*విగ్రహం అంటే మృణ్మయమూర్తి కాదు, చిన్మయమూర్తి!*
వేదం "ఏకం సత్" అని చెపుతుంటే, ఇందరు దేవుళ్ళు ఏమిటి? ఇన్ని రకాల దేవాలయాలు ఏమిటి? శైవ వైష్ణవ శాక్తేయ వైషమ్యాలు ఏమిటి?
ఇలా ప్రశ్నలు ఎన్నో... ఇలా అడిగిన వారికి తగు సమాధానాలు మన శాస్త్రాలు, ప్రవచనకారులు, పెద్దలు చెప్తున్నప్పటికీ సందేహాలు వస్తూనే ఉన్నాయి. నేను చదివిన, విన్న వాటి ద్వారా నా అవగాహన మేరకు కొంత సమాచారం ఈ టపాలో -
"ఏకం సత్" అని వేదం చెప్పిన మాట నిజం. ఉన్నదొక్కటే. అదే సత్యం. అదే నిత్యం. అదే పరమాత్మ. అదే నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్యం.
పరమాత్మ నిర్గుణ నిరాకార విశుద్ధ విశ్వ చైతన్య శక్తిగా ఏకత్వం గానే ఉంటే, ఈ సృష్టే లేదు, ఈ జగత్తే లేదు. దేవుడు లేడు, జీవుడు లేడు. కానీ, పరమాత్మ సంకల్పించాడు.
ఆ సంకల్పానుసారమే ఈ సృష్టి స్థితి లయలు... ఈ సగుణ సాకారాలు.
అందుకే వేదం పరమాత్మను "త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం .... ప్రజాపతిః" "స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సో క్షరః పరమః స్వరాట్" అని కూడా ప్రవచించింది. అంతియే కాదు, "త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం, త్వం బ్రహ్మ భూర్భువస్స్వరోమ్" (నువ్వే బ్రహ్మవి, విష్ణువివి, రుద్రుడవు, అగ్నివి, వాయువువి, సూర్యుడవు, చంద్రుడవు, భూమి ఆకాశం అంతటా ఉన్న పరబ్రహ్మవి...అని ఈ శ్లోకం భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, అన్ని రూపాలలోనూ ఆయన ఉనికిని తెలియజేస్తుంది)అని అభివర్ణించింది.
ఏకో విష్ణుః మహద్భూతం ప్రుదాగ్భూతా న్యనే కశః ...ఇత్యాది వాక్యాలన్నీ ఏకత్వం పొందిన అనేకత్వాన్ని తెలియజేస్తున్నాయి. మరి వేదం చెప్పిన ఆ ఒక్క వాక్యాన్నే కాదు, ఈ వాక్యాలను పరిగణలోనికి తీసుకోవాలి కదా.
దేశ వ్యవస్థ సవ్యంగా నడపడానికి దేశాధినేత, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు... ఇలా ఎలా అవసరమో, సృష్టి క్రమంలో కూడా అనేక రూపాలు అంతే అవసరం.
ఒకసారి వివేకానందులవారిని ఒకరు అడిగారట, భగవంతుడు ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? ఇన్ని రకాల విగ్రహాలు ఎందుకని...
బంగారం ఒక్కటే గానీ, ఆభరణాలు అనేకం. ఎవరి అభిరుచి బట్టి ఆయా ఆభరణాలు ఉంటాయి. అలాగే భగవంతుడు ఒక్కడే అయినా, మేం మాకు కావలసిన రూపులో తలచుకొని ఆరాధిస్తుంటాం. భక్తుల భావాలు బట్టే భగవంతుడు రూపాలు ధరిస్తాడు అని చెప్పారట.
💚💞💚💞💚💞💚💞💚
No comments:
Post a Comment