Monday, May 18, 2026

 హిందూ దేవాలయాలు ఎక్కువగా కొండల మీదనే ఎందుకు ఉన్నాయి ?
తెలుగు రాష్ట్రాలలో ప్రముఖమైన తిరుమల, అన్నవరం, బెజవాడ, భద్రాద్రి, యాదగిరిగుట్ట, … ఇలా కొండలపై ఉన్న దేవాలయాలను చూసి మీరు ఈ ప్రశ్న అడిగివుందవచ్చు. తమిళనాడులో 6 ప్రముఖమైన సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాలు కూడా కొండలమీదే వున్నాయి. ఇంకా చాలా ఆంజనేయస్వామి, నరసింహస్వామి దేవాలయాలు కూడా కొండల మీద కనిపిస్తూ వుంటాయి.

పూర్వం జనావాసాలు ఎక్కువగా నదులు, సరస్సుల ఒడ్డున ఏర్పడేవి - నీటి వసతికోసం. కాని, వర్షాకాలంలో ఆ నదులు, సరస్సులు పొంగిపోర్లడం జరిగితే చుట్టుపట్ల గ్రామాలవారికి ఇబ్బందులు ఏర్పడేవి. ఆ ఇబ్బందుల నుండి రక్షణ కోసం దగ్గరలోని గొండ, గుట్టల మీద శాశ్వత నిర్మాణాలు చేశేవారు. అయితే, సంవత్సరంలో రెండు మూడు నెలలు మాత్రమే వాటి అవసరం వుంటుంది; మిగిలిన కాలంలో అవి నిరుపయోగమే కదా? వాడకుండా వాటిని వదలి పెడితే అవి పాడయ్యే అవకాశం వుంది. ఇంకా, ఎప్పుడూ అలవాటు లేనివారు కేవలం విపత్కర పరిస్టితులలో మాత్రం ఆ కొండలు ఎక్కాలంటే ఆయాస పడిపోతారు. అందుచేత కొండలపై, గుట్టలపై నిర్మించిన ఆ శాశ్వత నిర్మాణాలను దేవాలయాలుగా మారిస్తే, వాటి ఆలనా పాలనా చూసే బాధ్యత ఏర్పడుతుంది; ప్రజలు తరచూ దర్శనానికి కొండలు ఎక్కే అలవాటులోనూ వుంటారు. ఈ విధంగా కొండలపై దేవాలయాలు ఒక రకమైన disaster shelters (సామూహిక ఆపత్కాలీన శరనాశ్రాయాలు) అనుకోవచ్చు.

అయితే, దేశంలోని అన్ని దేవాలయాలూ కొండలమీదే ఉన్నాయా అని చూస్తే, లేవు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఇలా ఎన్నో ప్రముఖమైన దేవాలయాను పరిశీలిస్తే, వాటిలో కొన్ని మాత్రమే కొండలమీద వున్నాయి - ఎక్కువ కొండలమీద లేవు. ఎందుకంటే అపాయాలు ఎప్పుడూ నీటివలననే రావాలని లేదు; అన్ని గ్రామాలలోనూ కొండలు, గుట్టలు ఉండాలనీ లేదు. తమిళనాడులో శ్రీరంగం, బృహదీశ్వరాలయం, మధుర మీనాక్షి ఆలయం, తిరువన్నామలై, చిదంబరం ఇలా పెద్దపెద్ద దేవాలయాలెన్నో నేలపైనే కదా వున్నాయి? కొండలపై కాదు కదా. తమిళనాడులో పూర్వకాలంలో మహాప్రళయం (సునామీ వంటిది) వచ్చినప్పుడు ఇలాంటి నేలపై వున్న దేవాలయాలే అక్కడి ప్రజలకు ఆశ్రయమయ్యాయని చెబుతారు.

ఏది ఏమైనా, దేవాలయాల నిర్మాణం మన సాధారణ గృహనిర్మాణం కంటే పటిష్టంగా జరిపి, సామూహిక జనరక్షక పటిమను కలిగివుండేవనేది స్పష్టం. ప్రస్తుత కాలంలో సదుపాయాలు పెరగడం వలన దేవాలయాని వెళ్ళే ఆశ్రయం తీసుకోవాలనిలేదు అనే భావన పెరగడం వలన దేవాలయాను నాసిరకంగా నిర్మించడం పరిపాటి అయిపొయింది. దేవాలయం మాట అటువుంచి, కనీసం దేవాలయానికి వెళ్ళే మార్గం కూడా వర్షాలకు తట్టుకొనేలా నిర్మించబడడం లేదు ఈ కాలంలో.

No comments:

Post a Comment