పోరాడాలి... ఇష్టంగా!
వర్షం కష్టాలు ఆకాశంలో మబ్బుల్లాంటివి. కన్నీళ్లు తెప్పిస్తూనే ఉంటాయి. ఆగిపోయినట్లు కాసేపటి తరవాత తెప్పరిల్లుతాం. ఆ సమయం గంటలా, రోజులా, సంవత్సరాలా అన్నది మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. ఎంత తక్కువ సమయంలో అందులోంచి బయటపడితే అంత మంచిది. జీవితమన్నాక కష్టమైనా సుఖమైనా భరించక తప్పదు. మంచిని అనుసరించడం అనే ఒక చక్కటి అలవాటును చేసుకుంటే కష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
భగవంతుడి అవతారమైన శ్రీరాముడికే తప్పలేదు పద్నాలుగేళ్ల అరణ్యవాసం, భార్యా వియోగం. సీతకోసం వెతుకులాట, విరహ వేదన, రావణ సంహారం దాకా అన్నీ కష్టాలే. ఇక తీరాయిలే అనుకునే లోపల మళ్లీ సీతమ్మవారిపై అపవాదు, ఆమెను అడవులకు పంపడం, లవకుశుల ముద్దు ముచ్చట్లను చూడలేకపోవడం... రాముడు సుఖపడిందెప్పుడు? అటువంటప్పుడు మామూలు మనుషులం మనమెలా తప్పించుకోగలం? కష్టం వచ్చిందని సతమతమయ్యేకన్నా దాన్నుంచి బయటపడే మార్గాన్ని వెతకడంపై దృష్టి పెట్టాలి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. అనవసర కాలయాపన చేయకుండా s మార్గాన్ని పట్టుకోవాలి. మనసును కుదురుగా ఉంచుకోగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. కష్టాన్ని వీలైనంత తొందరగా అధిగమించి సుఖాల బాట పట్టడానికి చేసే పోరాటమే జీవనం. ఈ పోరాటం ప్రతి మనిషికీ తప్పనిది. దాన్ని ఇష్టంతో చేస్తున్నామా కష్టంతో చేస్తున్నామా అన్నదానికే ఇక్కడ ప్రాధాన్యం.
శ్రీకృష్ణుడు అంతటివాడు శమంతకమణిని దొంగిలించాడనే అపవాదును ఎదుర్కొన్నాడు. సముద్రంలో ఆటుపోట్లలా కష్టాలు పలకరించి పోతూ ఉంటాయి. కొందరు సుఖాలలో తేలియాడుతున్నప్పుడు కూడా గతించిన కష్టాన్ని తవ్వుకుని మరీ బాధపడుతూ ఉంటారు. దానికన్నా తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే కాస్త మనోబలం పెరుగుతుంది. కష్టాలను పదేపదే గుర్తు తెచ్చుకోవడం వల్ల మనసు కలవరపడి మరింత బలహీనమవుతుంది. వర్తమానంలో జీవించడం ఉత్తమ మార్గం. చీకటి వెంట వెలుగులా కష్టం తరవాత సుఖం వస్తుందని నమ్మాలి. కుటుంబంలోనే కాదు, సన్నిహితుల్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనున్నానని చేయూతనివ్వాలి.
కష్టాల్లో నిండా కూరుకుపోయినప్పుడే చాలామందికి భగవంతుడు గుర్తొస్తాడు. పూజలు చేసినందుకు ప్రతిఫలంగా కష్టాలనిచ్చావా స్వామీ... అంటూ ఆయన్ని నిలదీస్తారు. దేవుడు ఎవరికీ కావాలని కష్టాలో సుఖాలో ఇవ్వడు. అవన్నీ మన కర్మల ఫలితమేనని గుర్తుంచుకోవాలి. 'దుఃఖంలో ఉన్నప్పుడు దేవుణ్ని అందరూ స్మరిస్తారు, సుఖాల్లో మునిగి తేలుతున్నప్పుడు ఎవరూ తలచుకోరు. సుఖంగా ఉన్నప్పుడు కూడా తలచుకుంటే అసలు కష్టాలు ఎందుకొస్తాయి' అంటాడు కబీర్. దానికి అర్థం ఆ పరమాత్మను తలచుకున్నంత మాత్రాన కష్టాలు రాకుండా పోతాయని కాదు, వాటిని తట్టుకునే శక్తి కూడా ఆయనే ఇస్తాడని. అందుకే బ్రోచే భారం నీదే కదా అని ఆయన మీద నమ్మకం ఉంచి జీవితాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించడం అలవరచుకోవాలి.
యలమర్తి అనూరాధ
No comments:
Post a Comment