మానవజన్మ ప్రాముఖ్యత
ఈ లోకంలో మనం కొన్ని వస్తువులను చాల విలువైనవిగా మనం చూస్తుంటాం. కొన్నిమాత్రం విలువ లేనివిగా ఉంటాయి. విలువైన వస్తువులను సంపాదించటానికి మనం చాల కష్టపడుతుంటాం. వాటిని చాల జాగ్రత్తగా, శ్రద్ధతో ఉపయోగిస్తాం.
వజ్రం చాల ఖరీదైనది. దానిని సంపాదించటం అందరివలన కాదు. ఎందుకంటే చాల ధనం వెచ్చించి వజ్రాన్ని కొనాలి. అంత డబ్బు పెట్టి కొన్నాం కాబట్టి వజ్రాన్ని చాల జాగ్రత్తగా ఉపయోగించాలి. ఉదాహరణకు ఒక హారం ఉంటే దానికున్న పతకానికి వజ్రాన్ని పొదుగుతాం. వజ్రం పొదిగిన బంగారు హారాన్ని ధరించి చాల సంతోషపడతాం. అప్పుడే ఖరీదైన వజ్రాన్ని మనం కలిగి ఉన్న సంతృప్తి ధరించిన సంతృప్తి మనకు కలుగుతుంది. అలా కాకుండ ఖరీదైన వజ్రాన్ని కొని ఆ తరువాత దానిపై ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఒక మూల పారేస్తే ఆ మనిషి గురించి ఏమనుకుంటాం? అటువంటి వ్యక్తిని ఒక మూర్టుడు అని భావిస్తాం. విలువైన వస్తువును కలిగి ఉన్నా, దాని విలువను గ్రహించలేని వ్యక్తి అతడు. దానిని సక్రమంగా ఉపయోగించడం తెలియనివాడు. నిజంగానే వాడొక మూర్ఖుడంటాం.
అలానే లోకంలో వ్యావహారికమైన సంగతి ఏమిటంటే విలువైన వస్తువు మనకు దొరికినప్పుడు దానిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సక్రమంగా ఉపయోగించుకోవాలి. మానవజన్మ కూడ అసామాన్యమైనది. మనకు లభించిన అత్యంత విలువైన వరం ఈ మానవ జన్మ. ఈ విశ్వంలో ఎన్నో లక్షల ప్రాణులున్నాయి. మనిషి ఆ లక్షల ప్రాణులలో ఒకడు. ఈ మనుష్య జన్మ బదులు మరో ప్రాణిగా మనం జన్మించి ఉన్నట్లయితే మనం ఏమి చేస్తుండేవారం? మనం ఏమి చేయగలం? ఆహారం కోసం వెదుకుతూ, ఆహారాన్ని సంపాదిస్తూ, నిద్రపోతూ, ప్రమాదాన్ని పసిగడ్తే దానినుంచి పారిపోతూ, ఎవరైనా ఆహారం పెడ్తారనుకుంటే వారివద్దకు పరుగెడ్తూ గడిపేవారం. అంతకుమించి మరేమీ చేసేవాళ్ళం కాదు. అటువంటి జన్మను పొందకుండ మానవజన్మను పొందగలిగాం.
అందువలన మొదట మానవజన్మ విశిష్టతను, విలువను మనం గ్రహించాలి. వజ్రం అన్ని రాళ్లకంటె ఎలా విలువైనదో అలాగే మానవజన్మ అన్ని జన్మలకంటె విలువైనది. మానవజన్మ సులభంగా మనకు లభించలేదు. మానవ జన్మ లభించడానికి మనం ఎంతో పుణ్యం చేశాం. వజ్రం కోసం ఎంతో ధనాన్ని వెచ్చించినట్లే మానవ జన్మకోసం మనం చాల పుణ్యం చేశాం. అలా మానవ జన్మ కూడ వజ్రంలాగే ఎంతో విలువైనది. వజ్రాన్ని మూలపడేసే వ్యక్తిని మూర్ఖుడిగా భావించినట్లే మానవజన్మను సక్రమంగా ఉపయోగించకపోతే మనం కూడ మూర్ఖులమే అవుతాం. అందువలన మానవజన్మకు సదుపయోగం అవసరం.
हर नमः पार्वती पतये हरहर महादेव
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.
No comments:
Post a Comment