Tuesday, January 13, 2026

 *భగవంతుడు సర్వవ్యాపి కదా. సర్వత్రా ఉన్న భగవంతునికి ఆలయాలు ఎందుకు?*

నిజమే. పరమాత్మ సర్వవ్యాపి అనేది సత్యం. కానీ, ఆ పరమాత్మను మనం ఎలా గుర్తించగలం? 

నిర్గుణుడు, నిరాకారుడు, విశ్వవ్యాపి అయిన పరమాత్మను కారణజన్ములైన మహాయోగులు, ఋషులు, మహర్షులు దర్శించగలరేమోగాని, సామాన్యులు తమ భౌతికదృష్టితో దర్శించలేరు. వారు అర్చించి తరించగలరేమేగాని, సామాన్యులకు ఇది అసాధ్యం. మరి మనం తరించేది ఎలా? ముక్తి పొందేది ఎలా? ఈ జన్మపరంపరలో చిక్కుకొని జీవితం సుఖ దుఃఖాలతో సాగించవలసిందేనా? అలాంటప్పుడు పశు పక్షాదులకు మనకి తేడా ఏముంది? మానవజన్మ నిరర్ధకమే కదా. మనలో అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మికశక్తిని జాగృతం అయ్యేదెలా? ఆత్మ సాక్షాత్కారం అయ్యేదెలా? సత్యాన్ని తెలుసుకోవడం ఎలా? అందుకనే మహాద్రష్టలైన  మన మహర్షులు మనం తరించడానికి వేదానుసారం అనేక మార్గాలను సూచించారు. అందులో భాగంగానే ఆలయ నిర్మాణాలు, సాకారార్చనలు.

*అంతర్యామి ఆత్మ రూపేణా హృదయంలోనే ఉంటాడు కదా. హృదిలో ఉన్న హరిని దర్శించక ఆలయాలకు వెళ్ళడం ఎందుకు? విగ్రహారాధన ఎందుకు?*

ఇక విగ్రహారాధన ఎందుకంటే - భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక ఆకారం అవసరం. విశ్వాసంతో ఓ విగ్రహాన్ని దైవంగా ఆరాధించడం ద్వారా మనలో ఆరాధన భావం పెంపొంది, క్రమేణా మనోబుద్ధులు సంస్కరింపబడి, విచారణతో ముందుకు సాగుతూ నిజాన్ని ఆవిష్కరించుకోమని హిందూ ధర్మం బోధిస్తుంది. అంతేకాదు, ఒక రూపాన్ని పెట్టి, ఆ రూపాన్ని ధ్యానం చేయమంటేనే, మనస్సు మర్కటంలా పది చోట్లకు పరుగులు తీస్తుంది. అలాంటిది ఏ ఆలంబన లేకుండా అదృశ్యమైన, అత్యున్నతమైన దానిని ధ్యానించాలంటే... అది మనకు సాధ్యమేనా? నిరంతరం చలించడం మనస్సు స్వభావం. ఒక పట్టాన ఒకదానిపై నిలవదు. అందుకే సాకార ఆరాధన. మన హైందవ ధర్మం ఇలా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళే మార్గాలన్నింటినీ సూచిస్తుంది. ఈ విగ్రహ ఆరాధనే క్రమేపి రూపానికి అతీతమైన తత్త్వానికి తీసుకెళ్తుంది. ముందు సాకారం, సగుణం. ఆ తర్వాత నిరాకారం, నిర్గుణం.

💦🙏💦🙏💦🙏💦🙏💦

No comments:

Post a Comment