🔔🙏🔔🙏🔔
*అనన్య చింతన, ధ్యానము*
ఆలోచనా వైఫల్యమే వైకల్యం. ఆచరణా వైఫల్యమే వైకల్యం.
మనం చేయవలసిన సాధన బాహ్యంగా కాదు, సాధన అంతరంలో చేయాలని తెలిపేది, 'అహం బ్రహ్మాస్మి' అనే సిద్ధాంతం ప్రతిపాదించేది బృహదారణ్యక ఉపనిషత్.
*ఏదైనా చదివిన, విన్నా... దానిని ఒక విజ్ఞానంగా మెదడులో నిక్షిప్తం చేసుకుని అక్కడే ఆగిపోతే, అది ఓ జ్ఞాపకంలా మాత్రమే నిలిచిపోతే...మాటలు నేర్చిన చిలుకలా పలకడానికే ఆ విజ్ఞానం పనికి వస్తుంది* by - జిడ్డు కృష్ణమూర్తి గారు
ఒకానొక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక తన పిల్లలతో వుండేది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోననీ, భయపడి, ఒకరోజు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్నిచూసి, పిల్లల్లారా! రండి, మీకొక సత్యాన్ని పాటగా నేర్పిస్తాను అంది సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు...
వేటగాడొస్తున్నాడు జాగ్రత్త.
గింజలు ఎరగా విసురుతాడు జాగ్రత్త.
వలవేస్తాడు జాగ్రత్త.
పట్టుకుంటాడు జాగ్రత్త.
మెడ విరిచేస్తాడు జాగ్రత్త.
అనే పాటనేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు రమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు, అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఒకనాడు ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త... అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టు చాటున నక్కి, పోనీ గింజలు విసిరి చూద్దామనుకొని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త... అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త... అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు ........ అంటూనే చచ్చిపోయాయి.
చూసారా... ఆ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని అవగాహన చేసుకోలేదు, ఆచరణలో పెట్టలేదు.
మనమందరము కూడా, అలానే వున్నాము. తెలుసుకున్న సత్యాన్ని జీవితంలో ప్రవేశపెట్టడమే ఆచరణ. తెలుసుకున్న సత్యాలను ఆచరణలో పెట్టకపోతే, తెలుసుకొని ప్రయోజనం ఏముంది? ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృథాయే కదా!
ఇక ధ్యానమంటారా... కొందరు నిటారుగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడతారు. కొందరు పద్మాసనం వేసుకొని చేస్తారు. సుఖాసనం అని పంతజలి చెప్పారు. ఆటంకం కలిగించని, ఎవరి సౌలభ్యం కొద్దీ వారు కూర్చోవచ్చు. ఒత్తిడికి గురైన భంగిమలో ధ్యానం చేయడం వల్ల శరీరం యొక్క అసౌకర్యంపై మనస్సు నిలిచిపోతుంది. ఏకాగ్రత కుదరదు. కూర్చోవడం ధ్యాన ముద్ర. శ్వాస మీద ధ్యాస పెట్టడం ధ్యాన నిష్ఠ. ఇవి ధ్యాన ప్రక్రియలు. అయితే ఒక గంట కళ్ళు మూసుకొని కూర్చొని, రోజంతా మనకు నచ్చేలా ఉండడం ధ్యానం కాదు.
నిరంతరం ఎరుక లో ఉండడం ధ్యానం. చేస్తున్న ప్రతీ పనినీ ఎరుకతో చేయడం ధ్యానం. ధ్యానం యొక్క అంతిమ గమ్యం సాక్షితత్వమే.
శాస్త్ర జ్ఞానంతో వెలుతురు పుట్టించవచ్చు. అనుభవ జ్ఞానమే నీలో అంధకారాన్ని తొలగిస్తుందని అంటారు స్వామి మైత్రేయ.
ఆధ్యాత్మిక ఆకాంక్షలు, శాస్త్రపరిజ్ఞానం ఉత్తమంగా ఉంటే చాలదు. అవి ఆచరణగా రూపుదిద్దుకోవాలి. మనం తెలుసుకున్న వాటిని మన జీవితంలో ఆచరించగల్గినప్పుడే అందులో మహా సత్యాన్ని అనుభూతి చెందగలం.
లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.
మన విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూల ఆలోచనలే. మన ప్రవర్తన మన ఆలోచన విధానాలే మనం వ్యక్తి నుండి శక్తిగా ఎదగడానికి దోహదపడుతాయి. కొన్నిసార్లు ఎక్కడా దొరకని ప్రశాంతత, మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. అంతేగానీ, చిత్తాన్ని చంచలం చేసుకుంటే దాని ఫలితంగా లక్ష్య సాధన సిద్ధించదు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.
దృఢసంకల్పానికి ఏకాగ్రత, విశ్వసనీయత తోడైనప్పుడు, ఎలాంటి వారైనా తాము కోరుకున్న లక్ష్యాలు సాధిస్తారు. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింప జేయాలన్న లక్ష్యం భగీరథుడిది. అకుంఠిత దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగి వచ్చేలా చేశాడు.
ఎవరు ఏమైనా చేయనీ, ఎన్నైనా చెప్పనీ, మనదృష్టి మన లక్ష్యంపై మాత్రమే వుంటే, మనం మనతోనే విశ్వాసంగా వుంటే, మనం సాధించాలనుకున్నదాన్ని ఎవ్వరూ ఆపలేరు! తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తిమార్గాన్ని వీడలేదు.
దారిలో నది అడొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు - నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులోస్తే ఆపాల్సింది పని కాదు - ప్రయత్నించే పద్ధతి.
బాహ్య సంఘటనలకి ఉద్రేక పడకుండా నిలకడగా మనసును జాగ్రత్తగా ఉంచుకోవడమే సాధన. అలానే మనం చేసే సాధనలన్నీ ఆత్మను పొందటానికి కాదు, శరీరం నేను కాదు అని తెలుసుకోవటానికే.
కుబ్జ కూడా శ్రీకృష్ణ దర్శనంతో ధన్యురాలు అయింది. ఆమె గూని అడ్డు కాలేదు ఆమెకు. నిజానికి ఆ గూనే కృష్ణుని దరి చేర్చిందంటారు.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment