* అభివాదం అంటే?
* ఆణ్డాళ్, అన్నమయ్య పోలికలు
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
24
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 24
సింహాసనంపై ఆసీనమవమని క్రితం పాసురమ్‌లో కోరుకున్నాక, ఆసీనుడైన కృష్ణుడికి తదుపరి విజ్ఞాపనగా ఆణ్డాళ్ ఇరవైనాలుగో పాసురాన్ని అందించింది; మనమూ అందుకుందాం రండి...
మూలం
అన్ఱు ఇవ్వులగమ్ అళన్దాయ్ అడిపోఱ్ట్రి;
సెన్ఱఙ్గుత్ తెన్నిలఙ్‌గై సెఱ్ట్రాయ్ తిఱల్ పోఱ్ట్రి;
పొన్ఱచ్ చగడమ్ ఉదైత్తాయ్ పుగళ్ష్ పోఱ్ట్రి;
కన్ఱు కునిలాయ్ ఎఱిన్దాయ్ కళ్షల్ పోఱ్ట్రి;
కున్ఱు కుడైయాయ్ యెడుత్తాయ్ గుణమ్ పోఱ్ట్రి;
వెన్ఱు పగై కెడుక్కుమ్ నిన్‌కైయిల్ వేల్ పోఱ్ట్రి;
ఎన్ఱెన్ఱుమ్ సేవగమ్ ఏత్తిప్ పఱై కొళ్వాన్
ఇన్ఱు యామ్ వన్దోమ్ ఇరఙ్గేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
ఆనాడు ఈ లోకాన్ని కొలిచావు పాదానికి అభివాదం;
వెళ్లి దక్షిణాన ఉన్న లంకను నాశనం చేశావు ధైర్యానికి అభివాదం;
ధ్వంసమయ్యేట్టు శకటాన్ని తన్నావు యశస్సుకు అభివాదం;
ఉండేలు రాయిలాగా దూడను విసిరేశావు మువ్వలకు అభివాదం;
కొండను గొడుగులా ఎత్తావు గుణానికి అభివాదం;
గెలిచి విరోధుల్ని నిర్మూలించిన నీ చేతి శూలానికి అభివాదం;
అన్ని వేళలా నీ వీరాన్ని కీర్తిస్తాం; తప్పెటను తీసుకోవాడానికి
ఈనాడు మేం వచ్చాం అనుగ్రహించు; ఓలాల నా చెలీ!
అవగాహన
గోత్ర నామాలు చెప్పి పాదాలకు నమస్కరించడం అభివాదం అవుతుంది. కృష్ణుడికి అభివాదం చేస్తూ
ఈ పాసురాన్ని రూపొందించింది ఆణ్డాళ్.
"ఆనాడు ఈ లోకాన్ని కొలిచావు..." అంటూ వామనావతారంలో పాదంతో లోకాన్ని కొలిచిన ఉదంతాన్ని చెప్పింది ఆణ్డాళ్. "ఈ పాదమే కదా యిలయెల్ల కొలిచినది" అనీ, "చెలఁగి వసుధఁ గొలిచిన నీ పాదము" అనీ అన్నమయ్య కూడా అన్నారు.
"వెళ్లి దక్షిణాన ఉన్న లంకను నాశనం చేశావు" అని రామావతారంలో లంకను నాశనం చేసిన ఉదంతాన్నీ, "ధ్వంసమయ్యేట్టు శకటాన్ని తన్నావు" అని శకటాసుర సంహారాన్నీ చెప్పింది ఆణ్డాళ్. "పగటునఁ దనమీఁదఁ బారవచ్చిన బండి
పగుఁల దన్నినవాఁడు..." అని అన్నమయ్య కూడా అన్నారు.
"ఉండేలు రాయిలాగా దూడను విసిరేశావు" అని అంటూ దూడ రూపంలో తనను చంపడానికి వచ్చిన వత్సాసురుణ్ణి చెట్టుకు గుద్దుకుని చచ్చిపోయేట్టు కృష్ణుడు విసిరేస్తాడు. ఆ విసిరెయ్యడాన్ని ఉండేలు (ఒడిసెల)తో రాయిని విసిరి కొట్టినట్టు అని ఆణ్డాళ్ గొప్పగా చెప్పింది. "కొండను గొడుగులా ఎత్తావు" అని అంటూ గోవర్ధనగిరిని ఎత్తడాన్ని చెప్పింది ఆణ్డాళ్.
"గుట్టున ఆవుల కొఱకు వేలనే కొండ
పట్టి యెత్తిన వాఁడు..." అని అన్నమయ్య కూడా అన్నారు.
వ్యక్తిగత కారణాలు, అవసరాల కోసం కాకుండా పశువుల్నీ, గోకుల వాసుల్నీ కాపాడుకోవడానికి కృష్ణుడు ఏడునాళ్లు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నాడు. అది దయా గుణం. అందుకే ఆణ్డాళ్ ఈ సందర్భంలో "గుణానికి అభివాదం" అని అంది; అదీ ఆణ్డాళ్ గొప్పతనం. "గెలిచి విరోధుల్ని నిర్మూలించిన నీ చేతి శూలానికి.." అంటూ కృష్ణుడు విరోధుల్ని చంపినవాడు అని తెలియజేస్తోంది. "అన్ని వేళలా నీ వీరాన్ని కీర్తిస్తాం; తప్పెటను పొందడానికి ఈనాడు మేం వచ్చాం, అనుగ్రహించు" అని అడుగుతోంది ఆణ్డాళ్.
తొట్టతొలి పాసురమ్‌లో "నారాయణుడే మనకు తప్పెటను ఇస్తాడు" అని చెప్పింది ఆణ్డాళ్. ఇక్కడ నేరుగా కృష్ణుణ్ణి తమకు ఆ తప్పెటను ఇవ్వమంటోంది. తప్పెట అనేది అనుగ్రహానికి ప్రతీక. అనుగ్రహాన్ని అనుగ్రహించమని దైవాన్ని అర్థిస్తోంది ఆణ్డాళ్.
"అభివాదం, అభివాదం..." కృష్ణుడి పాదానికీ, ధైర్యానికీ, యశస్సుకూ, మువ్వలకూ, గుణానికీ, శూలానికీ "అభివాదం" అంటూ ఇక్కడ సాంద్రమైన రచనా సంవిధానాన్ని ప్రకటించింది ఆణ్డాళ్.
ఆణ్డాళ్ ఈ పాసురమ్ మొదటిపంక్తిని 'ఆనాడు' అనే పదంతో మొదలుపెట్టి చివరి పంక్తిని 'ఈనాడు' అనే పదంతో మొదలుపెట్టింది. రచనా సంవిధానంపై ఉన్నతమైన అవగాహన ఉన్నవాళ్లే ఇలా చెయ్యగలరు. గొప్ప శైలితో, శిల్పంతో ఈ పాసురాన్ని పండించింది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 24
https://youtu.be/0fwtvzyayKw?si=IXFP5IMBFIFQ_y4y
No comments:
Post a Comment