🔱 *ప్రభాత గుళిక* 🔱
*చిన్ని చిన్ని ఆనందాలు...*
🍁సంతోషం, ఆనందం రెండూ ఒకటే అనుకుంటాం కానీ రెండిటి మధ్య తేడా ఉంది. అది అనుభూతిపరమైంది. మనిషి జీవితం సంతోషం, ఆనందం, విచారాల మేలు కలయిక! కొన్ని సంఘటనల్లో మనసు నొచ్చుకుని కలత చెందుతుంది. కొన్నిటివల్ల సంతోషం కలుగుతుంది. మరికొన్నిటివల్ల ఆనందం ఉద్భవిస్తుంది. మనసు వెలుపలి పొరల్లో వెలువడే సానుకూల తరంగమే సంతోషం. ఆ తరంగం ఆత్మను తాకితే అది ఆనందం అంటారు తాత్వికులు.
🍁మనకు కావాల్సింది పైపై సంతోషాలు కాదు. లోలోపల విరిసి మురిసే నిత్యానందాలు! అనుభూతి చెంది పరవశించగల మహదానందాలు! అల్పమైనా, అనల్పమైనా ఆనందంవల్ల మనశ్శరీరాలకు కలిగే లాభాలు ఊహాతీతం! కొందరు రాక్షసానందం పొందేవారూ ఉంటారు. ఆ ఆనందం వెంట అపరాధ భావన నీడగా ఉంటుంది. అటువంటివారు దివ్యానుభూతికి నోచుకోలేరు. మనిషి తన జీవితంలో కోరుకోగల సకల సమృద్ధినీ సాధించాడనుకుందాం. అతడికి గనక ఆరోగ్యం లేకపోతే అవన్నీ వ్యర్థమే అన్నది కాదనలేని నిజం! మనిషి సదా ఆనందంగా జీవించే ప్రయత్నం చేయాలంటాయి శాస్త్రపురాణాలు. అవి మనిషిని ఆనంద స్వరూపుడన్నాయి. నిత్యానందంతో జీవించే వ్యక్తి ప్రత్యేకంగా భక్తి ప్రపత్తులు లేకపోయినా భగవంతుడికి చేరువలోనే ఉంటాడన్నది అంతర్లీనమైన భావన. మరో రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితం మాత్రమే మనిషిని ఆనందంగా ఉంచుతుంది. పైసా ఖర్చు లేకుండా సాధించగలిగే ఆత్మానందం ఆధ్యాత్మికత వల్లే ఒనగూరుతుంది.
🍁వీచే చల్లని గాలి, పూచే అందమైన పువ్వు, పీల్చే సుమధుర పరిమళం, ఆలకించే వీనుల విందైన సంగీతం... వీటివల్ల మనిషికి ఆహ్లాదం కలుగుతుంది. అది అనుభూతుల పర్వమై ఆనంద సీమకు దారి చూపుతుంది. ఆనందం వర్ణించ వీలుకాని మధురానుభూతి. ధనవంతుడు ఖరీదైన కారు కొంటే కలిగే ఆనందం, సాధారణ వ్యక్తి సైకిల్ కొనుక్కుంటే కలిగే అనుభూతి కన్నా గొప్పదని చెప్పలేం!
🍁రోజువారి జీవితంలో మనకు ఎన్నో అనుభూతులు కలుగుతాయి. సానుకూలమైన అంశాలు అనుభవిస్తున్నప్పుడు ఆనందం మన సొంతమవుతుంది. అయితే అది కొద్ది సమయమే! దాన్ని శాశ్వతంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనదే! సాధారణ పుష్పాలు దైవానికి సమర్పిస్తే వాడిపోతాయి. వాడిపోని పూలు ఆత్మానుభూతులనుంచి ఉద్భవిస్తాయి. అప్పుడప్పుడు మన మనసుల్లో ఉవ్వెత్తున లేచే కడలి తరంగాల్లాంటి అల్పానందాలను హృదయ సీమకు మళ్లించాలి. ఆనందం హృదయగతమైతే అది స్థిరంగా ఉంటుంది.
🍁ఎందరో మంచి మనసుతో మంచి పనులు చేస్తూ ఆనందానికి చేరువవుతారు. అటువంటి సందర్భాల్లో మనసు సంతృప్త భావనతో నిండిపోతుంది. అల్పానందాలను సైతం అనల్ప భావంతో ఆస్వాదించేలా చేస్తుంది. అందుకే జీవితంలో తరచూ అనుభవంలోకి వచ్చే చిన్ని చిన్ని ఆనందాలను సొంతం చేసుకుంటూ వాటిని హృదయంలో దాచుకోవాలి. అలా నిత్యానందాన్ని సాధన చేసే సాధకుడి జీవితం ఫలవంతం అవుతుంది. అది జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. అందమైన కావ్యంలా మారుస్తుంది.🙏
✍️- ( శ్రీ గోపాలుని రఘుపతిరావు గారి సౌజన్యంతో)
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment