-------------
వెలుగైన స్వామి
-----------------
ఇవాళ స్వామి వివేకానంద జన్మదినం.
ఇవాళ మనకు, మన దేశానికి కావాల్సింది బుద్ధుడు, సాయిబాబా కాదు. నిజానికి మనదేశానికి ఎప్పటికీ బుద్ధుడు, సాయిబాబా కావాల్సిన వాళ్లు వారు కారు. ఆదిశంకరాచార్య తరువాత, స్వామి వివేకానంద మనదేశానికి ఇవాళే కాదు ఎప్పటికీ కావాల్సిన వారు స్వామి వివేకానంద!
ఇంట్లోంచి వెళ్లిపోయి భిక్షాటన చేస్తూ బతకమని వివేకానందుడు చెప్పలేదు. అల్లాహ్ మాలిక్ అంటూ మసీదుల్లో కూర్చుని ఉత్పాదకత, పనితనం, ప్రయోజనం లేకుండా కాలం గడిపిన ఫకీర్ కాదు స్వామి వివేకానంద. "మేలుకో, పైకిలే, లక్ష్యాన్ని చేరే వరకూ ఆగకు" (Awake arise stop till the goal is reached) అంటూ మనల్ని ఉద్యుక్తుల్ని, కర్తవ్యోన్నుఖుల్ని చేసిన గురువు స్వామి వివేకానంద.
'వెలుగుతూండే స్వామి వివేకానంద'. స్వామి వివేకానంద మహోన్నతమైన వ్యక్తి , బహుముఖ శక్తి. ఇవాళ వారి జన్మదినం సందర్భంగా మన ఆలోచనలతో మళ్లీ వారిని అవలోకిద్దాం రండి...
స్వామి వివేకానంద తాను పొందిన ఆత్మజ్ఞానాన్ని (enlightenment) కూడా వదులుకుని సనాతన ధర్మం కోసం తనను తాను అర్పించుకున్నారు. రామకృష్ణ పరమహంస శిష్యుడైన తొలినాళ్లలోనే ఆత్మ లేదా బ్రహ్మ జ్ఞానం వారికి వచ్చేసింది. ఆ విషయాన్ని గ్రహించిన రామకృష్ణులు వివేకానంద ఈ గడ్డకు, సనాతన ధర్మానికి చెయ్యవలసినదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బ్రహ్మానుభూతిని తొలగించారు. వివేకానంద తన బ్రహ్మానుభూతిని సనాతన ధర్మం కోసమూ, కర్తవ్య నిర్వహణ కోసమూ వదులుకున్నారు. ఏ యోగీ చెయ్యని త్యాగం ఇది. ఏ త్యాగీ పొందని యోగం ఇది.
"జగద్వాచిత్వాత్ " అని ఒక బ్రహ్మసూత్రం ఉంది. బ్రహ్మన్ "కదలిక కలది" అని చెప్పబడింది. స్వామి వివేకానంద కదిలిన వైదికత్వం. ప్రపంచాన్ని కదిలించిన భారతీయత స్వామి వివేకానంద.
భారత( ప్ర)దేశ వేద, ఉపనిషత్, ప్రస్థానత్రయ, మంత్ర, తంత్ర, సంస్కృతీ వాఙ్మయాన్ని విశ్వానికి వివరించారు, సనాతన వాణిని విశ్వానికి నినదించారు వివేకానంద.
ఆది శంకరాచార్య తరువాత భారత దేశం లో వచ్చిన అధ్యాత్మిక, తాత్త్విక విప్లవం స్వామి వివేకానంద. ఆది శంకరులకు, వివేకానందులకు పోలికలున్నాయి.
శంకురుల వంటి మేధ, రామానుజల వంటి హృదయం కావాలి" అని వివేకానందులు ఆకాంక్షించారు.
నరేంద్రనాథ్ దత్త అన్నది వీరి అసలు పేరు. స్వామికృష్ణానంద్ అన్న పేరును తొలుత తీసుకుందామనుకున్నారు. వివిధీశానంద్ అన్న పేరును తీసుకుని ఆ పేరును వాడలేదు. 1891 లో స్వామి వివేకానంద్ అన్న పేరును తీసుకున్నారు. 1892లో స్వామి సచ్చిదానంద్ అన్న పేరును తీసుకున్నారు. 1893లో పశ్చిమ దేశ యాత్రకు వెళుతూ వివేకానంద్ పేరును స్థిరపఱుచుకున్నారు. ఆ తరువాత వివేకానంద్ పేరు స్థిరపడిపోయింది.
"సనాతన ధర్మం ఏ వాదాన్నో, ఏ సిద్ధాంతాన్నో నమ్మాలనే ప్రబల ప్రయత్నాలతో కూడుకున్నది కాదు; అనుభూతే, ఆత్మస్థితే సనాతన ధర్మ తత్త్వం" అని వివేకానంద సరైన అవగాహనను ఇచ్చారు. మతం అంటే స్థితి. అది ఏ గ్రంథంలోనూ ఉండదు" అన్న తెలివిడినిచ్చిన వారు వివేకానంద.
ఒక మొహమ్మద్ నబి, ఒక జీసస్, ఒక బుద్ధుడు వీళ్ల గుఱించి సరిగ్గానూ గొప్పగానూ మతాతీతంగానూ తెలియజెప్పారు స్వామి వివేకానంద. "బుద్ధుడిలో సంపూర్ణత్వం లేదు' అని విశ్వమంతా వినిపించేట్టుగా సరిగ్గా చెప్పారు వివేకానంద.
కాల్ మాక్స్, జీసస్, నబి, బుద్ధుడు ఇంకా ఇతరుల గుఱించీ వివేకానందులు తెలియజెప్పిన పరిశీలనలు మనకు సరైన అవగాహననిస్తాయి. వివేకానందులు అన్య తత్త్వాల, అన్య సిద్ధాంతాల గొప్పతనాన్ని కూడా గొప్పగా వివరించిన మహనీయులు. సిద్ధాంతాల (isms) కు అతీతంగా నిజాలను నివేదించిన నిజ జ్ఞాని, జ్ఞాన నిజం వివేకానందులు.
మనదేశానికి స్వతంత్రం రావడానికి కారణం వివేకానందులే అన్నది అవగాహన ఉన్న కొందఱికి తెలుసు. బ్రిటిష్ పాలనా కాలంలో మకాలి (Macaulay) అమలుపఱిచిన విద్యా విధానంవల్ల జాతీయతా చింతన, భావన, ఈ (ప్ర) దేశ సంస్కృతి, మన చరిత్ర అంతరిస్తున్న సమయంలో తన పరిశీలనలతో వివేకానందులు వాటిని పునర్జీవింపజేశారు, ఈ మట్టి మనుషుల్ని తమ బోధలతో తట్టిలేపారు. వారివల్ల చైతన్యవంతమై పలువురు చేసిన ప్రయత్నాల ఫలితం, ఫలం మనకు వచ్చిన స్వతంత్రం.
ఆర్యులు బయటినుంచి వచ్చిన వారు కాదు, ఆర్య అనేది జాతి కాదు అని తెలియజెప్పి, ఆ విషయంగా ఆలోచనను రేకెత్తించారు స్వామి వివేకానంద. ఇవాళ Oxford Dictionary "Aryan invasion theory is an abandoned theory" అని స్పష్టం చేస్తున్నదీ అంటే దానికి వివేకానంద స్వామి మూలం, కారణం.
ఒక విదేశీ వనిత ఒకసారి వివేకానందుల వారిని తనను పెళ్లిచేసుకోమని అడిగితే "నన్నెందుకు పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారు?" అని వివేకానందులు ఆమెను అడిగారు. ఆమె "మీలాంటి కొడుకు కావాలి నాకు అందుకని" అని జవాబిస్తే అది విని దానికి "నన్ను పెళ్లి చేసుకుని ఆపై నాలాంటి కొడుకును కనడం ఎందుకు? నేనే మీ కొడుకును నన్నే మీ కొడుకుగా తీసుకోండి" అన్నారు. ఆ సంఘటన వారి మనస్తత్వం ఏ మేఱకు పండిందో తెలియజేస్తుంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి స్వామి వివేకానంద భారతదేశం కన్న ఓ మహాకవి కూడా. ఆయన ‘ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్’ అన్న ఇంగ్లిష్ కవితా సంపుటిని రాశారు. ఎంతో ఉన్నతమైన కవిత్వం రాశారు వివేకానంద. రవీంద్రనాథ్ ఠాగూర్, ఖలీల్ జిబ్రాన్, లావొచు, కబీర్, జలాలుద్దీన్ రూమీ రచనల నాణ్యతతో స్వామి వివేకానంద కవితలుంటాయి.
“కొండలపైనా, పర్వత శ్రేణుల పైనా,
గుళ్లలోనూ, చర్చ్ల లోనూ, మసీదుల్లోనూ, వేదాల్లోనూ, బైబిలులోనూ, ఖుర్ఆన్‌లోనూ
వృథాగా నిన్ను వెతికాను;
అడవిలో తప్పిపోయిన పసిబిడ్డలా ఒంటరిగా ఏడ్చాను;
నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు, నా దైవమా! నా ప్రేమా?
ప్రతిధ్వని జవాబిచ్చింది, “వెళ్ళిపోయింది” అని.
స్వామి వివేకానంద మఱో కవితలో ఇలా అంటారు:
“కళ్లు మందగించినా, హృదయం అలిసిపోయినా,
స్నేహం విఫలమైనా, ప్రేమ ద్రోహం చేసినా,
విధి నూరు విధాల భయపెట్టినా,
ఘనీభవించిన చీకటి దారికి అడ్డుపడినా..
ఓ నా బుద్ధీ! నువ్వు భగవద్దత్తం-
ముందుకు, ముందుకు కదులు..
కుడి, ఎడమలు కాదు.. లక్ష్యం వైపుకు”.
మఱో కవిత ఇలా రాశారు:
“మాతృహృదయం,
వీరుడి సంకల్ప బలం,
దక్షిణ వాయువుల కమ్మదనం,
పవిత్రమైన మంత్రం,
ఆపై ఆర్యుల పూజా పీఠంపై ఉండే శక్తి, తేజస్సు,
స్వేచ్ఛ
ఇవన్నీ నీవి కావాలి
ఏ పాత బుద్ధీ వీటి గురించి కలగనలేదు
భావి భారత పుత్రుడా! ఇవన్నీ నీవి కావాలి"
సార్వజనీనత, సార్వకాలీనత సమ్మిళితమైన మనీషి స్వామి వివేకానంద. ఒక మహాయోగి, మహా దార్శనికులు, మహా తాత్త్వికులు మహా సంస్కర్త, మహాకవి వివేకానందులు.
ఆదిశంకరాచార్య మహోన్నతమైన, అసదృమైన గురువు. ఒక దశలో ఆధ్యాత్మిక, సామాజిక జ్యోతి ఆదిశంకరాచార్య గురువై ఉండకపోయుంటే భారత ప్రదేశానికి ప్రకృతి ఉండేది కాదు. ఆదిశంకరుల తరువాత స్వామి వివేకానంద. వివేకానంద వచ్చి ఉండకపోతే భారతావనికి, సనాతనానికి కాలం చెల్లిపోయుండేదేమో? మనదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం రావడానికి వివేకానందులే పరోక్ష కారణం. భారతప్రదేశానికి ఒక దశలో ఆది శంకరాచార్య గురువు కాగా ఒక దశలో స్వామి వివేకానంద గురువులై మనకు వెలుగు చూపించారు.
"ఆది శంకరాచార్య తరువాత స్వామి వివేకానందను మన జాతి గురువుగా ఇకపై మనం పరిగణించి స్వీకరించాలి; ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద ఈ ఇరువురిని గురువులుగా చేసుకుని భారతీయులం మనం పరిఢవిల్లాలి".
వివేకానందులు తన కోసం బతక లేదు. ఈ దేశం కోసమూ, సనాతన ధర్మం కోసమూ తన జీవితాన్ని వదులుకున్నారు. తన ఆత్మానందానుభూతిని సైతం వదులుకున్నారు. ముప్పై తొమ్మిదేళ్లు (1863-1902) మాత్రమే ఈ భూమిపై మెఱిశారు వివేకానంద. ఎప్పటికీ ఈ భూమిపై వెలుగుతూండే స్వామి సనాతన వెలుగైన స్వామి వివేకానందులు.
రోచిష్మాన్
9444012279
No comments:
Post a Comment