Tuesday, January 13, 2026

 ----------
'సరిగ్గా' తిరుప్‌పావై 
   23
-------------------

మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!

(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని‌ అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.  

ఆళ్ష్వార్‌ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది.‌‌ పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి.‌ పాసురమ్ అనడమే సరైంది‌.)

పాసురమ్ 23 

ఆణ్డాళ్, కృష్ణుణ్ణి అనుగ్రహించమంటూ  ఇరవైముడో పాసురాన్ని నినదిస్తోంది ఇదిగో ఇలా‌‌... 

మూలం 

మారి మలైముళ్షైఞ్‌జిల్ మన్నిక్కిడత్తుఱఙ్గుమ్
సీరియ సిఙ్గమ్ అఱివుఱ్ట్రుత్ తీవిళ్షిత్తు
వేరి మయిర్‌పొఙ్గ ఎప్పాడుమ్ పోన్దుదరి
మూరి నిమిర్‌న్దు ముళ్షఙ్గి పుఱప్పట్టుప్
పోదరుమాపోలే నీ పూవైప్‌పూ వణ్ణా! ఉన్
కోయిల్ నిన్ఱిఙ్గణే పోన్దరుళి కోప్పుడైయ
సీరియ సిఙ్గాసనత్తిరిన్దు యామ్‌వన్ద
కారియమ్ ఆరాయ్‌న్దరుళేలోరెమ్‌పావాయ్!


తెలుగులో 

వానాకాలంలో కొండగుహలో పడుకుని నిద్రపోతున్న
గొప్ప సింహం మేలుకుని తీక్ష్ణంగా చూసి
నిక్కబొడుచుకున్న జూలును అటూ, ఇటూ విదిలించి
ఒళ్లు విరుచుకుని గర్జించి కదిలి
సాగినట్టుగా అంజనీ పుష్పవర్ణుడా! నువ్వు నీ
కోవెల నుండి ఇక్కడికి వచ్చేసెయ్;
దంతాలు పొదిగిన సింహాసనంలో కూర్చుని మేం వచ్చిన
పనేంటో సమీక్షించి అనుగ్రహించు; ఓలాల నా చెలీ!


అవగాహన 

తొట్ట తొలి పాసురమ్‌లో కృష్ణుణ్ణి యశోదకు సింహకిశోరుడు అని అన్నాక ఆణ్డాళ్ ఈ పాసురమ్‌లో కృష్ణుణ్ణి మగసింహంతో పోల్చి చెబుతోంది‌. 

అన్నమయ్య కూడా  వేంకటేశ్వరుణ్ణి సింహం అంటూ ఇలా అన్నారు: 

"మలసీఁ జూడరో మగసింహము 
అలవి మీఱిన మాయల సింహము 

అదివో చూడరో ఆదిమ పురుషుని 
పెదయౌభళము మీఁది పెనుసింహము 
వెదకి బ్రహ్మాదులు వేదాంతులు 
కదిసి కానఁగలేని ఘనసింహము 

మెచ్చి మెచ్చి చూడరో మితిమీఱినయట్టి 
చిచ్చిఱ కంటితోడి జిగిసింహము 
తచ్చిన వారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి 
నచ్చిన గోళ్ళ శ్రీనరసింహము 

బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు
అంకపు దనుజ సంహార సింహము 
వేంకట నగముపై వేదాచలముపై 
కింక లేక వడిఁ బెరిగిన సింహము‌" 

"అంజనీ పుష్పవర్ణుడా" అని కృష్ణుణ్ణి అంది ఆణ్డాళ్.
అంజనీ ఒక అరుదైన పువ్వు. ఇది ముదురు నీలం రంగులో ఉంటుంది.‌ కృష్ణుణ్ణి ఇలా అంజనీ పుష్పవర్ణుడా అని గొప్పగా ఒక్క ఆణ్డాళ్ మాత్రమే అందేమో? 

నీ అనుగ్రహం పొందడమే మా పని అందుకే వచ్చాం ఆ విషయాన్ని సమీక్షించి అనుగ్రహించమని కృష్ణుణ్ణి కోరుతోంది ఆణ్డాళ్. ఎనిమిదో పాసురమ్‌లో గోపకన్యతో "దేవాదిదేవుణ్ణి దగ్గఱికెళ్లి మనం నమస్కరిస్తే ఆహా అని సమీక్షించి అనుగ్రహిస్తాడు" అని చెప్పిన ఆణ్డాళ్ ఇక్కడ సమీక్షించి అనుగ్రహించమని కృష్ణుణ్ణి సూటిగా కోరుతోంది. ఈ సందర్భంలో అన్నమయ్య చెప్పిన "శరణు చొచ్చుట నాది సరుఁగ గాచుట నీది" మాటలు గుర్తుకు వస్తున్నాయి. క్రితం పాసురమ్‌లో శరణు కోరి వచ్చాం అని చెప్పుకున్నాక ఈ పాసురమ్‌లో అనుగ్రహించమని కోరుతోంది ఆణ్డాళ్.


రోచిష్మాన్
9444012279

ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన  తమిళ్ష్ పాసురమ్ 23

https://youtu.be/1SSDhza2Ot0?si=tQ-lUNGzVqQc7Qnp

No comments:

Post a Comment