*ఏకేశ్వరోపాసన, బహు దేవతారాధనలలో ఏది ఉత్తమం? అయినా ఒక్క రూపం చాలదా? ఇన్ని రూపాలు ఎందుకు?*
ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా ఏ వ్యత్యాసము లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే కాని, రూపాలు నామాలు అనేకం.
ఆ రూపాల వెనుక ఉండే చైతన్యం మాత్రం ఒక్కటే కాబట్టి, మనం ఈశ్వరుడిని అభిషేకించినా, విష్ణువుని అర్చించినా, అమ్మని ఆరాధించిన మనకు లభించిన అనుగ్రహంలో ఎటువంటి తేడా ఉండదు. ఆకాశాత్పతితం తోయం యధాగచ్ఛతి సాగరం సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి...అంటారు శంకర భగవత్పాదులవారు. ఆకాశం నుంచి జాలువారే ప్రతి చిన్న నీటి బిందువూ అంతిమంగా సముద్రాన్ని చేరి లేనమైనట్లే, మనం ఏ దేవుడికి నమస్కరించినా, ఆరాధించినా, అవన్నీ అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకే చేరతాయి.
ఒక వ్యక్తి ఒకరికి కొడుకు, మరొకరికి సోదరుడు, మరొకరికి స్నేహితుడు, మరొకరికి భర్త, మరొకరికి తండ్రి, ఇంకొకరికి తాత...ఇలా పలు బంధాల్లో వ్యక్తమై, పలు పేర్లతో అభిమానింపబడినప్పుడు;
పరమాత్మ పలు రూపాల్లో వ్యక్తమై, పలు పేర్లతో ఆరాధింపబడడంలో అభ్యంతరమేముంది?
సాధకుడిని అనుగ్రహించడానికి భగవంతుడు ఎవరి స్థాయిలో వారికి, వారికి రుచించిన రూపాల్లో వస్తాడన్నది ఆది శంకరులవారి మాట. ఈ ఉపాసనలు అన్నీ, ఆరాధనలు అన్నీ, రూపాలు అన్నీ, నామాలు అన్నీ అద్వైతం లోనికి చేరడం కోసమే. మనలో ఆత్మశక్తికి ఒక కొనసాగింపే ఈ ఆరాధనలు. ఈ ఆరాధనల కొనసాగింపే ఏకత్వం...అద్వైతం!
ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అడుగుతారు గానీ, ఎప్పుడైనా ఇన్ని రకల పండ్లు ఎందుకని, ఇన్ని రకాల కూరగాయలు ఎందుకని ఇన్ని రకాల రుచులెందుకని ఎవరైనా ఎందుకు ప్రశ్నించుకోరు?
🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment