పుస్తకాల ప్రచురణ వ్యాపారమా !!!
✍️ Rajeswarao Mulugu
పుస్తకం... అది జాతి పతాకం
పుస్తకాలు చాల రకాలు. ప్రస్తుత మార్కెట్ భాషలో చెప్పాలంటే... అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడుపోయేవి- ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తివిద్యా కోర్సులకు సంబంధించినవి(వాటి ప్రిపరేషన్ మెటీరియల్ ఉండే సబ్జెక్ట్ లతో కలిపి), తరువాత...పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే ఆయా సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జ్ బుక్స్, ఆ తరవాత.. వరుసగా భక్తి పుస్తకాలు, పిల్లల పుస్తకాలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలు వగైరా...
అయితే మనం మాట్లాడుకుంటున్న పుస్తకాలు ఇవి కాదు. కథలు, నవలలు, జీవిత చరిత్రలు, అనుభవాలు- జ్ఞాపకాలు, కవితలు, యాత్రా గాథలు, పరిశోధనలు, వ్యాసాల సంపుటాలు మన చర్చనీయాంశంలోవి.. వీటిని ఇంగ్లీషులో ట్రేడ్ బుక్స్ అంటున్నారు. ...ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించినవి, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, వేదాంత విషయాలపై లోతుగా జరిపే చర్చల తాలూకువి కూడా వీటిలో కలుపవచ్చు. కేవలం ఒక వర్గం పాఠకులకుగాకుండా, విస్తృతంగా అందరినీ అలరించే, పనికొచ్చే పుస్తకాలివి.
ఇతర దేశాల సంగతి తెలియదు కానీ, మన దేశంలో దురదృష్టవశాత్తూ ...ప్రచురణ రంగాన్ని ఒక వ్యాపార రంగంగానే అందరూ పరిగణిస్తున్నారు. ఆర్థికపరమైన అంశాలు ఉన్నా... నిజానికి ఇది వ్యాపార రంగం కాదు. విద్య, సాంస్కృతిక, సామాజిక, మనస్తత్వ అంశాలకు సంబంధించినది. ఇది అక్షరాస్యతా ప్రయోజనాలను సాధిస్తూనే, విద్యాపరమైన, జీవనపరమైన వికాసాన్ని, లౌకిక చైతన్యాన్ని జీవితాంతం రగిలిస్తూ ఒక జాతి ఆలోచనా సరళిని ఉద్దీపింప చేస్తుంటాయి.
పుస్తకం అంటే ???
మరోరకంగా చెప్పాలంటే... ఒక పుస్తకం - ప్రచురణకర్తలకు విలువతో కూడిన ఒక ఆస్తి, ఒక వస్తువు, లేదా ఒక వృత్తిపరమైన అంశం. అదే పుస్తకం... సదరు రచయితకు/రచయిత్రికి తన ఆలోచనల ప్రసరణ సాధనం.. అలాగే వారికి ఒక ఆదాయ వనరు. ఈ పుస్తకమే ... పాఠకుడికి ... జ్ఞానాన్ని, సమాచారాన్ని, వినోదాన్ని, వికాసాన్ని, ప్రేరణను ఇచ్చే గురువు, మార్గదర్శి.
ఈ కోణం నుంచి చూసినప్పుడు ప్రచురణ రంగం అనేది ఒక దేశ మేధోపరమైన, సాంస్కృతికపరమైన వ్యవస్థ. ఎన్ని పేర్లతో(టైటిల్స్ తో) పుస్తకాలు ప్రచురిత మయ్యాయనడం కంటే, ప్రతి పుస్తకం ఎన్ని కాపీలు అమ్ముడుపోయింది ? ఎంత వైవిధ్యంతో కూడిన పుస్తకాలు వచ్చాయి ? వంటి అంశాలతో పాటూ..ఎంత సమర్ధంగా పాఠకుడికి చేరుతున్నాయనే విషయాలను తెలిపే పుస్తక పరిశ్రమ బలం మీద... ఆ దేశ అభివృద్ధి, ఆ సమాజ చైతన్యం, వికాసం ఆధారపడి ఉంటుంది. ఈరకంగా గత వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు ప్రస్తుతం పుస్తకం ఎదుర్కొంటున్న పరిస్థితిని (రచన, ప్రచురణ, పంపిణీ, పుస్తక పఠనం) గతంతో పోల్చి చూస్తే ... అంత ప్రోత్సాహకరంగా అయితే లేదు. అయితే అది నిరుత్సాహం కలిగించే స్థాయిలో మాత్రం లేదు. మారిన కాలం, సాంకేతికతలతో మారినది వేదికలే తప్ప పుస్తక ఆదరణ మాత్రం కాదు.
ప్రచురణ రంగం నిత్యనూతనంగా వర్ధిల్లాలంటే ఏం కావాలి ? అధునాతన ముద్రణ, ప్రచురణ సంస్థలు, కాగితం తయారీ పరిశ్రమలు, సామర్ధ్యం ఉన్న రచయితలు, సంపాదకులు, విస్తృత పంపిణీ వ్యవస్థ... అంతే... ఇవన్నీ మనకు పుష్కలంగా ఉన్నాయి కదా !
ప్రపంచంలో ఇంగ్లీష్ పుస్తకాల ప్రచురణలో మన దేశానికి మూడో అగ్ర స్థానం. తృతీయ ప్రపంచపు దేశాల్లో అయితే మనమే నంబర్ ఒన్.కానీ ప్రాంతీయ భాషా ప్రచురణలస్థితి మాత్రం కొంత నిరుత్సాహం కలిగిస్తున్నది. మన దేశ జనాభాలో ఇంగ్లీష్ భాష తెలిసిన వారు 2.19% కాగా మనదేశంలో ఇంగ్లీష్ పుస్తకాల ప్రచురణ 40%.
ప్రపంచంలో పుస్తక ప్రచురణ రంగంలో అమెరికా, బ్రిటన్‌ల తరువాత భారతదేశం మూడో అగ్రస్థానంలో ఉన్నా..... ఇంగ్లీష్ పుస్తకాల సంఖ్యలో మనం 7వ స్థానంలో ఉన్నాం. మొత్తం మీద చూస్తే.. సగటున పుస్తకానికి వెయ్యి కాపీల ప్రింట్ ఆర్డర్ తో మూడో స్థానంలో ఉన్నాం. 150 కోట్ల జనాభాలో చాలా మందికి ఇంగ్లీషు అన్య భాష. ఎక్కువగా సంస్థాగత విక్రయాలపై ఆధారపడడం,ముద్రణ, కాగితం వంటి వాటి ధరలు పెరగడం, పన్ను వంటివి మనకున్న సమస్యలు. ఆదాయపుపన్ను, పోస్టల్ చార్జీలలో రాయితీ ఇచ్చినా ప్రగతి నామమాత్రం.
పుస్తక ప్రచురణను యునెస్కో కూడా ప్రోత్సహిస్తుంది. అయినా పుస్తకాల ముద్రణ 30 దేశాలకే ఎక్కువగా పరిమితం అయిపోయింది. ఇది ప్రపంచస్థాయిలో 30% . కానీ మొత్తం పుస్తక ప్రచురణగా తీసుకుంటే 80%గా ఉంది. వీటిలో ఐరోపా 54.3%, అమెరికా 19.7% తో నాలుగింట మూడో స్థానాన్ని ఆక్రమించాయి. (ఇవి 1983నాటి లెక్కలు) 73.7 % జనాభా ఉన్న ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో పుస్తక ప్రచురణ 27% మాత్రమే. మన దేశంవంటి దేశాల్లో స్థానిక భాషలు ఎక్కువగా ఉండడం, తలసరి ఆదాయం తక్కువగా ఉండడం, జీవన ప్రమాణాలు తక్కువగా ఉండడం ప్రధాన కారణం.
మన దేశంలో 9వేలమంది ప్రచురణకర్తలున్నారు. 21 వేల పుస్తకాల దుకాణాలున్నాయి. ఇవన్నీ కూడా ... పిల్లల చదువులు గట్టెక్కడానికి,ఉద్యోగాలు పొందడానికి, వంటావార్పూ నేర్చుకోవడానికి... ఇలాంటి వాటితో ఎక్కువగా నిండి ఉంటున్నాయి తప్ప ... అది ఏ భాష అయినా దాని సాహిత్య వైభవం, చరిత్ర, సంస్కృతి, వారసత్వం తెలుసు కోవడానికి గానీ, కొత్తవి సృజించడానికి గానీ ఉపకరించే విధంగా ఉండడం లేదు.
ప్రాంతీయ భాషల దుస్థితి ......... ప్రచురణ కర్తలు రిటైల్ దుకాణాల వారికి 25-40 % కమిషన్ పై, క్రెడిట్ పై ఇవ్వాలి. అమ్ముడు పోయిన తరువాత సదరు దుకాణాలవారి నుండి సొమ్ము ఒక పట్టాన తిరిగిరాదు. ...దీనితోపాటూ మరో ఉదాహరణగా... అవి ముద్రింపబడే కాపీల సంఖ్యను పేర్కొనవచ్చు. ఏదయినా ఇంగ్లీష్ పుస్తకం కనీసంగా 3 వేలు ముద్రిస్తే, ప్రాంతీయ భాషలో ఒక పుస్తకం సగటున వెయ్యి కాపీలకు మించదు. తక్కువ కాపీలతో ఎక్కువయ్యే ముద్రణ ఖర్చుకూడా దీని ఎదుగుదలకు ఒక అడ్డంకి. దానివల్ల అంతంత ధరలు పెట్టలేని సగటు జిజ్ఞాసువులు తక్కువ ధరలో దొరికే పత్రికలు చదివి వారి జ్ఞానదాహాన్ని తీర్చుకుంటుంటారు.
ఏది ప్రాంతీయ భాష ? భాషా ప్రయుక్త రాష్ట్రాలు మన భాషల అభివృద్ధికి వరం, శాపం కూడా. మన దేశంలో రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఎక్కువ భాగం మాట్లాడేవారు ... ఈ రోజున వారి వారి ప్రాంతాల్లో కంటే ఇతర ప్రాంతాల్లో,ఇతర దేశాల్లోకూడా ఎక్కువ గానే ఉంటున్నారు. వారి సంసారాలతోపాటూ వారి భాషనుకూడా భుజానవేసుకుని తిరుగుతున్నారు. మన దేశంలో ఒక్కో రాష్ట్రం సైజులో ఉండే దేశాల్లో అక్కడ వారి భాష జాతీయ, అంతర్జాతీయ భాషగా ఛలామణీ అవుతున్నప్పుడు... మన భాషలను మనం ప్రాంతీయ.. అని గిరిగీయడం ఎంతవరకు సమంజసం ? మనదేశంలో ఉన్న వన్నీ జాతీయ భాషలే అని ఎందుకనగూడదు ?)
ఈ నేపథ్యంలో మన ముందున్న ప్రశ్నలు –
ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ ప్రచురణకర్తలు – మారుతున్న కాలానికి, దాని వేగానికి తగ్గ సాంకేతిక, నెట్ వర్క్ సామర్ధ్యాలను సమకూర్చుకో గలుగుతున్నారా? తద్వారా వారి బ్రాండ్ విశ్వనీయతను పాఠకుల్లో పెంచుకోగలుగుతున్నారా ? పుస్తకాల అమ్మకాల మీద వచ్చే ఆదాయం మీద రచయితలు బతకగలిగే పరిస్థితులు ఉన్నాయా ? రచయితలకు దక్కాల్సిన ఆదరణ, గౌరవం, లాభాల్లో వాటా ప్రచురణకర్తలు ఇస్తున్నారా ? నగరాలనుండి గ్రామాల వరకు పుస్తకాల పంపిణీకి ప్రస్తుతం ఉన్న నెట్ వర్క్ ఎలా ఉంది ? దానిని విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? పుస్తక ప్రచురణలో సహకార సంఘాల పాత్ర... వంటి ఆలోచనలు చేసారా ? వ్యక్తిగతంగా పాఠకుడిని ఆకర్షించడానికి లేదా అతనిని చేరడానికి ప్రచురణరంగం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది ? పుస్తక ప్రియులతో రీడర్స్ క్లబ్‌ల వంటి ప్రయోగాలు జరిగాయా ? కాపీరైటు విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి ?
ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవాలంటే మన విద్యారంగం పరిస్థితిని సూక్ష్మంగా చూసి క్లుప్తంగా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ప్రాచీన తెలుగు సమాజం దృష్టిలోచదువు..అంటే.. .."చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁజదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ!’’.. అని చదువులలో మర్మమెల్ల చదవడం. అంటే విద్యాభ్యాసానికి అవసరమైన శాస్త్రాల(టెక్స్ట్ బుక్స్) తోపాటూ, ఇతరత్రా చాలా పుస్తకాలు చదివి వాటిలోని సారాన్ని , రహస్యాలను, లోకజ్ఞానం తెలుసుకోవడం. మరిప్పుడో !!! చదువు అంటే... మార్కులు, పరీక్షలు, ర్యాంకులే తప్ప ఇతరత్రా జ్ఞానాన్ని పెంపొందించుకోవడంగానీ, ఆటపాటలు కానీ, బతుకుపాఠాల మెళకువలుగానీ కాదు. ప్రస్తుత విద్యావిధానమే అలా కట్టడి చేస్తున్నది. దీని వల్ల ఐక్యరాజ్య సమితి వంటి వాటి నుంచి నిధులు పొందడానికి మాత్రం అక్షరాస్యుల సంఖ్య పెంచుకోవచ్చు తప్ప వివేకవంతులు, విజ్ఞానవంతుల సంఖ్య పెరగదుకాక పెరగదు.
ప్రజల్లో పుస్తకపఠనం పెంపొందించడానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు లేవు. ప్రయత్నాలు కూడా లేవు. ప్రచురణరంగంలో మావన వనరులను పెంచి, సౌకర్యాలు కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలపరంగా చర్యలు శూన్యం.
మొట్టమొదటగా
• ప్రభుత్వం ప్రచురణ రంగాన్ని వాణిజ్యేతర, ప్రజోపయోగకర, అత్యవసర విభాగంగా ప్రకటించి ఆ మేరకు చర్యలు చేపట్టాలి.
• మానవ సంచారం ఉన్న చోట.. ఆస్పత్రులు, ఆహార శాలలు ఎంత అవసరమో,నాగరిక సమాజంలో పుస్తక భాండాగారాలు కూడా అంతే అవసరం. గ్రంథాలయాల విస్తరణతో పాటూ, ప్రైవేటు పుస్తక షాపులను ఊరూరా, వాడవాడా ప్రోత్సహించాలి. తద్వారా పాఠకుల్లో పఠనాసక్తిని కలిగించినట్లవుతుంది.
• రైతులకు, వ్యవసాయ మార్కెట్లకు లాగానే ప్రచురణకర్తలకు మార్జిన్ మనీ, తక్కువ వడ్డీలకు రుణాలు, సబ్సిడీలు,బీమా, విపత్తుల నిర్వహణ, మద్దతు ధరలవంటి సదుపాయాలు కల్పించాలి.
• జిఎస్ టి వంటి పన్నులకు దూరంగా ఉంచాలి. ఒకవేళ తప్పనిసరని భావించినా కనిష్ఠ స్లాబు 5% దాటకుండా చూడాలి
Press & Regn Of Books Act, Delivery of Books Act అని రెండు చట్టాలున్నా ప్రచురణకర్తలను నియంత్రించడానికి వాటిని నిక్కచ్చిగా అమలుపరచడం లేదు. ఇంగ్లీష్ పుస్తకాలు మన జనాభాలో 2.19% మందికి మాత్రమే ఉపయోగపడితే, మిగిలిన 59.62% మందికి పుస్తకాలు ఇతర 12 ప్రాంతీయ భాషల్లో ఉంటున్నాయి. వీటిల్లో ప్రతి పదిలక్షలమంది అక్షరాస్యులకు అందించే పుస్తకాలలో 63.03% పుస్తకాలు తమిళం నుంచి, 48.57% బెంగాలీనుంచి, 47.27% మలయాళంనుంచీ, 45.29% పంజాబీనుంచి ఉన్నాయి. (తెలుగు లెక్కలు తెలియదు కానీ మొదటి నాలుగైదు స్థానాల్లో అయితే లేదు.)
ప్రాంతీయ భాషల్లో పుస్తకాల టైటిల్స్ పెరిగినట్లుగా విక్రేతల(బుక్ సెల్లర్స్) సంఖ్య పెరగడం లేదు. బుక్ సెల్లర్స్ దగ్గర కూడా అన్ని టైటిల్స్ ప్రదర్శించేంత స్థలం ఉండదు. దానితో చాలా పుస్తకాలు మరుగునపడి (గోడౌన్లలో) ఉంటాయి.రచయితలుగానీ, ప్రచురణకర్తలుగానీ – బుక్ సెల్లర్స్ కు క్రెడిట్ మీద ఇవ్వాలి. అమ్ముడుపోయిన తరువాత ఇచ్చేటట్లు. అది కూడా ఎప్పుడో. ఇది సుదీర్ఘ కాలహరణ ప్రక్రియ. అమ్ముడు పోకుండా గోడౌన్లలో పడి ఉన్న పుస్తకాలను చాలా ఏళ్ళ తరువాత రిటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎన్ని ఏళ్లయినా పట్టవచ్చు.
ప్రాంతీయ భాషల్లో... పుస్తక ప్రచురణలో రచయితల స్ర్కిప్టులను వాటి యోగ్యతలపైకాకుండా ఆర్థికంగా ప్రచురణకర్తలకు రచయితలు అందించే తోడ్పాటును బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల అర్హులైన పేద రచయితలు అజ్ఞాతంలో ఉండిపోతుంటారు. ప్రచురణకర్తలు రచయితలకు సకాలంలో అమ్మకాలపై వచ్చిన డబ్బును చెల్లించరు. అధికార, అనధికార ఒప్పందాలేమీ లేని కారణంగా ప్రచురణకర్తలు, రచయితలకు వారి స్ర్కిప్టులపై దాదాపు ఏమీ చెల్లించరు. కనీస ఆర్డరును 1000 నుంచి 3 వేలకు పెంచితే కొంత మేర లాభాలు పెరుగుతాయి. పుస్తకం ముద్రణ వ్యయానికి మూడింతలు ఎక్కువగా అమ్మకం ధర పెట్టాల్సిన దుస్థితి ఉంది.
.....
మోదీ అయినా, రేవంత్ రెడ్డి అయినా......
https://mideabox.blogspot.com/2025/12/blog-post_85.html?spref=tw
No comments:
Post a Comment