* కడుపులో నిప్పై నిలిచింది ఎవరు?
* దైవగానం చేస్తే ఏమౌతుంది?
----------
'సరిగ్గా' తిరుప్‌పావై
25
-------------------
మూలంలోని శైలితో, శిల్పంతో
తెలుగులో సరైన, మేలైన అనువాదంగా తిరుప్‌పావై!
(తిరు అంటే మేలిమి అనీ, పావై అంటే నోము అనీ అర్థాలు. తిరుప్‌పావై అంటే మేలిమినోము లేదా మేలినోము అని అర్థం. తిరు, పావై రెండు పదాలు. తమిళ్ష్ భాష నిర్మాణం ప్రకారం ఈ రెండు పదాల మధ్యలో ప్ వచ్చి తిరుప్‌పావై అని అవుతుంది. తమిళ్ష్‌లో పావై అన్నది పదరూపం కాబట్టి తెలుగులో పా అక్షరానికి ప ఒత్తు పెట్టి తిరుప్పావై అని ప్రకటించడంవల్ల పావై అనే పదరూపం పాడవుతుంది. కనుక తెలుగులోనూ తిరుప్‌పావై
అనే ఉండడం మేలుగా ఉంటుంది.
ఆళ్ష్వార్ పాడిన విష్ణుభక్తి గీతాన్ని పాసురమ్ అని అంటారు. పాసురమ్ అంటే జ్ఞానగీతం అని కూడా అర్థం ఉంది. పాశురం కాదు. తమిళ్ష్ భాషలో శ కారం లేదు. కనుక శు కాదు సు అక్షరం ఉంటుంది. అందువల్ల తెలుగులోనూ సు అక్షరమే ఉండాలి. పాసురమ్ సంస్కృత పదం కాదు. పాసు తరువాత ర కారం పక్కన అనుస్వరం కాదు (తమిళ్ష్ అక్షరాల పక్కన అనుస్వరం ఉండదు) మ కారపు పొల్లు (మ్) ఉండాలి. పాసురమ్ అనడమే సరైంది.)
పాసురమ్ 25
ఆణ్డాళ్ కృష్ణుడికి అభివాదం చేశాక, తప్పెటను తీసుకోవడానికి వచ్చామని మనవి చేసుకున్నాక ఇదిగో ఇలా ఇరవయ్యైదో పాసురాన్ని పలుకుతోంది...
మూలం
ఒరుత్తి మగనాయ్‌ప్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర
తరిక్కిలానాగిత్తాన్ తీఙ్గు నినైన్ద
కరుత్తైప్ పిళ్షైప్పిత్తు కఞజన్ వయిఱ్ట్రిల్
నెరుప్పెన్న నిన్ఱ నెడుమాలే! ఉన్నై
అరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుది యాగిల్
తిరుత్తక్క సెల్వముమ్, సేవగముమ్ యామ్‌పాడి
వరుత్తముమ్ తీర్‌న్దు మగిళ్ష్ న్దేలోరెమ్‌పావాయ్!
తెలుగులో
ఒకామెకు కొడుకువై పుట్టి ఒక రాత్రిలో
ఒకామెకు కొడుకువైపోయి గుట్టుగా పెరుగుతూండగా
సహించలేక చెడు చెయ్యాలనుకున్న
చింతనల్ని చెడగొట్టి, కంసుడి కడుపులో
నిప్పై నిలిచిన మహామోహనా! నిన్నే
అర్థించి వచ్చాం; తప్పెటను ఇచ్చేస్తే
మేలైన విభూతుల్నీ , వీరాన్నీ మేం గానం చేసి
దుఃఖాన్ని తీర్చుకుని సంతోషిస్తాం; ఓలాల నా చెలీ!
అవగాహన
చెప్పడం అన్నది చాల చక్కని రూపాన్ని పొందింది ఈ పాసురమ్‌లో.
దేవకికి కొడుకై పుట్టి ఒక్క రాత్రిలో యశోదకు కొడుకై పోయాడు కృష్ణుడు. దాన్నే "ఒకామెకు కొడుకువై పుట్టి ఒక్క రాత్రిలో ఒకామెకు కొడుకువైపోయి..." అని చెబుతోంది ఆణ్డాళ్. తనకు కీడు చెయ్యాలనుకున్న కంసుడి ఆలోచనల్ని భగ్నం చేసి, ఆ కంసుడికే ముప్పైన వైనాన్ని స్మరించుకుంటూ "చెడు చెయ్యాలనుకున్న చింతనల్ని చెడగొట్టి..." అనీ, "కంసుడి కడుపులో నిప్పై నిలిచిన..." అనీ అంటోంది. కడుపులో నిప్పై అని అనడం గొప్పగా ఉంది. కృష్ణుణ్ణి "మహామోహనా" అని అంటూ "నిన్నే అర్థించి వచ్చాం, తప్పెటను ఇచ్చేస్తే... " అని అంటూ అనుగ్రహాన్ని అర్థిస్తోంది ఆణ్డాళ్. అంతేకాదు "మేలైన విభూతుల్నీ , వీరాన్నీ మేం గానం చేసి దుఃఖాన్ని తీర్చుకుని సంతోషిస్తాం" అంటూ దైవగానం చేస్తే దుఃఖం తీరిపోగా సంతోషం కలుగుతుంది అనే సత్యాన్ని వక్కాణిస్తోంది ఆణ్డాళ్.
రోచిష్మాన్
9444012279
ఎ.ఐ. మూలంగా మిత్రుడు దేవనాద(థ)న్ (శ్రీపూర్ణం) సంగీతబద్ధం చేసిన తమిళ్ష్ పాసురమ్ 25
https://youtu.be/Yn5YpMS2ipQ?si=d5N6swFZquYeuW4v
No comments:
Post a Comment