Tuesday, January 13, 2026

 -------------
కె.జే. ఏసుదాస్ - ఒక సందేశం
---------------------‌-

ఏసుదాస్ జన్మదినం సందర్భంగా....

కులం, మతం వీటికి అతీతంగా ఎదిగిన మనుషులు ఎంతో గొప్పవాళ్లు. ఆ గొప్పవాళ్లలో 'జీవిస్తున్న చరిత్రలు'గా మెదులుతున్నవాళ్లు కొందరున్నారు. కులం, మతం వీటికి అతీతంగా విజయ చరిత్రగా మెరుస్తున్న వాళ్లలో ప్రముఖుడు కె.జే. ఏసుదాస్.

ప్రతిభతో, పరిశీలనతో, పరిశ్రమతో, తెలివితో, తెలివిడితో, సాధనతో, విద్యతో, విద్వత్తుతో, విజ్ఞతతో, సృజనాత్మకతతో, నిర్మాణాత్మకతతో, ఉత్పాదకతతో ఉన్నతంగా, స్ఫూర్తిదాయకంగా రాణించారు, రాజిల్లుతున్నారు కె.జే. ఏసుదాస్.

సమాజంలో అన్ని రకాలుగానూ కిందిదైన స్థాయిలో పుట్టి, ఎన్నో తిరస్కారాలను, అవరోధాలను, అవహేళనలను, అవమానాలను అనుభవించి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ అత్యున్నత స్థానంలో నిలిచి ఉన్నారు కె.జే. ఏసుదాస్. 

కేరళలో ఏసుదాస్ చిత్రపటాలు వాడవాడలా అంగడుల పేరు పలకల్లోనూ, వ్యాపార స్థలాల్లోనూ కొలువు తీరి ఉంటాయి. మలయాళంలో అత్యధికమైన ప్రజాభిమానం ఉన్న ఏసుదాస్ తమిళ్ష్, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లోనూ ప్రజల అభిమానానికి పాత్రుడైన ప్రజా గాయకుడు. అద్భుతమైన గాత్రంతో, గానంతో ప్రాంత, భాష, దేశాలను దాటి కోట్లాది ప్రజలకు చెందిన ప్రజా గాయకుడు. 

కులం... మతం... కె.జే. ఏసుదాస్ కులం, మతం జీవి కారు.  కులాతీత, మతాతీత, కళాకారుడై మహోన్నతంగా విలసిల్లుతున్నారు; ఏసుదాస్.
ప్రజా కళాకారుడై విలసిల్లుతున్నారు ఏసుదాస్. ప్రజా గాయకుడు, ప్రజా కళాకారుడు అంటే ఇదిగో ఊ ఏసుదాసే!

"కళ కులం కుళ్లుతో ఉండదు; కళ మతం మంటతో ఉండదు"

ప్రజా కవులు, ప్రజా గాయకులు, ప్రజా కళాకారులు అంటే మన తెలుగులో అంటున్నట్టుగా, అనుకుంటున్నట్టుగా ఏదో ఒక వర్గానికి సంబంధించిన వాళ్లు, హింసా వాదులు, నక్సలైట్లు, ప్రజా కంటకులు, ప్రజలకు పనికిరానివాళ్లు, ప్రజలు మెచ్చనివాళ్లు, ప్రజలతో కలవనివాళ్లు, ప్రజలు తిరస్కరించినవాళ్లు కాదు. ప్రజా కవులు, ప్రజా గాయకులు, ప్రజా కళాకారుల విషయంలో తెలుగులో ఉన్న అజ్ఞానం, మోసం, అపాయకరమైన పరిస్థితి ప్రపంచంలో మరెక్కడా  లేదు! 

కుల, మతాలకు అతీతంగా అత్యంత విజయవంతమైన ఏసుదాస్ వల్ల పలువురికి జీవనోపాధి లభించింది. ఏసుదాస్ వల్ల కోట్లాది రూపాయల సంపద సృజించబడింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పలువురి ఆకలిని తీర్చగలిగారు, పలువురికి జీవితాలను ఇవ్వగలిగారు ఏసుదాస్. కులం, మతం తుచ్ఛులవల్ల ఎవరి ఆకలీ తీరదు, ఎవరికీ జీవనోపాధి దొరకదు. కుల, మతాతీత వ్యక్తిగా పలు సామాజిక మేళ్లు చేశారు ఏసుదాస్, 

ఏసుదాస్ బ్రాహ్మణుడు, హిందువు కాదు. 
అగ్రవర్ణాలు అని  అనబడుతున్న ఏ వర్గానికో చెందినవారు కాదు. ఒక వ్యక్తికి అగ్రవర్ణం, అధమవర్ణం అన్నవి జన్మతః ఉండవు. జీవన విధానంవల్లే, జీవన ప్రమాణాలవల్లే అగ్రత్వం, నిమ్నత్వం వస్తాయి. ఈ సత్యానికి నిలువెత్తు సాక్ష్యం, రుజువు ఏసుదాస్. 

క్రైస్తవుడైన ఏసుదాస్ హైందవాన్ని అందుకున్నారు. 
ఏసుదాస్ బ్రాహ్మణ్యంతో జీవిస్తున్నారు! ఏసుదాస్ జన్మతః బ్రాహ్మణుడు కాకపోయినా హిందూ బ్రాహ్మణ భాషనే మాట్లాడతారు! తన మాతృభాష మలయాళాన్నే కాదు తమిళ్ష్ భాషను కుడా బ్రాహ్మణ తీరులోనే మాట్లాడతారు. మామూలు మనుషులుగానూ, చదువుతోనూ, ప్రతిభతోనూ, మనోవికాసంతోనూ, సంస్కారంతోనూ, సభ్యతతోనూ, తిన్నగానూ బతకలేక కులంతో, మతంతో మాత్రమే బతికే కులం, మతం జీవులకు ఏసుదాస్ సరైన సందేశం. మనిషి బతకాల్సింది కులం, మతం ఆధారంగా కాదు అన్న విజ్ఞతకు ఏసుదాస్, మార్గదర్శకం. 

జీవన విధానం, ఆలోచనా విధానం, క్రమశిక్షణ ఒక వ్యక్తికి కాలక్రమంలో ఏ మేరకు రూపాంతరాన్ని ఇస్తాయో ఏసుదాస్ రూపాన్ని పరికిస్తే సరిగ్గా తెలియవస్తుంది. ఒకప్పటి అంటే యవ్వన దశలోని ఏసుదాస్ ఫోటోలను ఇవాళ్టి ఫోటోలను గమనిస్తే ఆయనలో బ్రాహ్మణ్యం లేదా ఒక ప్రత్యేకమైన శోభ ఏ మేరకు వచ్చిందో తెలుస్తుంది. అది ఆయన తత్త్వంతోనూ, వ్యక్తిత్వంతోనూ వచ్చిన ఉన్నతమైన పరిణామం.

కులానికి, మతానికి అతీతంగా తాను ఎన్నుకున్న బ్రాహ్మణ్యంతో లేదా సనాతనంతో మాన్యతతో పరిఢవిల్లుతున్న ఏసుదాస్, రానున్న తరాలకు కనువిప్పు. కుల, మతాలకు అతీతంగా విజయవంతమూ, చరితార్థమూ అవడం ఎలా అన్న ప్రశ్నలకు నికార్సైన సమాధానం ఏసుదాస్.

ఇవాళ మనలో కులం, మతం జీవులుగా హేయంగా బతుకుతూ సాటి మనిషికి, సమాజానికి హానికరంగా బతుకుతున్న అసాంఘీక, అనైతిక వ్యక్తులు ఏసుదాస్ జీవితాన్ని అవగతం చేసుకుని మానసిక ఆరోగ్యవంతులుగానూ, మామూలు మనుషులుగానూ మారాలి. కులం, మతం వ్యక్తులు ఏసుదాస్ జీవితాన్ని ఆకళింపు చేసుకుని బుద్ధి తెచ్చుకుంటే మన దేశానికి, మన సమాజానికి, సగటు మనిషికి జరుగుతున్న, జరుగనున్న హాని తప్పిపోతుంది; జరగాల్సిన మేలు జరుగుతుంది.

'రిజర్వేషన్స్ జీవితం కాదు మనిషికి రివరెన్షల్ జీవితం కావాలి' ... అందుకు ఏసుదాస్ జీవితం ఒక సందేశం.

రోచిష్మాన్
9444012279

No comments:

Post a Comment