💦💚💞💚💦 💦💚💞💚💦 💦💚💞💚💦
భక్తులు నాలుగు రకాలుగా ఉంటారని, భక్తిలో వ్యత్యాసం గురించి గీతాచార్యులే చెప్పారు.
1. ఆర్తా - దుఃఖంలో ఉన్నవాడు. శారీరక లేదా మానసిక బాధలతో కలత చెంది, ఆ బాధల నుండి విముక్తి కలిగించమని భగవంతుణ్ణి ఆరాధించేవారు.
2. అర్థార్ధి - భౌతిక సంపదలు, పిల్లల భవిష్యత్తు, కీర్తి... ఇత్యాది కోరికలతో ఆరాధించేవారు.
3. జిజ్ఞాసు - బ్రహ్మం గురించి తెలుసుకోవాలని, ఆత్మజ్ఞానం పొందాలని తపనతో ఆరాధించేవారు.
4. జ్ఞాని - బ్రహ్మం అవగతమై స్వీయ సాక్షాత్కారం పొందినవారు.
మొదటి రెండు రకాల భక్తుల భక్తి సాధారణ భక్తి.
మూడవరకం భక్తులది అచంచలమైన భక్తి. అమితభక్తితో అకుంఠిత విశ్వాసంతో ఎల్లవేళలా ఒకే తపనతో ఉండేవారు. ఉదాహరణ ప్రహ్లాదుడు.
ఆత్మాతత్త్వానుసంధానంతో ఎల్లలు లేని తాత్త్విక ప్రేమ స్థితిలో ఉండేవారు జ్ఞాన భక్తులు.
వివేకానందుడు చెప్పినట్లు, వీరికి ప్రపంచమంతా పూజామందిరమే. బాహ్యాన అంతరాన భగవంతుణ్ణి చూసే ప్రేమ తత్త్వం. ఉదాహరణ గోపికలు.
ఇవన్నీ సాధనా సోపానాలు. మేడ మీదకు వెళ్ళాలంటే ఎలా ఒకో మెట్టు ఎక్కుతామో...అలానే ఇది కూడా. మొదటి మెట్టు భక్తి. చివరి మెట్టు ప్రేమ. భక్తికి పరాకాష్ఠ ప్రేమ.
ఒకసారి కృష్ణుడికి తలనొప్పి రాగా, ఆస్థాన వైద్యులు ఎన్ని ఔషధాలు ఇచ్చినా తగ్గదు. అప్పుడు కృష్ణుడే
భక్తుల పాదధూళి లేపనంగా రాస్తే తగ్గుతుందని చెప్పగా; వైద్యులు, అష్టభార్యలు, అంతఃపుర పరిచారకులు, ద్వారక వాసులు, బంధు మిత్ర సపరివారం...ఎవ్వరూ పాదధూళి ఇవ్వడానికి ముందుకు రారు గానీ, ఏ సంకోచం లేకుండా గోపికలు ఇస్తారు. అదీ అమలిన ప్రేమ.
ఇదీ భక్తికి, అచంచల భక్తికి, ప్రేమకు ఉన్న తేడా.
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment