Monday, May 18, 2026

 **శ్రీరామ**

ముందుమాట:-
                 ఈ నా రచనకు ఏం   పేరు పెడదామని, ఎలాంటి శీర్షిక అయితే బాగుంటుందని ఎంతగా ఆలోచించినా కూడా
ఈ రచనకు సంబంధించి "అమ్మ" అన్న పదాన్ని మించి అందమైన, హాయిగల పదం దీనికి మించిన తీయనైన పదం నాకు మరొకటి కనబడలేదు, తోచలేదు. "అవతార మూర్తి అయినా అణువంతే పుడతాడు. అమ్మ ప్రేగు పంచుకునే అంతవాడు అవుతాడు" అని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు చెప్పినట్లుగా ఈ ప్రాపంచిక సృష్టిలో అమ్మ అనే పదాన్ని మించిన  గొప్ప పదం నాకింక వేరేదీ కనబడలేదు, తోచలేదు మరి అందుకే ఈ రచనకు...   

        ***❤️ *అమ్మ* ❤️***
అమ్మ గుర్తుకువస్తోంది. చిన్నప్పుడు నాకు స్నానం చేయించేముందు ఆ నీళ్ళలో చేయిపెట్టి ఆ నీళ్ళు నా ఒంటికి హాయిగా అనిపించేంత వేడిగా ఉన్నాయో లేదోనని చూసి, నాకు సరిపడా "తగుమాత్రం వేడి " ఉన్న నీళ్ళతో స్నానం చేయించి, స్నానం అయిపోయియాక శ్రీరామరక్ష అని ఆఖరున చెంబుడు నీళ్ళు తిప్పిపోసే అమ్మ గుర్తుకొస్తోంది. ఆ తర్వాత వెచ్చగా కాపు కాచేది . నేను తినగలిగేలా అంటే నా నోటికి ఎక్కువ కారం కాకుండా, నా పొట్టకి అంత భారం కాకుండా అంటే నా నోటికి రుచిగా, పొట్టకి హాయిగా ఉండేలా అంత ఎక్కువ వేడి, కారం లేకుండా ఉందోలేదోనని తాను ముందుగా రుచి చూసి నాకు తినిపించే అమ్మ ప్రేమ గుర్తుకొస్తోంది. పుట్టినరోజున నన్ను చక్కగా తయారుచేసి నన్ను తృప్తిగా చూసుకుని మళ్ళీ తన దృష్టే తగులుతుందేమోనని కలతచెంది మొదట తల్లి దిష్టి అనే మొదలెడుతూ నాకు దిష్టి తీసే అమ్మ గుర్తుకొస్తోంది. అది తలుచుకుంటే, అమ్మ ప్రేమను నా మనసు ఇప్పుడు కూడా అనుభూతి చెందుతోంది. నేనడిగిన, నాకు ఇష్టమైన ఆహార పదార్థాలు, నేను నాకు చేయమని, తింటానని అడిగిన వంటకాలను, నేను బడి నుండి వచ్చేటప్పటికి తయారుచేసి, నేను ఇంటికి వచ్చేవరకూ ఎదురు చూస్తూ, వచ్చాక తినిపించబోతే, నేను అప్పుడు వాటిని తినకుండా స్నేహితుల పుట్టినరోజు వేడుకకని స్నేహితుల ఇంటికి విందుకు  వెళ్ళబోతే, మొదట నొచ్చుకున్నా, తర్వాత వెంటనే తమాయించుకుని నన్ను ముద్దు పెట్టుకుని, చిరునవ్వుతో జాగ్రత్తగా వెళ్ళి, ఆనందంగా గడిపి రమ్మని దీవించి నా నుదుట విభూతి బొట్టు పెట్టి పంపించే అమ్మ గుర్తుకొస్తోంది. తలుచుకుంటే నా మనసు అమ్మప్రేమని ఇప్పుడు కూడాఅనుభూతి చెందుతోంది. నేనెక్కడికి వెళ్ళినా, ఇంటికి తిరిగి వచ్చేవరకు కళ్ళన్నీ గుమ్మంవైపే పెట్టి మనసంతా నా క్షేమాన్నే కోరుకుంటూ దేవున్ని తలచుకుంటూ ఎదురుచూసే అమ్మే గుర్తుకొస్తోంది. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ సరిగా తిన్నానో లేదోనని తిరిగి వచ్చాక మళ్ళీ కొసరి కొసరి తినిపించే అమ్మ గుర్తుకొస్తోంది. ఆఖరికి నేను ఎక్కడైనా ఒక ప్రత్యేకమైన విందుకి వెళ్ళినా కూడా అక్కడ సరిగా తిన్నానో లేదోనని, తిరిగివచ్చాక మళ్ళీ కనీసం పెరుగు అన్నమైనా తిను అని కొంచెం పెరుగన్నం కలిపి తానే తన చేత్తో తినిపించేది. మళ్ళీ నేను తిన్నాక ఆఖరిముద్ద దిష్టి తీసే అమ్మ గుర్తుకొస్తోంది. అది తలచుకుంటే ఈ క్షణం కూడా నా మనసు అమ్మప్రేమను అనుభూతి చెందుతోంది. అవునన్నట్లు, ఇంక తింటూ తింటూ నేను మధ్యలో తుమ్మితే చిరంజీవ చిరంజీవ అని మా గోత్రాన్ని, గోత్ర ఋషిని, మా ఇంటి ఇలవేల్పునీ తలచుకుని మా ఇంటిపేరుతో సహా నాపేరు చెప్పి ఆ దేవతను చల్లగా చూడమని నామీద నీళ్ళు చల్లేది. అది తలుచుకుంటే అమ్మ ప్రేమతో   ఈ క్షణం కూడా నా హృదయం తడిసిపోతోంది.  తను అలా నీళ్ళు చల్లి నప్పుడు, మరీ చిన్నప్పటి నా నవ్వుల కేరింతతో, కొంచెం పెద్దయ్యాక చిలిపిగా నవ్వే నా నవ్వుతో తన ముఖం ఎంత వికసించేదో..😍, ఎంత వెలిగిపోయేదో...🤩 అదంతా నాకిప్పుడు గుర్తుకొస్తోంది ఆ జ్ఞాపకంతో నా కన్ను చెమరిస్తోంది. నేను తిన్నాకనే తనకి తృప్తి. నేను తింటేనే తన ఆకలి తీరినట్లుగా భావించే అమ్మ., అప్పుడు ఏదో శాస్త్రానికి అన్నట్లుగా కొంచెం తిని, అన్ని సర్దుకుని, అప్పుడెప్పుడో తెల్లవారుఝామున లేచిన అమ్మ, ఇంటి పనులతో, నా పనులతో క్షణం తీరిక లేక అలసిపోయినా కూడా నా నవ్వులో, నా అల్లరిలో తన విశ్రాంతిని, ఆనందాన్ని పొంది, ఎంతో అలసటగా ఉన్నా కూడా మళ్ళీ పడుకునే ముందు నాకు ఎన్నో నీతి కథలు చెప్పి నన్ను నిద్రపుచ్చే అమ్మ గుర్తుకొస్తోంది. అమ్మప్రేమను తలచుకుంటే ఇప్పటికీ నా మనసు ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతోంది. ఇంక చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చిందంటే అమ్మని కదలనివ్వడమే!... ఊహూ🙅... అసలు చిన్నప్పుడు నాకు జ్వరం  వస్తే అమ్మకేమో ఆందోళన. నాకేమో ఆనందం, ఎందుకంటే... అమ్మ ప్రక్కకి వెళ్ళినా, దూరంగా వెళ్ళినా కూడా ఓ కంట నన్ను కనిపెట్టుకునే ఉంటుందన్న విషయం తెలీని పసి వయస్సులో, అమ్మ నా ప్రక్కనే ఉండి, నాతోనే ఎక్కువ సమయం గడుపుతుందనే ఆలోచనతో, ఆశతో వచ్చే ఆనందం నాది. నా వేడి నుదిటి మీద తన చల్లని చేయ వేసి చూసి అయ్యో ఇంకా తగ్గలేదే, ఇంకా వేడిగానే ఉందే అని కంగారు పడే అమ్మ గుర్తుకొస్తోంది. ఎప్పుడైనా నాకు ఒంట్లో బావులేకపోయినా, ఆ చేదు మాత్రల సంగతెలా ఉన్నా, నోటికి ఏమీ సయించక నోరంతా వెగటుగా ఉన్నమాట ఎలా ఉన్నా కూడా, నా వేడి నుదిటి మీద తన చల్లని చేయ వేసి చూసి అయ్యో ఇంకా తగ్గలేదే, ఇంకా వేడిగానే ఉంది అని కంగారుపడుతూ చెప్పే మాట నాకు ఆనందాన్ని కలిగించేది. ఆనాటి ఆ మాధుర్యం ఈ నాడు కూడా గుర్తుకొస్తోంది. మళ్ళీ ఆరోజులు తిరిగివస్తే ఎంత బాగుండును అనే వెర్రి ఆలోచనని కలిగిస్తోంది. నాకు ఒంట్లో బావులేనప్పుడు ఎన్నెన్ని నిద్ర లేని రాత్రులు గడిపిందో😒! ఒకటా, రెండా నాకు ఎన్ని, ఎన్నెన్ని సేవలు చేసిందో కదా😞! నాకోసం ఎన్నెన్ని త్యాగాలు చేసిందో కదా😔! అయినా కూడా ఆమెకు తిరిగి నేనేమి చేయగలను? కేవలం వాటిని గుర్తు చేసుకోవడం తప్ప😞. మీకో విషయం చెప్పనా? తను నాకు ఇంత చేసినా కూడా అమ్మ, కనీసం నేను వాటిని గుర్తుంచుకోవాలని కూడా కోరుకోదు. ఇంక తను నా నుండి ఏమి ఆశిస్తుంది🤷!? కానీ ఆలోచించగా🤔 ఆలోచించగా నాకైతే ఒక మార్గం దొరికింది. కర్తవ్యం బోధ పడింది. అన్నింటికన్నా ముందు నేరొక నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నాను. అదేమిటంటే.. వయసు పెరిగి, వృద్ధాప్యం మీద పడిన కారణంగా, కుచించుకుపోయి చిన్నదైన మెదడు వల్ల అమ్మ, ఇంతకుముందులా ఉత్సాహంగా, సమర్ధవంతంగా పనిచేయలేకపోతోంది. అందువల్ల అంత చురుకుగా తెలివిగా మాట్లాడలేకపోవడమే కాకుండా నాకు కోపం తెప్పించేవిధంగా మాట్లాడడం, ప్రవర్తించడం చేసే అమ్మపై ఏమాత్రం  నేను తిరిగి కోపగించుకుని, పరుషంగా మాట్లాడకూడదనీ, ఆమె మనసు నొచ్చుకునే - విధంగా ఎంతమాత్రం ప్రవర్తించకూడదని, ఆమెను నా మాటల ద్వారా, చర్యల ద్వారా ఏమాత్రమూ బాధపెట్టకూడదనే నిర్ణయాన్ని తీసుకుని, ఈ తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రమూ ఏమరిపాటుగా ఉండకూడదని నా మనసుకు గట్టి హెచ్చరికగా పదే పదే చెప్పుకుని, నాకు నేనుగా ఒక పూనికగా తీసుకుని దానిని పాటించడానికి ప్రయత్నించి సత్ఫలితాన్ని సాధించాను. తద్వారా నామీద నాకు ఈమాత్రం నియంత్రణ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అమ్మ నాకు చేసినదానికి సరిసమానం కాకపోయినప్పటికీ, అమ్మప్రేమతో ఏదీ సరితూగకపోయినా కూడా, తన బిడ్డ తనకోసం ఏకొంచెం సంతోషపెట్టే, ఏ చిన్నపని చేసినాకూడా, అమ్మ అందులో అనంతమైన ఆనందాన్ని వెతుక్కుంటుంది. అందుకే రేపు అమ్మని చక్కగా తయారుచేసి, అంటే అదే చలికాలం కదా.., అందుకని స్వెట్టర్ అదీ వేసి మఫ్లర్ అదీ కట్టి అలా బయటికి షికారుకి తీసుకెళదామనుకుంటున్నాను.అచ్చం నా చిన్నప్పుడు అమ్మ నన్ను పార్కులకి, బీచ్ కీ అదీ తిప్పి నాకు చూపించినట్లే😍. సరే మొత్తానికి ఒకరోజు మంచినీళ్ళు, ఇంకా దారిలోకి అవసరమైనవన్నీ తీసుకుని అమ్మ, నేను షికారుకైతే బయల్దేరాము. ఇవాళ, నేను అమ్మకి సాధారణంగా ఈ మధ్య బయటకు వెళ్ళేటప్పుడు పెట్టే షరతులేమీ పెట్టలేదు. నిబంధనలేవీ విధించలేదు. ఏరకమైన హెచ్చరికలనూ జారిచేయలేదు. ఇంకేజాగ్రత్తలూ చెప్పలేదు. కేవలం నేను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటున్నానంతే. హాయిగా స్వేచ్ఛగా మాట్లాడమనీ, . స్వతంత్రంగా తను ఎలా కావాలనుకుంటే అలా ఉండమనీ చెప్పాను. చెప్పానుగా, ఇంతకుముందులా అమ్మ తెలివిగా మాట్లాడట్లేదనీ, చురుకుగా ఉండట్లేదనీ, అమ్మకు కూడా వయసు పెరిగిందనీ, వృద్ధాప్యంలో ఉందనే విషయాన్ని మొదట నేను జీర్ణించుకోలేకపోయాను. అమ్మ ఎప్పటికీ నా చిన్న ప్పుడు చూసినట్లుగానే ఉండాలని కోరుకోవడం తప్పే కదా🤷! అమ్మ వయసులో పెద్దదవుతోంది తిరిగి బాల్య దశకు చేరుకుంటోందన్న కఠిన నిజాన్ని నా మనసుకి తీసుకోలేకపోయాను. జీవితంలో ఈ దశ ఎవరికైనా సహజమే, ఆమె అలా ఉండడం సాధారణమే అన్న కోణంలో నేనెప్పుడూ ఆలోచించనే లేదు. అందుకని బయటకు వెళ్ళేప్పుడు ఇలా మాట్లాడకు, అలా ఉండకు, ఇది తినకు, అలా నడుచుకో అంటూ నీతి బోధలు చేయడం, అలా ఆమెను కట్టడి చేసి ఇదంతా ఆమె మంచికే, ప్రేమతోనే ఇలా చెబుతున్నాను అంటూ నేను భ్రమ పడుతూ ఒక చిన్నపాటి పైశాచిక ఆనందం పొందడం అనే చెడు అలవాటుకు నేను ఇన్నాళ్ళు బానిసనైనాను. ఇప్పుడు కళ్ళు తెరిచి, బుద్ధి తెచ్చుకున్నాను. ఈ రోజు కొంచెం నలతగా ఉందని అమ్మ అంటే చాలు ఇవి తిన్నావు, అది చేసావు అంటూ రకరకాల కారణాలు చెప్పి, ఇక ఆమె నాతో తన ఆరోగ్య సమస్య చెప్పి ఊరట పొందే, తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇన్నాళ్ళూ హరించివేసాను. " *నిజానికి ఆమె వేసుకునే బలం మాత్రల వల్ల ఆమెకు బలం చేకూరడం కానీ, నొప్పి మాత్రల వలన నొప్పి తగ్గడం అంటూ కాని ఏమీ లేదు. తనకోసం కొంచెం నా సమయం వెచ్చించి తనతో నేను గడిపే కాలం, తను నాతో చెప్పే నాలుగు మాటలు ఓపికగా విని, నేను ఆమెతో చెప్పే నాలుగు ఓదార్పు మాటలే తనకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి తనకు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయని* " ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆలస్యమైనా కూడా తెలుసుకున్నాను,తెలుసుకుని ఇప్పటికైనా మారాను. ఫరవాలేదు, అదేతృప్తి.  అందుకే అమ్మను పార్కుకు తీసికెళ్ళినప్పుడు, తను స్వేచ్ఛా జీవిలా ఎంతో హాయిగా, ఆనందంగా ఉయ్యాల ఊగుతుంటే, పడిపోతావని నేను వారించలేదు సరికదా పడిపోకుండా అచ్చం అమ్మలాగే జాగ్రత్తగా చూస్తూ ఊయల ఊపాను. ఆడించాను. తను అడగడమే తడువుగా ఐస్ క్రీం కొన్నాను.  షుగర్ అనీ,జలుబు చేస్తుందనీ అడ్డు పెట్టలేదు. తను పాపం ఆశగా తినాలనుకున్న మొక్క జొన్నపొత్తును నమల లేక రెండే గింజలు తిన్నా కూడా ఈ సారి నా కడుపు నిండిపోయింది. పడుకునేటప్పుడు అమ్మ ప్రక్కన పడుకుంటూ నాకు తనకు మాత్రమే తెలిసిన విషయాలూ, నా చిన్నప్పటి సంగతులూ, మధ్య మధ్యలో లోకాభిరామాయణం మొదలైనవన్నీ మాట్లాడుకుంటూ అమ్మను నిద్రపుచ్చాక నేను నిద్రపోవడం నా దినచర్యలో భాగంగా మారింది. ఆ విధంగా నా దినచర్య ముగియడం అమ్మ సంగతేమో కానీ నాకు మాత్రం అమితమైన ఆనందాన్ని, సంతృప్తిని కలిగిస్తోంది. లేకపోతే,  అమ్మని నేను విసుక్కున్నా, తనని బాధపెట్టే విధంగా ఏమాట అన్నా కూడా అమ్మ కన్నా కూడా నాకే ఎక్కువ బాధగా ఉండేది. కానీ... ఇప్పుడు అచ్చం అమ్మలా కాకపోయినా, దాదాపుగా మా అమ్మని, నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చూసి, పెంచిన విధంగానే మంచిగా, ప్రేమగా మా అమ్మని చూసుకుంటున్నాను. ఇంతకన్నా నాకు ఆత్మ సంతృప్తిని కలిగించే విషయం ఇంకోటి ఉండదేమో. మరి మీ సంగతి? అమ్మని, అచ్చం అమ్మ మనలను చిన్నప్పుడు చూసినట్లుగా ఇప్పుడు మీరు ప్రతివిషయంలోనూ అంతే ప్రేమగా, అచ్చం అమ్మలానే చూసుకుంటున్నారా?👍😊
జ్యోతి సంపర

No comments:

Post a Comment