అరుణాచల శివ 🙏
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
గిరి ప్రదక్షిణ - ఆత్మ ప్రదక్షిణ
భగవాన్! మీరు అరుణాచలాన్ని శివుడంటారే! ఆయన కొండ కావటంలో ఆంతర్యం?" అని ఒకరు ప్రశ్నించినపుడు “మనమందరం మానవదేహం ధరించినట్లు శివుడు కొండగా ఉండాలనుకున్నాడు. అదంతే!" అని రమణులు జవాబిచ్చారు.
తిరువరూరులో జన్మెత్తినా, చిదంబరంలో నటరాజుని దర్శించినా, కాశీలో మరణించినా ముక్తితథ్యం. అయితే అరుణాచలాన్ని స్మరిస్తే చాలు, పరముక్తి లభించటం
నిశ్చయం.
అందుకే రమణులు, అరుణాచలాన్ని గిరిరూపమైన కరుణాసముద్రంగా కీర్తించారు,
తిరువణామలై పుణ్యక్షేత్రంలో, మౌనం మూడు ముఖాలుగా అభివ్యక్తమవుతుంది.....
అరుణాచలేశ్వర కోవెలలో స్వామి అర్చామూర్తి.
శిలాకృతి, సాలంకృత సదానంద స్ఫూర్తి. ఆ బొమ్మా పలుకదు.
పర్వత సానువుల్లో నివసించిన భగవాన్ రమణులు
మౌన స్వామి. పలుకు, బంగారమైన ప్రదేశమిది. రమణులు, వారికంటే ముందే గుడి, దాని కంటే ముందు అరుణగిరి... ఇది పరంపర.
అరుణగిరి ప్రదక్షిణ ప్రాముఖ్యాన్ని భగవాన్ రమణులు స్వయంగా ప్రపంచానికి తెలియచేస్తూ, గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా సాధకులను ప్రోత్సహించారు.
ఎందుకంటే, దక్షిణాపథంలో ఉన్న పంచలింగ క్షేత్రాల్లో ఇది తేజోలింగం. అగ్ని క్షేత్రం. గౌతమ, అగస్త్యాది మహర్షులు దర్శించిన శోణాచలమిది. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కనుక ఇది సుదర్శన గిరి. శంకర భగవత్పాదులు దీనిని 'మేరువు' అన్నారు. అనేక పురాణాల్లో అరుణాచల ప్రస్తావన స్పష్టంగా ఉంది.
జ్ఞానసంబంధులవారు, తిరునావుక్కరసు, మాణిక్యవాచకులు,
జ్ఞానదేవుల తండ్రి, సిద్ధజిపంతు, నామదేవ్, సమర్థ రామదాసు, విరూపాక్ష దేవులు, అరుణగిరి నాథులు, కొండప్ప దేశికులు, షణ్ముఖ యోగిని, అమ్మణ్ణి అమ్మాళ్ వంటి మహనీయులు దర్శించి ఆత్మానుభూతి పొందిన పూర్ణాద్వెతపీఠం అరుణాచలం.
ఇది అచలపీఠం. బ్రహ్మానంద నిలయం. కొండపై ఉన్న గుహలన్నీ తపోవనాలు.స్వాత్మానంద బృందావనం. సదాశివ సమాశ్రితాలు. ఆదికాలం నుంచి తపస్వులకు తపోభూమిగా నిలిచిన అరుణాచలం, జ్యోతిర్లింగ స్వరూపం. అందువలననే గిరి ప్రదక్షిణ చేయటం ప్రధానమైన ఒక ఆధ్యాత్మిక సాధనంగా రూపుదిద్దుకున్నది.
పార్వతీదేవి పరమేశ్వరుడి వామాంగిని అయినది ఇక్కడే. కనుక ఇది, శివ - శక్తి గిరి. కొండనంతను నిండిన అనేక దివ్య ఔషధ వృక్షాలు, సాధకుడికి శారీరక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయి. అష్ట దిక్పాలకులు పూజించే లింగాలన్నీ శక్తిమయాలు.
అరుణాచల ప్రదక్షిణం నిజానికి శివశివానీలకు చేసే సాక్షాత్ ప్రదక్షిణే!
ప్ర- అంటే పాపసంహారం
ద-కామ్యసిద్ధి
క్షి - జన్మరాహిత్యం
ణ - జ్ఞానమార్గంలో ముక్తి
పురాసంస్కృతికి అరుణాచలం ఒక గొప్ప స్మృతి.
అరుణాచలం, జీవుడికి దేవుడికి ఉన్న దివ్య ప్రబంధం, కనబడే పూలు, కనబడని దారం, కలిసి ఉన్నట్లు!
శివకుటంబమంతా, కొలుదీరిన కైలాసమే అరుణాచలం!
వెన్నెలలో అరుణాచల దర్శనం ఒక అపురూప ఆధ్యాత్మిక అనుభవం. మనసు నిశ్చలం చేసుకుని నెమ్మదిగా నడుస్తూ, గిరి చూస్తూ, వెన్నెలలో ప్రదక్షిణ చేస్తున్నపుడు పరమశివ భంగిమలు, ఆకృతులు,
ఆవిష్కృతమవుతూ లోచూపును విశాలం చేస్తూ, అంతరంగస్పర్శను అనుగ్రహిస్తాయి. క్రమ
వైరాగ్యాన్ని, క్రమ సన్యాసాన్ని అనుగ్రహించి, మనసును పరమేశ్వరాయత్తం చేయగల శక్తి, గిరి ప్రదక్షిణలో ఉన్నది.
బిరబిరా నడిచేది, గిర గిరా తిరిగేది ప్రదక్షిణ కాదు. శ్రీరమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలి తీర్థం, అగస్త్య తీర్థం, ద్రౌపది గుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం, నైరృతి లింగం,హనుమాన్ గుడి, ఉన్నాయి. అమ్మగుడి, ఉన్నామళై తీర్థం, రామలింగేశ్వరాలయం,
ప్రతిధ్వని మంటపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణ లింగం, ఆది అణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, ఇంద్ర లింగం, గురుమూర్తం, మామిడి తోట, అగ్ని లింగం, శేషాద్రి స్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి దేవాలయంతో ముగిస్తే అది ప్రదక్షిణం.
గిరి ప్రదక్షిణలో సాధకుడు, గిరి పైన ఉన్న స్కందాశ్రమం, విరూపాక్ష గుహ, పాద తీర్థం, గురు నవశ్శివాయసమాధి,
రామదాసు గుహ, జడస్వామి ఆశ్రమం... వీటన్నిటినీ ప్రదక్షిణం చేసుకున్న ఆనందమూ లభిస్తుంది.
శేషాదిస్వామిరమణుల సమకాలీనులు. వారు ఉన్మత్తులు. మహామహిమోపేతులు, సిద్ధపురుషులు. గిరి ప్రదక్షిణ నిజానికి ఆత్మ ప్రదక్షిణే! ప్రపంచానికి హృదయ స్థానం అరుణాచలం. అది ఆత్మారామం . గిరి ప్రదక్షిణ, ఈశ్వర-గురు ప్రదక్షిణ.
అయిదు ముఖాలుగా గోచరించే సదాశివ స్వరూపం, సాధకుణ్ణి అంతర్ముఖుణ్ణి చేసి, జ్యోతిర్మయమైనలో వెలుగును ఆత్మగా దర్శనీయం చేసి ఆత్మనిలో నిలకడ చెందించే పరమాద్భుత సాధన, గిరి ప్రదక్షిణ!
గిరి, గురువు, గురి ఏకమై నిలిచిన అరుణాచల దర్శనం అత్మదర్శనం కంటె భిన్నం కాదు.
అరుణాచల స్మరణమే ముక్తి! ప్రదక్షిణ అనుగ్రహించే శాంతి, శక్తి, వైరాగ్యం,
జ్ఞానం, పరమానందం, అనిర్వచనీయం. అది అనుభవైకవేద్యం. హృదయంగమం. జీవాత్మ, పరమాత్మల నిత్య సంగమం!
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
No comments:
Post a Comment