"వరవీణా మృదుపాణి" సరస్వతిని ఉద్దేశించినదా? లక్ష్మిని ఉద్దేశించినదా?
ఇది కొంత వివాదాస్పదమైన అంశమే. ఈ పాటను సరస్వతి దేవి పరంగా, లక్ష్మీదేవి పరంగా కూడా అన్వయం చెప్పవచ్చు. దీన్ని రాసింది అప్పయ్య దీక్షితులు (అప్పయ్య దీక్షితార్) అని చెబుతారు.
ముందుగా ఈ పాట సాహిత్యాన్ని చూద్దాం:
వరవీణా మృదుపాణీ
వనరుహ లోచన† రాణీ
సురుచిర బంభరవేణీ
సురనుత కల్యాణీ
నిరుపమ శుభగుణలోలా
నిరత జయప్రదశీలా
వరద ప్రియ రంగనాయకి
వాంఛిత ఫలదాయకి
సరసీజాసన†† జననీ‡
జయ జయ జయ జయ‡‡
వీణాపాణి అనగానే మనకు సరస్వతీ దేవి మాత్రమే గుర్తుకు వస్తుంది కదా? అందుకే అందరూ ఈ పాట సరస్వతి గురించే అనుకొంటారు. అయితే మిగిలిన పంక్తుల్లోని ప్రతిపదార్థం చూద్దాం:
ప్రతి పదార్థము:
వరవీణా = శ్రేష్ఠమైన వీణ
మృదు = సున్నితమైన
పాణీ = చేతులు (శ్రేష్ఠమైన వీణను సున్నితంగా చేతులందు కలదానా)
వనరుహ = పద్మం
లోచన = కళ్ళు (కలవాడు)
రాణీ = రాణి (పద్మలోచనుని రాణి)
సురుచిర = అందమైన
బంభర = తుమ్మెదల వంటి
వేణీ = కురులు (కలదానా!)
సుర = దేవతలచే
నుత = స్తుతించబడ్డ
కల్యాణీ = శుభం కూర్చే దానా!
నిరుపమ = (ఉపమ = సామ్యం
నిరుపమ = సామ్యం లేని)
శుభ = మంచి
గుణ = లక్షణాలు
లోలా = కదులునది (శుభ గుణాలతో కదులునది)
నిరత = ఎల్లప్పుడూ
జయ = విజయమును
ప్రద = ప్రసాదించే
శీలా = గుణం కలదానా!
వరద = వరములిచ్చు వాని
ప్రియ = ఇష్టసఖియైన
రంగనాయకి = రంగనాయకుని సతి
వాంఛిత = కోరిన
ఫల = ఫలములు
దాయకీ = ఇచ్చునది
సరసిజాసన = సరసిజ + ఆసన = పద్మం ఆసనంగా కలదానా/కలవాడు
జనని = తల్లి
జయ = విజయము
ఇప్పుడు సరస్వతి పరంగా అర్థం చెప్పుకోవాలంటే:
శ్రేష్ఠమైన వీణ చేతులందు సున్నితంగా కలదానా! పద్మం వంటి కళ్ళు ఉన్న బ్రహ్మ(?)కు రాణి! అందమైన తుమ్మెదల వంటి కురులు గలదానా! దేవతలచే స్తుతింపబడి లోక కల్యాణం చేసేదానా! అనుపమ శుభ గుణాలతో కదిలేదానా! ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే గుణంకలదానా! వరములిచ్చు వాని ఇష్టసఖి! రంగనాయకుని సతి! కోరిన ఫలములు ఇచ్చుదానా! పద్మం ఆసనంగా కలదానా! తల్లీ! నీకు విజయము!
ఇప్పుడు లక్ష్మి పరంగా అర్థం చెప్పుకోవాలంటే:
శ్రేష్ఠమైన వీణ చేతులందు సున్నితంగా కలదానా! పద్మం వంటి కళ్ళు ఉన్న విష్ణువుకు రాణి! అందమైన తుమ్మెదల వంటి కురులు గలదానా! దేవతలచే స్తుతింపబడి లోక కల్యాణం చేసేదానా! అనుపమ శుభ గుణాలతో కదిలేదానా! ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే గుణంకలదానా! వరములిచ్చు విష్ణువుకు ఇష్టసఖి! రంగనాయకుని సతి! కోరిన ఫలములు ఇచ్చుదానా! పద్మం ఆసనంగా కలవాడైన బ్రహ్మకు తల్లీ! నీకు విజయము!
అయితే, రంగనాయక అన్నది ముఖ్యంగా విష్ణువు గురించి, రంగనాయకి అన్నది విష్ణువు పత్ని అయిన లక్ష్మిదేవి గురించి ప్రయోగించడం ఆనవాయితీ. శ్రీరంగంలో ఉన్న విష్ణువాలయం శ్రీవైష్ణవ దేవాలయాలలో ప్రముఖమైనది కాబట్టి దక్షిణ భారతీయుడైన అప్పయ్య దీక్షితార్ బ్రహ్మ గురించి రాసి ఉంటాడని అనుకోను. రంగనాయకుడు విష్ణువు అయితే రంగనాయకి లక్ష్మీ దేవి అవుతుంది, తప్ప సరస్వతి కాలేదు.
అలాగే, వరద అన్న విశేషణం కూడా బహుళంగా విష్ణువుకు మాత్రమే మనకు కనిపిస్తుంది. వరద అంటే విష్ణువు అయితే, వరదప్రియ అన్నది లక్ష్మి తప్ప సరస్వతి కావడానికి వీల్లేదు.
అదే విధంగా వనరుహలోచన అన్న విశేషణం కూడా ఎక్కువగా విష్ణువుకే వాడడం మనకు కన్పిస్తుంది. కాబట్టి వనరుహలోచన రాణి అన్నది లక్ష్మికే అన్వయం కూర్చడం సులభం.
ఇక సరసిజాసన జననీ అన్నది ఇక్కడ ప్రధానమైనది. సరసిజాసన అన్నది బ్రహ్మకే ప్రాయికంగా ఆపాదిస్తారు. కాబట్టి బ్రహ్మ కమలభవుడు అయితే, సరసిజాసన జననీ లక్ష్మి మాత్రమే అవుతుంది.
అలాగే జయప్రద (విజయాలను కూర్చేదానా), కల్యాణి (శుభం కూర్చేదానా) అన్న విశేషణాలు సామాన్యంగా లక్ష్మీదేవికే ఆపాదిస్తారు. సరస్వతిని జయప్రద అని గానీ, కల్యాణి అనిగానీ సంబోధించే స్తుతులు సంస్కృతంలో నాకు తెలిసి లేవు.
స్థూలంగా చెప్పాలంటే, ఇది నిజంగా అయ్యప్ప దీక్షితులు రాసిందే అయితే, అద్వైత సిద్ధాంత ప్రచారానికి జీవితం అంకితం చేసిన ఆయన శివుణ్ని, విష్ణువును స్తుతిస్తూ కావ్యాలు, కృతులు రాసాడు కాబట్టి ఇది రంగనాయకి అయిన విష్ణుపత్నిని సంబోధిస్తూ రాసాడని నా అభిప్రాయం!
† కొంతమంది దీన్ని తెలుగు వాక్యంగా చేసి వనరుహ లోచను రాణి అని పాడుతారు. కానీ తమిళం మాతృభాషగా గల అప్పయ్య దీక్షితులు తెలుగులో రాయలేదు. చివరి పంక్తిలో ఉన్న సరసీజాసన అన్నదాన్ని కూడా కొంతమంది తెలుగు వాళ్ళు సరసీజాసను (సరసీజాసనుని అన్న అర్థంలో) పాడుతారు.
‡ సరసీజాసన జననీ అన్నది కొంతమంది సరసీజాసన రాణీ అని పాడుతారు.
‡‡ కొంతమంది చివర జయ జయ జయ జయ అని కాకుండా జయ జయ జయ జయ వాణీ అని పాడుతారు.
[[తా.క. వీణాపాణి అనగానే మనకు సరస్వతీ దేవి మాత్రమే గుర్తుకు రావడానికి ముఖ్యమైన కారణం రవివర్మ: మనం ఇప్పుడు ఊహించుకొనే దేవతల రూపాలన్ని ఒక రకంగా రవివర్మ చిత్రాల్లోని ఊహలే.
సరస్వతి అంటే వీణాపాణిగా, పుస్తకధారిగా ఈ కింది రూపంలో ఉంటుందని మన ఊహల్లో ప్రతిష్టింపజేసిన ఘనత రవివర్మకే దక్కుతుంది:
లక్ష్మి అంటే ఇలా ఉండాలని ఈ రూపం మనలో ముద్రింపజేసింది కూడా రవివర్మ చిత్రపటమే:
No comments:
Post a Comment