Tuesday, January 13, 2026

 *అందం- కొంటే వస్తుందా?*
*##################*
మార్కెట్లో దొరికే అనేక వందలరకాల సౌందర్యసాధనాలు అమ్మే కంపెనీలు తమ సాధనాలను నిత్యం క్రమబద్ధంగా వాడుతూవుంటే ఖచ్చితంగా అపురూపమైన అందం ప్రాప్తిస్తుందని తమ వ్యాపార ప్రకటనలద్వారా టీ.వీలలో పత్రికలలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారా లను నిజమనినమ్మి అధికశాతంమంది స్త్రీ పురుషులు వాటిని కొని ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలా ఉపయోగిస్తూ వున్నవారిలో ఏ ఒక్కరి కైనా ఆ సాధనాలవల్ల సౌందర్యం ప్రాప్తించిందా? అని మాత్రం ఏ ఒక్కరు ప్రశ్నించుకోవడంలేదు.

ఒక క్రీము పనిచేయకపోతే మరో క్రీము కొనివాడడం, ఒక షాంపు పడకపోతే మరో షాంపు వాడటం ఇలా ఎప్పటికప్పుడు నిమిష నిమిషానికి రంగులు మార్చే ఊసరవెల్లిలా విరివిగా విడుదలవుతున్న విదేశీ విష సౌందర్యసాధనాలను వాడుతూ కొత్త సౌందర్యాన్ని సాధించలేక పోవ ఉన్న సౌందర్యంకూడా నాశనం చేసుకుంటున్నారు.

కేవలం సౌందర్యం హరించిపోవడమేకాక ఆయా సాధనాలలోని విష రసాయనపదార్థాలు చర్మంలోకి ప్రవేశించి అనేకరకాల వికృత చర్మ వ్యాధులను కలిగిస్తూ కాలగమనంలో దీర్ఘకాలవ్యాధులుగా పరిమణి స్తున్నయ్.

 👉యువతీయువకులారా! పారాహుషార్

ఓ ప్రియాతిప్రియమైన బిడ్డలారా! సౌందర్యంపట్ల మీకున్న మమ కారంతో నలుగురిలో నాజూకుగా కనిపించాలనే తాపత్రయంతో మంచి చెడులను తెలుసుకోలేక నిత్యం మీరు వాడుతూవున్న అనేక సౌందర్య సాధనాలు మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నయ్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి విదేశీ వ్యాపారస్తుల విషప్రచారాలను విస్మరించి సొంత ఇంటి మార్గా లతో స్వప్రయత్నంతో సుమనోహరమైన సౌందర్యాన్ని ఎలా సాధించ వచ్చో తెలుసుకోండి.

 👉కొమ్ముపసుపుతో కోరుకున్న అందం

ప్రాచీన భారతదేశంలో, ఈనాటికీ నవనాగరికతకు దూరంగా వున్న పల్లెల్లో అక్కడక్కడా కొమ్ముపసుపుతో కోరుకున్న సౌందర్యాన్ని పొందిన వారు కనిపిస్తుంటారు. పూర్వం మనఇండ్లలోని స్త్రీలు ప్రతిరోజూ తమ పొలాలలో ప్రత్యేకంగా పండించుకున్న కొమ్ముపసుపు సానరాయి పైన మంచినీటితో గంధం తీసి ఆగంధాన్ని ముఖానికి పట్టించేవారు. ఒకగంటసేపు ఆగిన తరువాత ముఖంకడిగేవారు.

మరికొంతమంది కొమ్ము పసుపుతో పాటు నల్లనువ్వుల పొడిని కూడా కలిసి మంచినీటితో మెత్తగా నూరి ఆమిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒకగంట ఆగి కడిగేవారు. ఈ విధంగా ఒక్క పైసా ఖర్చులేని ఖచ్చితమైన మార్గంతో ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు, మంగు, నల్లని వలయాలు, గుంటలు, సోలి, మొదలైన చర్మవికారాలు రాకుండా, ఒకవేళ వస్తే తగ్గిపోవడానికి కూడా దీనిని ఉపయోగించేవారు.

ఈనాటి ఆధునికులు కూడా పూర్వీకుల అనుభవాన్ని గుర్తుచేసుకొని. ఆచరించి అందాన్ని అందుకొందురుగాక!

👉ఆహార మార్పు అందానికి చేర్పు

ఆహారంవల్లనేఅన్నీసమకూరుతయ్ కాబట్టి, పూర్వం మన పెద్దలు సమతౌల్యమైన శక్తివంతమైన సేంద్రియ ధాన్యాలను కూరగాయలను ఉపయోగించి ఏనాటికీ తరగని సౌందర్య నిధులుగా ప్రకాశించారు.

ఈనాడు మనం రోజూతినే పదార్థాలద్వారా విషం రోజురోజుకు శరీరాలలో పేరుకుపోతూ రక్తంలో కలిసిపోయి శారీరక సౌందర్యాన్ని సర్వనాశనం చేస్తుంది. ఆహారం శుద్ధికాకుండా ఎన్నిఔషధాలు వాడినా ఎన్నిక్రీములు పూసినా అప్పటికప్పుడు తాత్కాలిక సౌందర్యాన్ని పొంద గలరేమోగానీ శాశ్వత అందాన్ని పొందలేరు.

అందువల్ల సాధ్యమైనంతవరకు విషరసాయనాలు వేయకుండా పండించిన పాలిష్ తక్కువగా పట్టించిన బియ్యం, సేంద్రియ ఎరువులతో, పండించిన ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ధాన్యాలు మాత్రమే భుజించి తీరాలి. ఈమార్పు చేసుకోకపోతే ఏ నాటికి కించిత్ అయినా సౌందర్యాన్ని సంతరించుకోలేరు.

No comments:

Post a Comment