🔱 *ప్రభాత గుళిక* 🔱
# *అన్నాన్ని బట్టి ఆలోచన...*
🍁అన్నం వల్లే జీవులు మనగలుగుతున్నాయి. అన్నం. అంటే కేవలం రోజూ మనం తినే ఆహారమే కాదు. తాగే నీరు, పీల్చే గాలి, వినే శబ్దం, కనే దృశ్యం అన్నీ అన్నం కిందికే వస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే బ్రహ్మోపాసన. అది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుందని తైత్తరీయ ఉపనిషత్తు చెబుతోంది. అన్నదానం యజ్ఞంతో సమానం.
🍁పంచభూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు అన్నీ అన్నానికి అనుబంధాలు. మనిషి తినే ఆహారంపై అతడి జీవితం ఆధారపడి ఉంటుంది. జీవించడానికి అవసరమైనంత ఆహారమే తినాలి. తినడానికే జీవితాన్ని కుదువపెట్టకూడదు-అన్నారు గాంధీజీ. అస్తిత్వాన్ని నిలుపుకోడానికి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోడానికి, ఔన్నత్యం పొందడానికి, హితకరమైన ఆహారాన్ని మితంగా స్వీకరించమంటారు నిపుణులు. ఆరోగ్యమైన శరీరం, మనసు.. ఆహార విహారాల పైనే ఆధారపడి ఉంటాయి. జంతుదశ నుంచి మానవదశకు. మానవదశ నుంచి దివ్యమానవ దశకు ఎదగడమే మానవజాతి పరమార్థం, పరమగమ్యం. స్థూల, సూక్ష్మ శరీరాలు, ఇంద్రియ, మనో బుద్ధులు ఆత్మవికాసానికి దారిదీపాలు. గత సంస్కారాలు ప్రస్తుత జీవితానికి పునాదిరాళ్లు. మంచి ఆలోచనలు, మంచి మంచి పనులను చేయిస్తాయి. తప్పుడు ఆలోచనలు హింసకు పురిగొలుపుతాయి. మనసు ఆలోచనల కర్మాగారం. యదార్థాన్ని గ్రహించి, అసత్యాన్ని, ఆధర్మాన్ని, వ్యర్థ పదార్థాల్లా బయటికి పంపించాలి.
🍁సాధన ద్వారా మనసు స్వాధీనం అయినప్పుడు, సామాన్య మానవుడు దివ్యమానవుడిగా మారగలడు. మరికొందరిని తన మార్గంలోకి తేగలడు. అదే నిజమైన మానవ సేవ. ప్రశాంతమైన మనసుతో ఇతరులకు ఆ అవకాశం కల్పించాలి. అదే నిస్వార్థ క్రియాయోగం. గుడిలో పూజారి దేవుడి నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులందరికీ అందజేస్తాడు. అ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని వారందరూ ఆరగిస్తారు.
🍁ప్రసాదం ప్రసన్నతను చేకూరుస్తుంది. అన్నాన్ని ప్రసాదంగా భావించి, భోజనానికి ముందు కళ్లకు అద్దుకుంటాం. భగవన్నామ స్మరణ చేస్తూ, సంతర్పణలు, సమారాధనలు చేయడం యజ్ఞంతో సమానం. యజ్ఞం వల్ల పర్జన్యం (మేఘం), దానివల్ల అన్నం దొరుకుతుంది. వర్షం పడగానే భూమి దున్ని. విత్తనం చల్లి, పంట పండించే అన్నదాత రైతు. అతడు చెమటోడ్చగా పండే ధాన్యాన్ని దొంగిలించడం దోషం. ఒక వ్యాపారి దొంగ బియ్యం చవగ్గా కొన్నాడు. ఒక యోగిని భోజనానికి ఆహ్వానించాడు. బంగారు పళ్లెంలో పంచభక్ష్య పరమాన్నాలతో అన్నం వడ్డించాడు. దొంగిలించిన బియ్యంతో తయారైన అన్నం తిన్న పాపానికి యోగికి దొంగబుద్ధి పుట్టింది. బంగారు పళ్లెం జోలెలో వేసుకుని వెళ్లిపోయాడు.
🍁తరవాత కాసేపటికి తన దొంగబుద్ధికి చింతించిన యోగి వ్యాపారి ఇంటికి వెళ్లి ఆ పళ్లెం తిరిగి ఇస్తూ "నీ అన్నంలో ఏదో దోషం ఉంది' అన్నాడు. దొంగిలించిన బియ్యం కొన్నానని తన తప్పు ఒప్పుకొన్నాడు వ్యాపారి. నీతిలేని మనిషికి శాంతి ఉండదు. అలాంటి జీవితానికి అర్థమే ఉండదు.🙏
✍️- ఉప్పు రాఘవేంద్రరావు గారి సౌజన్యంతో
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
No comments:
Post a Comment