🙏🙏🙏🙏🙏🙏🙏
*సాధకులారా! ఒక్కక్షణం...*
సాధకులు అనేకమార్గాల్లో తమ గమనమును సాగిస్తారు. ఎవరి అభిరుచికి తగినట్లుగా వారు ఓ మార్గాన్ని అవలంభిస్తారు. ఏ మార్గంలో గమనమున్న అందరి గమ్యామూ, లక్ష్యమూ ఒక్కటే. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలు వేరువేరు కానీ; అన్నిమార్గాలు భగవంతున్ని చేరుకోవడం కోసం నిర్ధేశింపబడినవే. అన్ని మార్గాలు పరమాత్మ బోధించినవే.
ఇన్ని మార్గాలు ఎందుకు చెప్పారంటే, మన ప్రవృత్తిని బట్టి తగినదానిని అనుసరించటానికి. ఏదీ ఎక్కువ కాదు, తక్కువా కాదు. ఎవరి యోగ్యత బట్టి, అర్హతకు అణుగుణంగా ఆ మార్గంలో నడిపిస్తాడు. మనమో మార్గంలో వెళ్తున్నామంటే, అది ఆ భగవంతుని ప్రేరణే. ఎవరు ఏ మార్గంలో సమర్ధవంతంగా నడవగలరో, వారిని ఆ మార్గంలో నడిపించేది ఆ భగవంతుడే.
అయితే ఏ మార్గంలో పయనించిన సడలని విశ్వాసంతో, దృఢసంకల్పంతో, శ్రద్దగా వెళ్ళగలిగితే- భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు, నాతో ఉన్నాడు అన్న భావన క్రమేపి మాయమై, భగవంతుడే ఆత్మస్వరూపుడై మనలో ఉన్నాడు, మనలా నడుస్తున్నాడన్న భావనామయప్రజ్ఞ కలుగుతుంది. ఉన్నది ఉన్నట్లు ఎరుకై సర్వమూ శివమౌతుంది.
అయితే కొందరు భగవంతుని యందు ప్రేమ(భక్తి)తో సాధన ప్రారంభం చేసి, ఆ సాధన గొప్పది, ఈ సాధన గొప్పది, మా సాధనామార్గం గొప్పదన్న తారతమ్యభావన కనబర్చడం సమంజసమా? చేసేది, చేయించేది ఆ భగవంతుడే అన్న భావనను విస్మరించి వ్యక్తిగత అభిప్రాయాలతో మాట్లాడడం సముచితమా?
1. తాను, తన చుట్టూ ఉన్న ఈ జగత్తు, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్న జ్ఞాని, మంత్రజపాలు, నామస్మరణలు, విగ్రహారధనలు చేయడు. కేవలం భక్తునికి మాత్రమే ఇలాంటి పరితపన. అంతిమక్షణాల్లో కూడ శివారాధన చేస్తున్నారంటే అటువంటి వారు పరమభక్తులే గానీ జ్ఞానికాదు...అని కొందరి వ్యాఖ్యానం.
2. ఓ ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. అందుకు వనరులు సమకూర్చుకుంటాం. పునాదులు వేస్తాం. చక్కటి ఇల్లు కట్టుకుంటాం. సౌఖ్యంగా అందులో ఉంటాం. ఇల్లు నిలబడేంతవరకే పునాదిని గుర్తిస్తాం. ఇల్లు కట్టాక, రోజూ పునాదిని చూస్తామా, తలుస్తామా? అలానే నామం, జపం, విగ్రహం అనే వనరులుతో భక్తనే పునాదులు వేసి, ఆపై జ్ఞానమనే గృహంలో ప్రవేశించాక, పూజాదికాలు అనవసరం. ప్రారంభంలోనే అవన్నీ. భక్తిమార్గం విడిచి జ్ఞానమార్గం పట్టాలి గానీ, ఇంకా భక్తి, పూజలు, నామజపాలు అనుకుంటే ఏం ఎదుగుతారు?
3. భగవంతున్ని సామాన్యులు విగ్రహాల్లో పటాల్లో చూస్తూ నామ, మంత్రజపాలు చేస్తుంటారు. ఇది భక్తిస్థాయి. కానీ, జ్ఞానసాధకులు ప్రపంచమంతా పరమేశ్వరున్ని చూస్తారు కాబట్టి, పూజాదికాలు అవసరం లేదు. శ్రీ రమణమహర్షి ఏనాడైన మంత్రోపదేశాలు విగ్రహారాధనలు చేసారా? సత్యం నిరాకారం. అది గ్రహించినచో నామజపాలు, పూజలు వుండవు.
4. ఏ రోజుకారోజు స్వీయపరిశీలనలు, స్వభావదోషనిర్మూలనలు అనుకుంటే ఎన్ని జన్మలు ఎత్తాలో లక్ష్యసాధనకై.
ఇలా...ఎనెన్ని వాదనలో తమమార్గమే అనుసరణీయమని.
నేనొక అతి సామాన్య ఆధ్యాత్మ సాధకుడిని. ఇటువంటి ప్రశ్నలకు బదులిచ్చేశక్తి నాకు లేదుగానీ, ఇటువంటి వాదనలు విన్నప్పుడు నాలో ఎన్నో ఎన్నెన్నో భావాలు సాధారణ స్థాయి నుంచి విపరీత వైపరీత్యాల వరకు
క్రిందుమీదులాడుతూ నను నిలకడగా ఉండనీయవు. మరి అనుభవజ్ఞులు దయచేసి వివరం విశదం చేయగలిగినచో…. హృదయాంతరంగంలో ప్రశాంతత నెలకొంటుంది లేనిచో…. అంతవరకు నేనొక నిరంతర ఆనందవిహారి.
🙏💞🙏💞🙏💞🙏
No comments:
Post a Comment