🔱 *ప్రభాత గుళిక* 🔔
# సృష్టికర్త సౌందర్యం...
🍁మనసు పెట్టి మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అపారమైన అందాలను గమనించారా? ఆ అందమే ఆనందానికి మూలం. మైమరపించే పరిమళాలతో రకరకాల పువ్వులు... సంగీత సరాగాలను ఆలపించే పక్షులు! ముద్దులొలికే చెవుల పిల్లులు, పురి విప్పి ఆడే నెమళ్లు, చిన్నా పెద్దా రకరకాల జంతువులతో విస్తరించిన అరణ్యాలు... అన్నీ ప్రకృతి అందాలలోని భాగాలే.
🍁 చెట్లు, ఆకాశం, భూమి, సముద్రాలు, గలగలమని గానం చేస్తూ ప్రవహించే నదీనదాలు, లోతైన లోయలు, ఎత్తైన కొండలతో ప్రకృతి సౌందర్యం హృదయాన్ని ఊయలలూగిస్తుంది. ఇవన్నీ భూమికి దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతులు. మన తిండి, బట్ట, నీడ... అన్నీ ప్రకృతి ప్రసాదాలే. ఈ ప్రకృతి మానవాళికి చాలా ముందు నుంచి ఉనికిలో ఉంది. ఈ ఉనికికి... అది ఇచ్చే ఆనందం ఆహ్లాదానికి కారణం ఎవరు... ఎవరా సృష్టికర్త? ఆయనలోని సౌందర్యమెంత! ఆ పారమార్థిక సోయగమెంత... సొగసెంత? విశ్వాంతరాళాల్లోని రహస్యాలు ఎంత అద్భుతాలో దైవం అంతకన్నా అద్భుతమంటారు. ఆ అద్భుతాన్ని వేదాంతం (ఉత్కృష్ఠ జ్ఞానం) వల్ల తెలుసుకోగలమని చెబుతారు. ఈ జ్ఞానంలోనే దైవశక్తినీ ఆ సౌందర్య లాలిత్యాలనూ నిర్వచించారు.
🍁 దైవంలోని అందాలు వర్ణనకు అతీతమైనవని అపర విద్య తెలుపుతోంది. దైవం అందాన్ని ఊహించుకుంటే ఒక ప్రామాణికమైన రూపం తోచదు. అందుకే తాళ్లపాక అన్నమయ్యకు వేంకటేశ్వరుడి సొగసులు సొబగులు ఒకేరకంగా కనిపించలేదు. 'ఒకపరి కొకపరి కొయ్యారమై మొకమున కళలెల్ల మొలచినట్లుండే' అంటూ భావోద్వేగం చెందాడు. ఆ రూపసి అందాలను వర్ణిస్తూ 'జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి/జిగికొని నలువంక చిందగాను/ మొగి చంద్రముఖి నురమున నిలిపెగాన/ పొగరు వెన్నెల దిగబోసినట్లుండే' అని భావించాడు. భావమే ఇంత గొప్పగా ఉంటే.. నిజరూపం వర్ణించ తరం కాదు. సృజనకారుడి సౌందర్యం ఇంత గొప్పగా ఉంటే...
🍁ఆ శక్తి సృజించిన ప్రకృతి అందాలు ఇంకెంతో పారవశ్యం కలిగిస్తాయి త్యాగయ్య శ్రీరాముణ్ని కీర్తిస్తూ 'సొగసు జూడ తరమా/నీ సొగసు జూడ తరమా! వర బింబ సమాధరము వకుల సుమంబుల ఉరము/కర ధర్త శర కోదండ మరకతాంగ వరమైన..' అంటూ పొగిడాడు. తన దైవాన్ని మరింత కీర్తిస్తూ... 'రామ నీ సమానమెవరు/ భామ మరువంపు మొలక/ భక్తియను పంజరపు చిలుక అంటూ మొలక, చిలుకలతో పోల్చాడు. వర్ణనకు అందనంత లావణ్యం లాలిత్యం కలగలిపిన ఆ దైవశక్తిని ఇంతని వర్ణించలేం. ఆ ఈశ్వరుడు అమర్చిన ఈ లోకానులోకాలు, ఈ ప్రకృతి... జీవరాశులన్నింటికీ అందంగా కనిపిస్తూ ఆనందాలను పంచుతున్నాయి. కాబట్టే వాటిని మనం ఆస్వాదించగలుగుతున్నాం.🙏
⚜️⚜️🌷🌷🌷⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment