రవీంద్రని విశ్వజనీనమైన
తాత్విక, ఆధ్యాత్మిక సాహిత్య దృక్పథాన్ని
ఒకే చోట అందించే గొప్ప సంకలనం ఇది
పుస్తకాల అరలో దాచుకోదగ్గ అద్భుతమైన అపురూపమైన సంకలనమిది
--------------------
‘ది పోస్ట్ ఆఫీస్’ (డాక్‌ఘర్)
ఒక అద్భుతమైన దృశ్యకావ్యం.
పైకి ఒక చిన్న ...బాలుడి కథలా అనిపించినా
అంతర్లీనంగా
ఉండే తాత్వికత, వేదాంతం
చదువరుల హృదయాలను కదిలిస్తాయి.
********
అమల్' అనే ఒక అనాథ బాలుడు
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటాడు.
అతడిని పెంచుకుంటున్న మావయ్య (మాధవ్) వైద్యుడి సలహా మేరకు అమల్‌ను ఇల్లు దాటి బయటకు వెళ్ళనివ్వడు.
నాలుగు గోడల మధ్యే బందీ అయిన అమల్,
ఆ గది కిటికీ పక్కనే కూర్చుని, బయట తిరిగే తోటమాలి, పెరుగు అమ్ముకునేవాడు, కాపలాదారు, మరియు చిన్న పిల్లలతో మాట్లాడుతూ లోకాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు.
సరిగ్గా అదే సమయంలో,
ఆ ఊరిలో రాజుగారు ఒక కొత్త 'పోస్ట్ ఆఫీస్' నిర్మిస్తారు.
అది చూసిన అమల్,
రాజుగారు ఎప్పటికైనా తనకోసం
ఒక ఉత్తరం పంపుతారని,
ఆ ఉత్తరాన్ని
తానే స్వయంగా చదువుతానని
ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటాడు.
**********
ఈ నాటకంలో
ఠాగూర్ ప్రతి పాత్రను, ప్రతి అంశాన్ని
ఒక గొప్ప ప్రతీకగా (Symbol) మలిచారు:
శారీరక పరిమితులకు లొంగని,
అనంతమైన స్వేచ్ఛను కోరుకునే
పవిత్రమైన మానవ ఆత్మకు ప్రతీక అమల్ .
ఆత్మను బంధించే
లౌకిక శరీరం లేదా సమాజం విధించే కట్టుబాట్లు.
నాలుగు గోడల ఇల్లు
ఇక్కడ రాజు అంటే
పరమాత్మ భగవంతుడు.
సృష్టికి, సృష్టికర్తకు
మధ్య ఉండే ఆధ్యాత్మిక అనుసంధానమే
పోస్ట్ ఆఫీస్.
రాజుగారి ఉత్తరం అంటే
మృత్యువు లేదా ముక్తి కోసం వచ్చే పిలుపు.
*********
నాటకం ముగింపులో
అమల్ కళ్ళు మూసి ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటాడు.
శారీరకంగా
అది మరణమే అయినా,
ఆధ్యాత్మికంగా అది బంధనాల నుంచి ఆత్మ పొందిన అసలైన స్వేచ్ఛ.
రాజుగారి వైద్యుడు వచ్చి
కిటికీలన్నీ తెరిపించినప్పుడు,
అమల్ భౌతిక ప్రపంచం నుంచి అనంత విశ్వంలోకి ప్రవేశిస్తాడు.
********
ఎన్నో భావోద్వేగాలు,
సున్నితమైన సంభాషణలు
ఈ నాటకంలో తారసపడతాయి
అమల్ పాత్రలోని
ఆ అమాయకత్వం, ఆరాటం
చదువరిని కలకాలం వెంటాడుతూనే ఉంటుంది
-------------------------
ఆధునిక ...
భారతీయ సాహిత్యంలోనే
ఒక మైలురాయి గోరా' (Gora)
అప్పటి
బ్రిటిష్ ఇండియా కాలం నాటి
సామాజిక, రాజకీయ, మతపరమైన వాతావరణాన్నే కాదు
సమకాలీనపు
వర్తమాన విషాదాన్నీ
ఒక అద్దంలా చూపిస్తూనే...
'అసలైన దేశభక్తి అంటే ఏమిటి?'
అనే ప్రశ్నను చాలా లోతుగా చర్చిస్తుంది.
********
నవల కథానాయకుడైన 'గోరా' (గౌరమోహన్)
కరడుగట్టిన సాంప్రదాయవాది.
హిందూ ధర్మాన్ని, ఆచారాలను
అత్యంత తీవ్రంగా సమర్థిస్తూ ....
వాటిని రక్షించడమే తన జీవిత ఆశయంగా బతుకుతుంటాడు.
విదేశీ సంస్కృతిని,
బ్రహ్మసమాజ ఆలోచనలను
అతడు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు.
ప్రతీ ఆచారాన్ని
గుడ్డిగానైనా సరే పాటించాలని వాదించే గోరా,
తన దేశం పట్ల ఎనలేని భక్తిని, ప్రేమను కలిగి ఉంటాడు
తన స్నేహితుడు 'బినోయ్'
ప్రగతిశీల భావాలు గల ఒక బ్రహ్మసమాజ కుటుంబానికి (పరేష్ బాబు కుటుంబం)
గోరా దగ్గరవ్వడంతో
కథలో ఘర్షణ మొదలవుతుంది.
ఆ కుటుంబంలోని
సుచరిత, లలిత వంటి పాత్రల పరిచయం
గోరా ఆలోచనలను, నమ్మకాలను పరీక్షకు గురిచేస్తుంది..
నవల ముగింపులో
గోరా జీవితాన్ని కుదిపేసే ఒక నిజాన్ని
అతడి తండ్రి వెల్లడిస్తాడు.
గోరా నిజానికి భారతీయుడు కాదని,
1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో
చనిపోయిన ఒక ఐరిష్ దంపతుల బిడ్డ అని
అతడిని తాము తెచ్చి పెంచుకున్నామని చెప్తాడు
ఆ క్షణంలో ...
గోరా కట్టుకున్న కులమతాల కోట
ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.
తాను ఏ హిందూ సమాజం కోసమైతే
మిగతా ప్రపంచాన్ని దూరం పెట్టాడో,
ఆ సమాజం ప్రకారం తానొక అపరిచితుడినని గ్రహిస్తాడు.
కానీ ఆ శూన్యం నుంచే
అతడికి అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది.
ఆ సందర్భంలో గోరా అనే మాటలు చిరస్మరణీయమైనవి:
"ఈరోజు నేను
నిజమైన భారతీయుడిని అయ్యాను.
నాలో ఇప్పుడు ఏ కుల, మత, వర్గ ఘర్షణలు లేవు.
ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ నా వాళ్లే."
అప్పటివరకు ...
ఒక సంకుచిత పరిధిలో ఉన్న గోరా,
ఆ క్షణంలో విశ్వమానవుడిగా రూపాంతరం చెందుతాడు.
చివరకు అతడు సమాజం దాటేసిన తన తల్లి 'ఆనందమయి' పాదాలకు నమస్కరించి, ఆమెనే అసలైన భారతదేశానికి ప్రతీకగా గుర్తిస్తాడు..
*********
మతం, కులం, ఆచారాల పేరిట
మనుషుల మధ్య గోడలు కట్టే సంప్రదాయాన్ని
ఠాగూర్ ఈ నవలలో ప్రశ్నించారు.
బాహ్య ఆచారాల కంటే
అంతర్గత మానవత్వమే గొప్పదని న
వల సాగుతున్న కొద్దీ ఠాగూర్ నిరూపిస్తారు.
దేశాన్ని ఒక మతంగానో
లేదా ఒక నిర్దిష్ట సమూహంగానో చూడటం కాదు...
దేశంలోని ప్రతి పేదవాడిని,
అట్టడుగున ఉన్న మనిషిని ప్రేమించడమే
నిజమైన దేశభక్తి
అని నిరూపిస్తాడు రవీంద్రుడు
------------------------
ఠాగూర్ కేవలం
కవి లేదా కథకుడు మాత్రమే కాదు...
అంతకంటే గొప్ప దార్శనికుడు, తాత్వికుడు
అని నిరూపిస్తుంది క్రియేటివ్ యూనిటీ' (Creative Unity).
ఇందులో ఆయన
పాశ్చాత్య దేశాల భౌతికవాదానికి,
ప్రాచ్య దేశాల (భారతీయ) ఆధ్యాత్మిక జీవన విధానానికి
మధ్య ఉన్న తేడాలను ఎంతో హేతుబద్ధంగా విశ్లేషించారు.
**********
క్రియేటివ్ యూనిటీ అంటే ఏమిటి?
(సృజనాత్మక ఐక్యత)
ఠాగూర్ దృష్టిలో
ఈ విశ్వమంతా ఒకే ఒక
సృజనాత్మక శక్తితో (Creative Force)
ముడిపడి ఉంది.
బాహ్యంగా
ప్రకృతిలో, మనుషుల్లో
ఎన్నో వైవిధ్యాలు కనిపించినప్పటికీ...
అంతర్గతంగా
వాటన్నింటినీ కలిపి ఉంచే
ఒక అదృశ్య 'ఐక్యత' (Unity) ఉంది.
ఆ ఐక్యతను గుర్తించడమే అసలైన జ్ఞానం.
ఎప్పుడైతే మనిషి
ఈ ఐక్యతను మర్చిపోయి,
తనను తాను ప్రకృతి నుండి లేదా
తోటి మనుషుల నుండి వేరుగా చూసుకుంటాడో,
అప్పుడే సమాజంలో
అశాంతి, స్వార్థం పెరుగుతాయి.
***********
కళ - సత్యం - అందం
(Art, Truth, and Beauty)
ఈ సంకలనంలో ఠాగూర్ 'కళ' (Art) యొక్క పరమార్థాన్ని అద్భుతంగా వివరించారు.
కళ అనేది
కేవలం వినోదం కోసం
లేదా నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం కాదు.
మనిషి తనలోని
అహంకారాన్ని (Ego) దాటి,
విశ్వజనీనమైన ఆనందాన్ని ఆవిష్కరించే ప్రసాదమే కళ.
సత్యం ఎక్కడైతే
సంపూర్ణంగా ఆవిష్కరించబడుతుందో,
అక్కడ అందం ఉంటుంది.
ఆ అందాన్ని సృష్టించడమే సృజనాత్మకత.
**********
జాతీయవాదం వర్సెస్ అంతర్జాతీయవాదం (Nationalism vs Internationalism)
తమ 'రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే' పరమావధిగా సాగే పాశ్చాత్య దేశాల సంకుచిత జాతీయవాదాన్ని (Western Nationalism) ఠాగూర్ ఈ వ్యాసాలలో తీవ్రంగా విమర్శించారు.
ఒక దేశం
మరొక దేశాన్ని అణచివేయడం,
కేవలం అధికారం, యంత్రాలపై ఆధారపడటం
మానవాళిని వినాశనం వైపు తీసుకెళ్తుందని ఆయన హెచ్చరించారు.
దీనికి ప్రత్యామ్నాయంగా,
మనుషుల మధ్య, సంస్కృతుల మధ్య
ప్రేమ మరియు పరస్పర గౌరవంతో కూడిన 'విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని' (Internationalism) ఆయన ప్రతిపాదించారు.
***********
తూర్పు - పడమరల కలయిక
(The Meeting of East and West)
పాశ్చాత్య దేశాల
సైన్స్, సాంకేతికత, మరియు లౌకిక ప్రగతిని
ఠాగూర్ పూర్తిగా వ్యతిరేకించలేదు.
కానీ, వాటికి
ప్రాచ్య దేశాల (తూర్పు దేశాల) ఆధ్యాత్మికత
ఆత్మపరిశీలన తోడవ్వాలని ఆకాంక్షించారు.
బాహ్య ప్రగతి (భౌతికవాదం)
ఎంత అవసరమో,
అంతర్గత వికాసం (ఆధ్యాత్మికత)
కూడా అంతకంటే ఎక్కువ అవసరమని,
ఈ రెండింటి సమతుల్యత వల్లే మానవజాతికి మనుగడ సాధ్యమని ఆయన నమ్మారు.
"కళాకారుడు
ప్రకృతి కంటే భిన్నమైనవాడు కాదు;
ప్రకృతి యొక్క సృజనాత్మక శక్తే
కళాకారుడి ద్వారా ప్రవహిస్తుంది."
ఇందులోని వ్యాసాలు చదువుతున్నప్పుడు..
ఒక ఉపాధ్యాయుడిగా, సమాజాన్ని లోతుగా గమనించే ఒక రచయితగా మన విద్యావ్యవస్థ, సంస్కృతిపై ఠాగూర్ చూపిన దార్శనికత ఎంతగానో ఆలోచింపజేస్తుంది.
----------------
హంగ్రీ స్టోన్స్ & అదర్ స్టోరీస్’
(Hungry Stones & Other Stories)
ఠాగూర్ కథా రచనలోని వైవిధ్యానికి,
ఆయన ఊహాశక్తికి ఒక అద్భుతమైన నిదర్శనం.
ఒకవైపు సమాజంలోని సున్నితమైన మానవ సంబంధాలను చూపిస్తూనే,
మరొకవైపు పాఠకులను అలౌకిక, అతీంద్రియ ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుతమైన కథల సంకలనం ఇది.
మనుషుల మధ్య వ్యక్తమవ్వని ప్రేమ ఒంటరితనం, ఆరాటాలను ఆయన చాలా నిశ్శబ్దంగా అక్షరీకరిస్తారు.
మనుషుల ఆలోచనలలోని అంతర్మథనాన్ని, భయాలను పట్టుకోవడంలో ఠాగూర్ శైలి అద్వితీయం.
రాసే ప్రతి అక్షరంలోనూ భావుకతను, తాత్వికతను నింపే ఒక కవి మాత్రమే ఇలాంటి కథలను సృష్టించగలడు.
*********
గీతాంజలి’ (Song Offerings)
కేవలం ఒక పుస్తకం కాదు...
అది మానవ ఆత్మ
భగవంతుడికి సమర్పించుకున్న అక్షర నివేదనం.
1912లో ఠాగూర్ స్వయంగా
దీనిని ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు,
ఆ కవిత్వంలోని అమృతాన్ని గ్రోలిన పాశ్చాత్య లోకం మంత్రముగ్ధురాలైంది.
దాని ఫలితంగానే 1913లో
ఆయనను వెతుక్కుంటూ సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది.
ఈ గౌరవాన్ని అందుకున్న
మొట్టమొదటి ఆసియా ఖండపు రచయిత ఆయనే.
గీతాంజలిలోని భక్తి
సంప్రదాయ విలువలకో, మూఢనమ్మకాలకో సంబంధించింది కాదు.
ఇందులో భగవంతుడు
ఎక్కడో ఆకాశంలో ఉండే సర్వాధికారి కాదు
ఆయన ఒక ప్రియుడు, ఒక స్నేహితుడు, ఒక మార్గదర్శి.
జీవాత్మ (మనిషి)
పరమాత్మతో కలవడానికి
పడే వేదన, ఆరాటం,
చివరకు పొందే పరమానందం
ప్రతి కవితలోనూ పల్లవిస్తుంది.
ఠాగూర్ తన అహాన్ని (Ego) పూర్తిగా వదిలేసి, తనను తాను ఒక శూన్యమైన పిల్లనుగ్రోవిగా భగవంతుడి చేతుల్లో పెడతారు.
ఆయన ఊదే శ్వాసే
తనలోని సంగీతం అని నమ్ముతారు.
"నీవు జపమాలలు తిప్పడం,
మంత్రాలు చదవడం ఆపెయ్!
తలుపులన్నీ మూసి
చీకటి గదిలో ఎవరిని పూజిస్తున్నావు?
నీ దైవం ఎక్కడ ఉన్నాడో తెలుసా...
ఎండనక, వాననక నేలను దున్నే రైతుతో ఉన్నాడు,
కఠినమైన రాళ్లను
పగలగొట్టే శ్రామికుడితో ఉన్నాడు.
ఆయన బట్టలు కూడా
వారిలాగే ధూళితో నిండి ఉన్నాయి.
నీవు కూడా నీ పట్టు వస్త్రాలను పక్కన పెట్టి
ఆ శ్రమజీవుల మధ్యకు రా...
అక్కడే నీకు దైవం కనిపిస్తాడు."
ఈ ఆలోచన ఠాగూర్ లోని సామాజిక స్పృహకు, మానవతావాదానికి నిదర్శనం.
సంగీతాన్ని, కవిత్వాన్ని
తన శ్వాసగా భావించే ఎవరికైనా
'గీతాంజలి' ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.
-----------------
ఓ సామాన్య బాలుడు
విశ్వ కవీంద్రుడైన మూలాలు
రవీంద్రుని 'బాల్య స్మృతులు
నిజం నిజం ....
రవీంద్రని విశ్వజనీనమైన
తాత్విక, ఆధ్యాత్మిక సాహిత్య దృక్పథాన్ని
ఒకే చోట అందించే గొప్ప సంకలనం ఇది
పుస్తకాల అరలో దాచుకోదగ్గ అద్భుతమైన అపురూపమైన సంకలనమిది
- రత్నాజేయ్ (పెద్దాపురం)
No comments:
Post a Comment