*భోగిపండుగ* గురించి..
మనకు వచ్చే అనేక పండుగలలో ‘భోగిపండుగ’ను చాలా విశేషంగా చేసుకుంటాం.
భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండుగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజు గనుక దానికి భోగిపండుగ అని పేరు.
ఈ ‘భోగి పండుగ’ వచ్చే సమయానికి వ్యవసాయ దారులు పంటలు కోతలు కోస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన పంట జాగ్రత్తగా ధ్యాన్యాగారంలో నిలవ చేసి మళ్ళీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించిన కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాలను అనుభవిస్తారు. భోగిపండుగ అని పిలవడానికి కారణం ఏమిటంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యం అంతా వచ్చేటటువంటి కాలం.
ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండే భోగి పండుగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఆ కాలం ప్రారంభం అవడానికి సంకేతం.
ఇది బాహ్యమునందు భోగి. ఆంతరముగా విచారణ చేస్తే భోగి పండుగకు ఉన్న విశేషం చాలా చాలా గొప్పది.
దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్టచివరి రోజు ఏదైతే ఉందో, మకర సంక్రాంతికి ముందు ఉండే రోజు భోగి పండుగ. ఈ తిథినాడు భోగిపండుగ రావాలి అనే నిర్ణయం ఉండదు.
మనిషి ఆంతరముగా భోగం అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని పొందుతాడు. విడుదలయే మోక్షము. అటువంటి మోక్షాన్ని పొందడమే జీవితంలో నిజమైన భోగి. అటు ఆధ్యాత్మికంగా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కావలసిన కాలం అయి ఉండడం ఒక ఎత్తు. లౌకికమైన కోరికలకు దూరంగా ఉండి ఆంతరమునందు భగవంతుడి దగ్గరగా ఈశ్వరకాలం పెంచుకుంటాం అని చెప్పడానికి సూచనగా భోగిమంట అని వేస్తారు. అందులో కట్టెలు, ఆవుపేడతో చేసిన పిడకలు వేస్తారు. అంటే దాని అర్థం లౌకిక కామాన్ని కాల్చేసి ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాం అని. బాహ్యంలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం. ఆ భోగి లౌకిక కామన కాలిపోయి ఈశ్వర కామన ఒక్కటే మిగిలిపోతే ఆ ఈశ్వర కామమే నిరతిశయ భక్తిగా మారితే
ఆ భక్తివలన చేసిన కర్మాచరణం చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే పాత్రత వలన జ్ఞానము కలిగితే జ్ఞానము వలన భోగి.
భోగి అంటే ఈశ్వరునితో భోగించుట. అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది. దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనం చేసేటటువంటి రోజుగా చెప్పబడే విశేషమైన తిథి గనుక దానికి ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చేయరు. దక్షిణాయనానికి చిట్టచివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండుగగా నిర్ణయింపబడి ఉంటుంది.
ఈ భోగిపండుగ నాటికి అమ్మవారి అనుగ్రహం రేగు పండులోకి ప్రవేశిస్తుంది.
అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించడానికి వాళ్ళు కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు నిర్వహించలేరు గనుక చిల్లర పైసలు, బంతిపూలు, రేగుపండ్లు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు కలిపి పెద్దవాళ్ళు పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళ మీదనుంచి ఈ పదార్థాలను విడిచిపెడతారు.
ఈ పదార్థాలు వాళ్ళ తలమీంచి క్రిందకు పడిపోతే భోగిపీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చే అవకాశం ఉంటుందో అటువంటి అవకాశం తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే భోగిపీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగిపండుగ.✍️```
-- పూజ్య గురుదేవులు, ‘ప్రవచన చక్రవర్తి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు గారు.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
No comments:
Post a Comment