరః ।
సంహారసమయే హన్తీత్యచ్యుతో భగహోచ్యతే ॥

భగవాన్ నామమునందు వివరించబడిన ఆరు లక్షణములను ప్రళయ సమయమున నశింపజేయును గనుక, ఆ అచ్యుతునకు భగహా అను నామము.

పై నామాలు విష్ణు సహస్ర నామంలో కూడా వస్తాయి

ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవుతున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు.

మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే…

పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం.

ఉదాహరణకు…
– మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.
– మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.
– మన కళ్ళు…అతి విసృతమై న పదార్ధాన్నిగానీ.. అతి సూక్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు. ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శిని ని ఆశ్రయించవలసి వస్తుంది. మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారు కదా అని మీరు అడగవచ్చు.

కళ్ళు భౌతికమైన పదార్ధాల ను మాత్రమే చూడగలవు. మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తుంది. ‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు.

తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది. మరి మనో నేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.

పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు.

ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

– ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.
– వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.
– అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.
– జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.
– భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచ భౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.
– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడం వల్ల, అగ్నిని కళ్ళతో చూడగల మే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు, అలా చూడాలంటే మన మనో నేత్రాన్ని తెరవాలి.

దాన్ని తెరవాలంటే, పాంచ భౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.

ఓం నమో నారాయణాయ

No comments:

Post a Comment